సీఎం పదవి: కేటీఆర్ వర్సెస్ ఈటెల, కాంగ్రెసు వ్యూహం ఇదీ...

మంత్రి ఈటెల రాజేందర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ తెలంగాణ కాంగ్రెస్ నుంచి వస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ టీఆర్ఎస్ నుంచి పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఆ డిమాండ్ చేస్తోంది.

Telangana Congress leaders support Eatela rajender for CM post

తనకు ఎవరినీ పోటీకి దింపినా తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయుడు కేటీ రామారావుకు కోపం రావచ్చు. ఆయనకన్నా ఎక్కువగా ఆయన కోటరీకి ఎక్కువ కోపం రావచ్చు. మంత్రి హరీష్ రావును పోటీ నుంచి తప్పించిన తర్వాత మరొకరు కేటీఆర్ కు టీఆర్ఎస్ లో పోటీకి వస్తారని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. కానీ, ఈ మధ్య కాలంలో తెలంగాణ కాంగ్రెసు, బిజెపి నాయకులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేరును పేరును ముందుకు తెస్తున్నారు. 

ఈటెల రాజేందర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచన చేశారు. కేటీఆర్ సమర్థుడే కానీ ఆయనపై వారసత్వ ముద్ర ఉందని ఆయన అన్నారు. ఈటెల రాజేందర్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఓ సందర్భంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అన్నారు. ఈటెల ఎందుకు సీఎం కాకూడదని ఆయన అన్నారు. ప్రతిపక్షాల నాయకులు ఈటెల రాజేందర్ పేరును ముందుకు తేవడం వెనక వ్యూహం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. 

అయితే, టీఆర్ఎస్ లో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే నాయకుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మేయర్ బొంతు రామ్మోహన్ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కాబోయే సీఎంకు శుభాకాంక్షలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. ఎమ్మెల్యేలు షకీల్, బాజిరెడ్డి గోవర్దన్ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని వారన్నారు. వచ్చే శాసనసభా సమావేశాలు కేటీఆర్ ఆధ్వర్యంలో జరగాలని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. 

కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే మంత్రులు, ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని ముందుగా అన్నది తానే అని దానం నాగేందర్ ఓ సందర్భంలో అన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రిని చేయాలనేవారిలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నారు. ఇంకా చాలా ఉండి ఉంటారు. 

అయితే, ఈటెల రాజేందర్ పేరును కాంగ్రెసు, బిజెపి నేతలు వ్యూహాత్మకంగా ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఆయన చేస్తున్న ప్రకటనలు అందుకు ఒక కారణం. ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా తాను ఉన్నా లేకున్నా రైతులకు అండగా ఉంటామని ఆయన చెప్పారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు ప్రకటించారు. మంత్రుల్లో ఆయన కాస్తా అధికారయుతంగా, స్వతంత్రంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. 

బీసీ నేత కావడం వల్ల ఈటెల రాజేందర్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిపక్షాలు అనుకున్నట్లు భావించవచ్చు. టీఆర్ఎస్ లో కొంత కలకలం సృష్టించడం వాటి ఉద్దేశంగా భావించవచ్చు. టీఆర్ఎస్ లో కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు భావిస్తున్నారు. రసమయి బాలకిషన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయని అంటున్నారు. దీంతో టీఆర్ఎస్ లోని బీసీ, ఇతర సామాజిక వర్గాల ఎమ్మెల్యేల్లో ఆలోచనను రేకెత్తించడం కూడా ప్రతిపక్షాల వ్యూహంగా భావించవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios