చరిత్రలో నిలిచిపోయే వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే, అందుకు దోహదం చేసిన అనేక కారణాలను గనుక గమనం లోకి తీసుకుంటే, వాటిల్లో ఛాయాచిత్రం ఒక ముఖ్య పాత్ర వహిస్తుందనే చెప్పాలి.  ఒకరి ‘ఇమేజ్’ వెనకాల దాగి మరో ‘ఇమేజ్’ కూడా ఉన్నదని, అది స్టిల్ ఫోటోగ్రఫీ మహత్యం అని తెలుస్తుంది.

ఒక వ్యక్తి తాలూకు రూపం మన మనో ఫలకంపై చిరస్థాయిగా ముద్ర పడిందీ అంటే అందుకు వారి జీవిత కాలపు కృషి ఎంత ముఖ్యమో వారి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ఒక ఇమేజ్, అది సమాజంలో నిశబ్దంగా నెరిపిన ప్రభావం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు వివేకానందుల చిత్రమే అందుకు చక్కటి నిదర్శనం.  

స్వామి వివేకానంద చికాగో సదస్సుకు వెళ్ళినప్పుడు తీసిన ఈ ఫోటో వారి ప్రబల గుణశీలతను ఆవిష్కరిస్తుంది.

“లెండి, మేల్కినండి. గమ్యం చేరేదాకా అగవద్దు” అన్న వివేకానందుల మాటలు చదివినప్పుడు, అవి చెవులో గింగుర్లు కొట్టినప్పుడు యాదృచ్చికంగా మనకు గుర్తుకు వచ్చేది ఈ రూపమే. అది ఫోటోగ్రాఫే. 

మనం చూస్తున్న ఈ చిత్రం తీసింది థామస్ హారిసన్. మరో మాటలో చెప్పాలంటే, ఈ ఫోటో తీశాకే మనకు చప్పున స్పురించే వివేకానందుల గంభీర విగ్రహానికి బీజం పడిందనీ అనాలి. 

నిజానికి ఈ రూపంలో వివేకనందులు ఎప్పుడూ లేరు. అది ఆ  ఫోటోగ్రాఫర్ పెట్టించిన ఫోజ్. చిత్రమేమిటంటే, అదే, వివేకందులకు శాశ్వతమైన వక్తిత్వాన్ని ఇచ్చిందని ఛాయాచిత్ర ప్రపంచం మహిమ నుంచి గనుక విశ్లేషణ చేసుకుంటే బోధపడే వాస్తవం.

విశేషం ఏమిటంటే, ఇంకా ఎన్నో చిత్రాలు ఉన్నా కూడా, వేరే వాళ్ళు వందలాది తీసినా కూడా - ఈ రూపంలో తప్పించి మనకు వివేకానందులను మరో రీతిలో ఊహించుకోలేం. అందుకు కారణం ఒక వ్యక్తి ని ఎలా చూపాలీ అన్నది ఆయా ఫోటోగ్రాఫర్ విచక్షణ. అది నిస్సందేహంగా సఫలైమైంది. వివేకానందులకు గొప్ప ప్రాచుర్యం కలిగించింది.  

Also Read: శంకర్ పామర్తి : ధిక్కార కళకు దీపస్తంభం

1893లో సర్వ మత సమ్మేళనానికి వెళ్ళిన స్వామీ వివేకానంద “అమెరికా దేశపు నా ప్రియ సోదారీ సోదరులారా” అన్న పిలుపుతో ఎట్లా అయితే ఒక్క పరి సమస్త మతస్తులను అచ్చేరువొందించి వారందరి మనసులను దోచుకున్నారో, సరిగ్గా అంతటి ప్రభలశీలమైన ఫోటో ఇది. అది కూడా ముందు కాదు, నాటి చారిత్రాత్మక ప్రసంగం తర్వాత దిగిన ఫొటోనే.

“ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం” అని వివేకానందుల వారు చెప్పిన మాట ఎంత సూటిగా యువజనుల హృదయంలోకి వెళ్ళాయో... మరెంత బలంగా ఆ సందేశం నిత్యం మనకు స్ఫూర్తి నిస్తున్నదో...సరిగ్గా ఆ మాదిరే  స్వామి వివేకందుల సంపూర్ణ మనో నైతిక ఆధ్యాత్మిక బలిమికి ఈ చిత్రం నిఖార్సైన ఉదాహరణ.

వారి మాటల మాదిరే, వివేకనందులు స్పురమైన విగ్రహం, తలపాగాతో కూడిన ఆ రూపం –రెండు చేతులో కట్టుకుని చూసే ఆ సుద్రుడమైన చూపు - ఈ చిత్రం ప్రతేకత. ఒక రకంగా వివేకానందుల ఉత్తెజేకరమైన ప్రసంగం యావత్తూ ఇచ్చే స్ఫూర్తిని ఈ ఏకైక చిత్రం నిస్సందేహంగా ఇస్తుందీ అంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

థామస్ హారిసన్ చేసిన ఫోటో సెషన్ లోని ఒకానొక చిత్రం ఇది. వారు మొత్తం ఎనిమిది చిత్రాలను ఫైనల్ చేయగా వాటిల్లో ఐదు చిత్రాలపై  వివేకానందులు తర్వాత ఆటోగ్రాఫ్ చేశారు. అందులోనిదే ఈ ప్రసిద్ద చిత్రం. ఇది బహుల ప్రాచుర్యంలోకి వచ్చింది. గమ్మత్తేమిటంటే, గంటలకు గంటలు ఫోటో దిగడానికి గానూ కూచోవలసి స్వామిని చాలా చిరాకు పరించింది.

అలా అని, ఈ ఫోటో లేకుంటే వివేకానందుల ఇమేజ్ ఇంత ఘనంగా ఉండేది కాదా? అంటే కాదనే చెప్పాలి. అదే ఒక నిచ్చలన చిత్రం మహిమ. పౌరుల చేతనంలో ఒకరు చిరంజీవిగా ఉండటంలో ఫోటోగ్రఫీ ప్రాధాన్యం ఉన్నదనడానికి మంచి నిదర్శనం. ఒక్క వివేకనందులే కారు, మరికొందరు గురించి కూడా ఈ మాదిరి విశ్లేషణ చేయాలి.

ఏమైనా, పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ వేదాంతాన్ని, యోగా తత్వ శాస్త్ర రహస్యాన్ని అద్వితీయంగా బోధించిన వివేకానందులు ఇప్పటికీ, నేటికీ మనకు ఎనలేని స్ఫూర్తిని ఇస్తున్నారంటే, వారి భోధనలకు ఉన్న మహాత్య్యం వంటిదే వారి రూపానికీ ఉన్నదని నా భావన. ఆ రూపాన్ని అపూర్వంగా, చెరగని రీతిలో నమోదు చేసిన మహనీయులు థామస్ హారిసన్ కృషి గొప్పదని ఈ సందర్భంగా మనం అంగీకరించాలి. వారిని గుర్తు చేసుకోవాలి. ఇలాంటి అజ్ఞాత ఫొటోగ్రాఫర్ల కృషి వల్లే చరిత్రలో కొందరికి చెప్పుకోదగిన ఇమేజ్ చిరస్థాయిగా ప్రజల మదిలో హత్తుకు పోయిందని, ఆ దిశగా చరిత్రలో ‘ఇమజ్’ వెనకాల ‘ఇమేజ్’ ( పిక్చర్ ) కూడా ఉందని గుర్తించాలి.

ఫోటోగ్రఫీ మాధ్యమం గొప్పతనాన్ని, అందునా స్టిల్ ఫోటోగ్రఫీ ఆవశ్యకతను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుందనే ఈ చిన్న వ్యాసం. వివేకానందుల జయంతి సందర్భంగా అభినందనలతో....

- కందుకూరి రమేష్ బాబు
ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఫొటోగ్రాఫర్