Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో సామజిక వర్గాల ఓట్ల కోసం రాజకీయ పార్టీల ప్రణాళికలు, బీసీ డిక్లరేషన్ అంటున్న కాంగ్రెస్

Telangana Politics-BC Voters: తెలంగాణలోని ప్రధాన పార్టీల చూపు బీసీల వైపు మళ్లింది. అత్యధికంగా ఉన్న బీసీ ఓట్లను తమ వైపు తిప్పుకోగలిగితే విజయం తమనే వరిస్తుందని అన్ని పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీలను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. తెలంగాణాలో దాదాపుగా 52 శాతం మంది పైచిలుకు ఓటర్లు బీసీ కులాలకు చెందిన వారు. ఇంత గణనీయమైన ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి.

telangana assembly election-bc voters to be the deciding factor-political parties busy devising strategies RMA
Author
First Published Jun 22, 2023, 3:44 PM IST

Telangana Assembly Election-BC Voters: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా త్వరలో మోగనుంది. ఎన్నికల పై ఇప్పటికే ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేయడానికి ఎత్తులు, పై ఎత్తులు వేయడంలో నిమగ్నమైపోయి ఉన్నారు. అధికార పార్టీ తాము ఏమి చేసామో చెబుతూ నూతన పథకాలను ప్రవేశ పెట్టాలని యోచిస్తుంటే, అధికార పక్షం లోపాలను ఎండగడుతూ తాము ఏమి చేయదల్చుకున్నామో వివరించేందుకు ప్రతిపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. 

ఎలాగైనా ఈసారి కూడా గెలిచి మూడవసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని కేసీఆర్ చూస్తుంటే, కేంద్రంలో అధికారంలో ఉండడం, గత పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవడంతో కాషాయ దళం కూడా తెలంగాణలో కమలం వికసిస్తుందని ఆశిస్తుంది. మొన్నటి కర్ణాటక ఎన్నికల విజయం, వరుస చేరికలతో వచ్చిన నూతన జోష్ తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కూడా హస్తగతం చేసుకోవాలని ముమ్మరంగా ప్రణాళికలు రచిస్తోంది. 

ఈ పరిస్థితుల్లో అన్ని ప్రధాన పార్టీల చూపు బీసీల వైపు మళ్లింది. అత్యధికంగా ఉన్న బీసీ ఓట్లను తమ వైపు తిప్పుకోగలిగితే విజయం తమనే వరిస్తుందని అన్ని పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీ లను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. తెలంగాణాలో దాదాపుగా 52 శాతం మంది పైచిలుకు ఓటర్లు బీసీ కులాలకు చెందిన వారు. ఇంత గణనీయమైన ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. 

విభజనకు ముందు తెలంగాణలో టీడీపీ కి ఒకింత బీసీల మద్దతు ఉండేది. ఇది పసిగట్టిన కేసీఆర్ కులాల వారీగా ఆకర్షక పథకాలను ప్రవేశపెట్టాడు. గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీ, నేతన్నలకు చేయూత అంటూ ఇలా అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టి బీసీలను ఆకర్షించారు, అధికారం పీఠం దక్కించుకున్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఎలాగైనా బీసీలను తమ వైపు తిప్పుకోవాలని ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ పథకాలను రచిస్తున్నాయి.  

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పిస్తామని  కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో చేర్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అంతే కాకుండా మొన్న ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ల మాదిరిగా బీసీ డిక్లరేషన్ ని కూడా ప్రకటించాలని భావిస్తుంది. జాతీయ పార్టీగా పార్లమెంటులో బీసీ గణన పైన డిమాండ్ చేయాలని, తద్వారా జనాల్లో బీసీల కోసం పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీయే అనే నమ్మకాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తుంది.   

తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేర్చుతామని ఇప్పటికే పలుమార్లు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. మరో అడుగు ముందుకు వేసి బీసీల ఆత్మగౌరవం అనే నినాదాన్ని కూడా భుజానికి ఎత్తుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. ఇందుకు గాను బీసీ డిక్లరేషన్ రూపొందించడానికి రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలకు చెందిన ముఖ్యులతో కూర్చొని మాట్లాడి వారి సలహాలు, సూచనలతో దీన్ని రూపొందించాలని సన్నాహాలను చేస్తుంది. 

తాజాగా తెలంగాణ ప్రభుత్వం కేవలం 14 బీసీ కులాలకు మాత్రమే ప్రకటించడం మిగిలిన బీసీ కులాలకు అన్యాయం చేయడమే అని వాదిస్తుంది. బీసీ జాబితాలోని 130 కులాలకు ఈ స్కీమ్ ను  అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక సోషల్ ఇంజనీరింగ్ కి సన్నాహాలు చేస్తుంది. కేవలం డిక్లరేషన్ తో మాత్రమే ఆగకుండా, 50 శాతం ఉన్న బీసీలకు 50 శాతం సీట్లు అనే నినాదంతో ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. 

ఇప్పటికే కేసీఆర్ సర్కార్ ని ప్రతిపక్షాలు దొరల పాలన అంటూ ఎద్దేవా చేస్తూ ఉండడాన్ని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ విషయాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా ఆలోచిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే బండి సంజయ్, ఈటెల రాజేందర్ లాంటి బీసీ నాయకులకి ముఖ్య పెదవులని కట్టబెట్టింది. జాతీయ స్థాయిలో కూడా బీజేపీ ఓబీసీ ఓట్ల తో సోషల్ ఇంజనీరింగ్ చేయడాన్ని మనము చూసాము. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ప్రయత్నాన్ని చేయాలని బీజేపీ యోచిస్తోంది. కానీ, తాజాగా బీజేపీలో అంతర్గత తగాదాలు, కర్ణాటక ఫలితాలు, చేరికలు లేకపోవడం వెరసి కాషాయదళం దూకుడు ఒకింత తగ్గింది. 

మొత్తానికి ఏదేమైనా, తెలంగాణలో అధికంగా ఉన్న బీసీలను ప్రసన్నం చేసుకున్న పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం మాత్రం తథ్యం. ఏ పార్టీ బీసీల ఓట్లను గణనీయంగా సాధిస్తుందనే విషయం మాత్రం ఎన్నికల ఫలితాలే తేల్చాలి..!

Follow Us:
Download App:
  • android
  • ios