ప్రధానమంత్రి మొన్న రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి "ఆత్మ నిర్భర్ భారత్"( స్వయం సమృద్ధ భారతదేశం) అని చెప్పింది మొదలు, దేశంలో ఇవే అంశాలు హెడ్ లైన్స్ గా మారిపోయాయి. ఆర్థికంగా ఎప్పటినుండో మందగమనాన్ని ఎదుర్కుంటున్న భారతదేశం... ఈ కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయిందని చెప్పక తప్పదు. 

లాక్ డౌన్ కాలంలో భారతదేశం రోజుకి సుమారు 35 వేల కోట్లను నష్టపోతుంది. ఆర్ధిక వ్యవస్థకు మూలస్థంభాలైన ప్రధాన నగరాలన్నీ కూడా రెడ్ జోన్లలోనే ఉన్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తి అరకొరగా మాత్రమే ప్రారంభమైంది. 

ఇలా ఆర్థికంగా పెనుసవాళ్లను ఎదుర్కొంటున్న భారతదేశానికి ఒక ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీ అత్యవసరం. ప్రధాని నరేంద్ర మోడీ ఇదే విషయమై జాతినుద్దేశించి ప్రసంగించారు. 20 లక్షల కోట్ల ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తున్నట్టు చెప్పారు. 

ప్రధాని 20 లక్షల కోట్లు అని చెప్పారు కానీ... దాని పూర్తి వివరాలను ఆర్ధిక మంత్రి ప్రకటిస్తారని చెప్పి వెళ్లారు. ఇక ప్రధాని అలా చెప్పిన దగ్గరి నుండి దేశం మొత్తంలో ఇందులో ఏముండబోతుంది, ఎలా ఉంటుంది ఈ ప్యాకేజీ అని అనేక చర్చలు జోరందుకున్నాయి. 

ప్రధాని ప్రకటించి వెళ్లిన తెల్లారి కరెక్ట్ గా సాయంత్రం "నాలుగు గంటలకు": ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ మీడియా ముందుకు వచ్చారు. ఆమె వచ్చి నిన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గురించి మాట్లాడి వెళ్లారు. ఆయా రంగాలకు అవసరమైన ఆర్ధిక వెసులుబాట్లను ప్రాకటించారు. 

మరల ఈరోజు కూడా సరిగ్గా సాయంత్రం "నాలుగు గంటలకు" వచ్చారు. నేడు రైతులు, వలసకూలీల విషయానికి సంబంధించి ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ మొత్తం హంబక్ అని, ఇది ప్యాకేజే కాదని రకరకాల ఆరోపణలను ప్రతిపక్షాలు చేస్తున్నాయి. 

ఈ లెక్కలు, ఆ ప్యాకేజీ వివరాలు, ప్రతిపక్షాల ఆరోపణలను కొద్దీ సేపు పక్కనపెడితే.... నిర్మల సీతారామన్ ప్రెస్ మీట్స్ నిర్వహిస్తున్న సమయం ఆసక్తిని రేకెత్తిస్తుంది. సరిగ్గా నాలుగు గంటలకు ఆమె మీడియా ముందుకు వస్తున్నారు. చూడడానికి ఇది సాధారణ విషయంగా అనిపించినప్పటికీ... ఇందులో నిగూడార్థం దాగి ఉంది.  

నిర్మల సీతారామన్ కన్నా ముందు ఆ సమయంలో ఇంకొకరు ప్రెస్ మీట్ నిర్వహించే వారు. అతనే లవ్ అగర్వాల్. భారత ఆరోగ్య శాఖలో జాయింట్ సెక్రటరీ. ఆయన ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి కరోనా పరిస్థితులపై పూర్తి డీటెయిల్స్ ని ఇచ్చేవారు. 

కానీ నిన్నటి నుండి ఆ స్లాట్ లో ఆర్ధిక శాఖ మంత్రి దర్శనమిస్తున్నారు. అందునా ఫుల్ టీం తో. ఆర్థికమంత్రితోపాటు సహాయ మంత్రి, రెవిన్యూ సెక్రటరీ, ఇతర సెక్రటరీలు కూడా ఉంటున్నారు. ఒకరకంగా మినీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అక్కడ ప్రత్యక్షమవుతుంది. 

కరోనా మహమ్మారి విలయతాండవం మొదలైనప్పటినుండి సాయంత్రం నాలుగు గంటల స్లాట్ ఒకరకంగా ప్రైమ్ టైం అని చెప్పవచ్చు. ఆ స్లాట్ ఇప్పుడు ఆరోగ్య శాఖ నుండి ఆర్ధిక శాఖ చేతుల్లోకి వెళ్ళింది. ఆ ప్రైమ్ టైం స్లాట్ లోకి ఇప్పుడు నిర్మల సీతారామన్ వచ్చారు. 

ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్నీ గమనిస్తే... మారిన ప్రభుత్వ కోణం మనకు కనబడుతుంది. "జాన్ హై తో జహాఁ హై" అని ప్రధాని నరేంద్రమోడీ తొలి ప్రసంగంలో అన్నారు. ఆ తరువాత "జాన్ బి జహాఁ భి" అని అన్నారు. 

తొలుత కరోనా పై పోరులో మనుషుల ప్రాణాలు అతిముఖ్యమని ప్రకటించిన ప్రభుత్వం, అటు పిమ్మట ఈ కరోనా తోపాటుగా బ్రతకడం తప్పనిసరి అని తెలిసిన తరువాత జీవితంతోపాటుగా ప్రపంచం కూడా అవసరం అని ప్రజలకు స్పష్టం చేసింది.  

ఇప్పుడు మనకు అదే కనబడుతుంది. ఇంగ్లీష్ లో చెప్పాలంటే... సర్వైవల్ టు రివైవల్. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం దృష్టాంతా ఆర్థికంగా భారతదేశాన్ని పట్టాలెక్కించి పూర్వ వైభవాన్ని తీసుకురావడం పై కేంద్రీకరించింది. అదే మనకు ఇప్పుడు ఈ విషయంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది.