Asianet News TeluguAsianet News Telugu

హేతుబద్ధ ముగింపు దిశలో... ఏపీ రాజధాని!

ఇప్పటికే భారత ప్రభుత్వం వద్ద గత ఐదేళ్లుగా అమలు కొరకు ‘పెండింగ్’లో ఉన్న 2014 నాటి అధికారిక (శివరామకృష్ణన్ కమిటీ) నివేదికకు 2020 లో పేరు మార్చి, అదే పుస్తకానికి కొత్త ‘కవర్’ వేసి జగన్ అమలులోకి తెచ్చారు. (ప్రాంతీయ పార్టీలకు ఉండే ఇటువంటి స్వంత ముద్ర యావను ఇటువంటప్పుడు మనమూ తప్పు పట్టలేము) అందులో భాగంగా ‘ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’ కు నిలయమైన సచివాలయం విశాఖపట్టణంలో పెట్టాలని కొత్త ప్రతిపాదన ముందుకు వచ్చింది. 

special story on ap capital shifting
Author
Amaravathi, First Published Dec 27, 2019, 7:42 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

-జాన్‌సన్ చోరగుడి

ఇరవై ఏళ్ల క్రితం మాజీ ముఖ్యమంత్రి చెంద్రబాబు నాయుడు ‘విజన్ 2020’ అంటూ ప్రకటించిన డాక్యుమెంట్ కాల పరిమితి ముగియడానికి, మరో నెల రోజులు వ్యవధి ఉంది. ప్రముఖ అమెరికా మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ మెకెన్సి ఏ.పి. ప్రభుత్వం కోసం అప్పట్లో ఈ ‘డాక్యుమెంట్’ తయారు చేసింది. అయితే ఇప్పటివరకు ఆ ‘విజన్’ ఎంత మేర అమలు జరిగిందో తెలియదు.

గడచిన ఐదేళ్ళలో దాని మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాక, చెంద్రబాబు నాయుడు ‘మీడియా’ తో మాట్లాడుతూ దాన్ని గుర్తుచేసుకున్నారు. దాన్ని- ‘‘Naidu to develop Vision 2020 plan for Andhra Pradesh again’’ అంటూ అప్పట్లో ‘బిజెనెస్ స్టాండర్డ్’ 10 జూన్ 2014 న వొక వార్తాకధనం రాసింది. రెండవసారి సత్యనాదెళ్ళ నుంచి ఇందుకోసం తాము ‘ఐడియాలు’ తీసుకుంటామని ఆయన అన్నారు. “Somehow this Vision 2020 concept did not catch the imagination of the people when I introduced it last time. We will adapt the idea to the new circumstances focusing on the development of 13 districts of residuary Andhra Pradesh” అన్నారాయన. అయితే, ‘విజన్ డాక్యుమెంట్’ విడుదల (జనవరి 26) 1999 -2020 ముగింపు మధ్య కాలంలో, దాని అమలు మాట ఎలా ఉన్నా రాష్ట్రం మాత్రం రెండుగా విడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మరోసారి 13 జిల్లాల ఏ.పి. కి కూడా ‘మైక్రోసాఫ్ట్’ సి.ఇ.వో. సత్య నాదెళ్ళ ‘ఐడియాలు’ కావాలి అంటున్నారు.

special story on ap capital shifting

(క్షేత్ర పర్యటనలో శివరామకృష్ణన్ కమిటీ)

ప్రతి సమస్యకు రైతులు రోడ్లు మీదికి వచ్చి ఆందోళన చేసే సామాజిక ఆర్ధిక సాంస్కృతిక నేపధ్యమున్న చోట, వొక అమెరికన్ కన్సల్టెన్సీ వొక అమెరికన్ వ్యాపార కంపెనీ సి.ఇ.వో.ల సలహాలు సంప్రదింపులు ఇక్కడ అవసరం అని చెంద్రబాబు ఇప్పటికీ బలంగా నమ్ముతున్నట్టు ఆయన చేసిన ఈ వ్యాఖ్య చెబుతున్నది. ఈ తీరు చివరికి యూనియన్ - ఫెడరల్ స్పూర్తిని ప్రశ్నిస్తూ, కేంద్ర ప్రభుత్వ చట్టాలను రాష్ట్రాలు ఖాతరు చేయని ధోరణిగా మారుతున్నది.

ఇటువంటి వైరుధ్యాలు వేర్వేరు రాజకీయ పార్టీలకు వాటి ప్రభుత్వాలకు ఉండడంలో ఆక్షేపణ లేదనుకున్నా- కనీసం ‘రాజ్యానికి’ (State) ఒక స్పష్టత ఉంటుంది, అని మనకు తెలియాలి కదా. మరి అది ఎందుకు ఇక్కడ జరగడంలేదు? వాస్తవానికి 20 దక్షణ ఆసియా దేశాలకు - భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి సంబధించిన విధివిధానాల పై అధికారులకు శిక్షణ ఇస్తున్న The Centre for excellence in Management of Land Acquisition, Resettlement and Rehabilitation అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ లో సోమాజిగూడ ‘ఈనాడు’ ఎదురుగా ఉంది.

భారత ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ఆర్&ఆర్ యాక్ట్ -2013 రూపొందిచడంలో ఇది కీలక పాత్ర పోషించింది. అలాగే ఇన్నాళ్ళు డిల్లీకి పరిమితమైన జాతీయ విద్యాసంస్థ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 15 ఏళ్ళుగా విజయవాడలో పనిచేస్తున్నది. ఐదేళ్ళ క్రితం ఏర్పడ్డ రాష్ట్రం ఉచితంగానో లేదా కొద్దిపాటి సర్వీస్ చార్జీలతోనో వీటి సేవలు వినియోగించుకోవచ్చు. వాస్తవాలు ఇలా ఉంటే, రాజకీయ పార్టీలు తమ నిర్ణయాలే అంతిమం అనే రీతిలో వ్యవహరిస్తూ, అవి ఎప్పటికీ మనల్ని సామాజిక నిరక్ష్యరాసులుగానో అర్ధ నిరక్ష్యరాశులుగానో ఉంచుతున్నాయి.

special story on ap capital shifting

(అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్)

ఈ ధోరణి వల్ల ఇటువంటి వాస్తవం ముందు ఇక్కడ మనం కూడా అంతే స్థాయిలో ముద్దాయిల్లా మిగులుతున్నాం. ‘అపాయింటెడ్ డే’ (2 జూన్ 2014) ముందు వరకు కూడా ‘సమైక్య ఉద్యమం’ అంటూ తాము విభజనను అపుతున్నామని, నమ్మబలికిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు, ఆలోచనాపరులు, పౌర సమాజ వేదికలు విభజన తర్వాత, కాడి క్రింద పడేసి కనుమరుగు అయ్యాయి. అస్సలు జరిగింది ‘విభజన’ కాదు, అనే మేధావులు సైతం ఇప్పటికీ మన మధ్య ఉండనే ఉన్నారు.

కొత్త రాష్ట్రంగా మన కాళ్ళమీద మనం నిలదొక్కుకోవాల్సిన సంక్లిష్టమైన కాలంలో గత ఐదేళ్లుగా ఇక్కడ జరిగింది ఏమిటి అనేది, తెలిసిందే. అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహనరెడ్డి శైలి మునుపటికి భిన్నంగా ఉంది. ఆచరణలో ఎటువంటి ఆర్భాటం లేకుండా, సూక్ష్మ ప్రణాళికతో తన మొదటి ఏడు నెలల కార్యాచరణ పూర్తిచేసి, కొత్త సంవత్సరంలోకి ఆయన అడుగుపెడుతున్నారు. ఎన్నికల ప్రణాళికలో పేదలకు బలహీన వర్గాలకు చేసిన ప్రధాన వాగ్దానాల అమలు ఇప్పటికే ఆయన పూర్తి చేసారు. వాటి కొనసాగింపుకు ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ సూక్ష్మ స్థాయిలో ప్రతి కుటుంబానికి చేరే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది.

నిజానికి ఇప్పుడు జరుగుతున్నది అంతా 2014 జూన్ 2 తర్వాత జరగవలసిన తొలినాళ్ళ కసరత్తు. ఐతే, ఐదు ఏళ్ళు ఆలస్యంగా అది ఇప్పుడు మొదలైంది. విభజన కోసం శ్రీకృష్ణ కమిటీ నివేదిక పార్లమెంట్ ఆమోదం పొందిన వెంటనే, భారత ప్రభుత్వం ఏ.పి. సమగ్ర అభివృద్ధి, రాజధాని స్థల ఎంపిక బాధ్యత కె.శివరామకృష్ణన్ కమిటీకి అప్పగించింది. నివేదిక వచ్చాక, 2014 సెప్టెంబర్ లో హైదరాబాద్ లో జరిగిన శాసన సభ సమావేశాల్లో ఆ కమిటీ నివేదికపై చర్చ జరగలేదు. దాంతో రాజధాని స్థల ఎంపికలో అధికార టి.డి.పి. పార్టీ ఏకపక్ష వైఖిరికి, ప్రతిపక్షం వై.సి.పి. సభను బహిష్కరించింది.

అప్పట్లో Andhrapradesh gets new capital in Vijayawada region శీర్షికతో ఆంగ్ల పత్రిక ‘ఇండియా టుడే’ సెప్టెంబర్ 4 న రాసిన వార్త కధనంలో - “శివరామకృష్ణన్ రిపోర్ట్ మీద చర్చ జరగాలని ప్రతిపక్షం వై. ఎస్.ఆర్.పి. మొత్తం 25 నిముషాలు పాటు రెండు సార్లు ప్లేకార్డులు పట్టుకొని అసెంబ్లీ ‘వెల్’ లో నిరసన తెలిపింది” అని రాసింది. అయినప్పటికీ అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం ఏకపక్షంగా ‘అమరావతి’ ని రాజధానిగా ప్రకటించింది.

special story on ap capital shifting

(2014లో వివిధ వర్గాలను కలిసిన శివరామకృష్ణన్ కమిటీ)

దానికి కొనసాగింపుగా సి.ఆర్. డి. ఏ. చట్టం కూడా అప్పటి అసెంబ్లీ ఆమోదించింది. అదే ఏడాది జూన్ లో హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం విజయవాడకు మారింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై అక్టోబర్ 22 న ప్రధాని నరేంద్ర మోడీ ‘అమరావతి’ కి శంఖుస్థాపన చేసారు. ఇదీ అప్పుడు జరిగింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇప్పుడు కొత్తగా రాజధాని వార్తల్లోకి రావడం అనేది నిజం కాదు. భారత ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లో రాయలసీమలో నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి, వాటి సమగ్ర అభివృద్దికి ప్రత్యేక నిధులను కేటాయించింది.

అదే కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతా స్పూర్తిని కొనసాగిస్తూ, ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఇప్పుడు రెండవ దశలో- రాష్ట్రం కోసం శాశ్విత ప్రణాళికల అమలు కోసం రాష్ట్ర ‘మ్యాప్’ చేత్తో పట్టుకుని మరీ ఒక ‘ఎక్జిక్యూటివ్’ లాగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన అంశం - మునుపటి శివరామకృష్ణన్ కమిటీలో సభ్యుడుగా ఉన్న నగర ప్రణాళిక రంగ నిపుణుడు కె.టి. రవీంద్రన్, మళ్ళీ ఇప్పటి జి.ఎన్. రావు కమిటీలో కూడా కీలక పాత్ర పోషించడం.

అలా ఒకవిధంగా ఇప్పటికే భారత ప్రభుత్వం వద్ద గత ఐదేళ్లుగా అమలు కొరకు ‘పెండింగ్’లో ఉన్న 2014 నాటి అధికారిక (శివరామకృష్ణన్ కమిటీ) నివేదికకు 2020 లో పేరు మార్చి, అదే పుస్తకానికి కొత్త ‘కవర్’ వేసి జగన్ అమలులోకి తెచ్చారు. (ప్రాంతీయ పార్టీలకు ఉండే ఇటువంటి స్వంత ముద్ర యావను ఇటువంటప్పుడు మనమూ తప్పు పట్టలేము) అందులో భాగంగా ‘ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’ కు నిలయమైన సచివాలయం విశాఖపట్టణంలో పెట్టాలని కొత్త ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఇందులో నైసర్గికం ప్రధానమైన అంశం. 

special story on ap capital shifting

(దక్షిణాదిలో తూర్పు కనుమల చిత్రం)

కుప్పం నుంచి మనం బయలుదేరితే, మెడ్రాస్-కలకత్తా రహదారిలో తమిళనాడు సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించాక ‘ఈస్ట్రన్ ఘాట్స్’ మనకు రోడ్డు, రైలు మార్గాలకు ఎడమవైపు దూరంగా కనిపిస్తుంటే, రాజమండ్రి దాటాక తుని వద్ద తాండవ నది దాటే సరికి, అవే తూర్పు కనుమలు ఎర్ర మట్టి వాసనతో కలిసి... మన రైలు పట్టాలు పక్కకు వచ్చేస్తాయి. ఇక్కడ ఆ పర్వతశ్రేణి బంగాళాఖాతం మీదికి వచ్చిందా లేక సముద్రమే వాటి దూకుడ్ని వెనక్కి నెట్టిందో గానీ, అక్కణ్ణించి సన్నబడ్డ మైదానం శ్రీకాకుళం దాటి ఒడిస్సా సరిహద్దు వరకు అలాగే సాగుతుంది.

special story on ap capital shifting

(సముద్రంలోకి చొచ్చుకొచ్చి విశాఖను నగరం చేసిన యారాడ కొండ)

సువిశాలమైన గోదావరి మైదానం దాటాక విశాఖపట్టణం వద్ద సముద్రానికి యారాడ కొండ (డాల్ఫిన్స్ నోస్) అడ్డొచ్చి... అదిచ్చిన చిన్న వొంపుతో అది కుడి వైపుకు తిరిగి, ఈ ఊరు పట్టణమై... కడకు యారాడ కొండ దాన్ని నగరం చేసి దాని చరిత్ర మార్చడం...అదొక నైసర్గిక ఇతిహాసం! ఇన్నాళ్ళకు మళ్ళీ ఇప్పుడు విభజిత ఏ.పి. తన రాజధాని కోసం ఆ నగరాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం, అనేది కేవలం దానికున్న నైసర్గిక ప్రాధాన్యత దృష్టితోనే! కామన్ వెల్త్ దేశాల్లో పోర్చుగీస్, డచ్చి, బ్రిటిష్ పాలకులు పోర్టు నగరాల్లో ఉంటూ తమ పరిపాలనా వ్యవహారాలు నిర్వహించడం వెనుక, లోతైన అంశాలు కొన్ని వొదిగి వున్నాయి.

వాణిజ్య దృష్టి నుంచి చూసినప్పుడు సముద్రం పోర్టులు రవాణా అంశాలు ఉన్నప్పటికీ అంతకు మించిన లోతైన అంశాలు వెతికితే కనిపిస్తాయి. మన దేశంలో ఐరోపా స్థావరాలు 1498-1739 నాటికి మొత్తం సముద్ర తీర పట్టణాల్లో వుండటం ఈ క్రింది పటంలో మనం చూడవచ్చు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే దేశాల్లో ఉష్ణతాపం యూరోపియన్లకు భరింపశక్యం కాకుండేది, దాంతో ఏడాది పొడుగునా మిగతా పట్టణాలు కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే సముద్రతీర పట్టణాలు పరిపాలనా కేంద్రాలు అయ్యాయి.

special story on ap capital shifting

రామాయపట్టణం నిజాంపట్టణం, మచిలీపట్టణం, కాకినాడ, వైజాగ్ పటంగా బ్రిటిష్ వారితో పిలవబడిన విశాఖపట్టణం, భావనపాడు, ఇవన్నీ సముద్ర తీర ప్రాంతంలోని పట్టణాలు కావడం విశేషం. మళ్ళీ ఇప్పుడు విశాఖపట్టణం మన రాష్ట్రానికి పరిపాలనా రాజధాని కనుక ఐతే, అది కేవలం చరిత్ర పునరావృతం కావడం, అలాగే చరిత్ర తన జాగ్రఫీని ఎంచుకోవడం అవుతుంది!

తొలి నుంచి కూడా సముద్ర తీరాల్లో ఎదిగిన మనిషి దృక్పధంలో ఉండే సంయమనం మిగతా ప్రాంతానికి భిన్నమైంది అనేది వొక నిర్ధారణ! అయితే, దేన్నీ ‘జనరలైజ్’ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇన్నాళ్ళకు మళ్ళీ ఇప్పటి ఈ ‘రాజధాని’ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని, ఇందులోకి చూస్తునప్పుడు... దృశ్యా దృశ్యంగా కనిపిస్తున్న తాత్వికతాంశాన్ని 
నిరాకరించడం కష్టం.

special story on ap capital shifting

( ఈ ప్రాంతంలో మొదటి నుంచి ప్రకృతి - మనిషి మధ్య దూరం తక్కువ)

సముద్ర తీరాల్లో ఆధ్యాత్మికలో కనిపించే లాలిత్యం పూర్తిగా భిన్నమైనది. దక్షణాదిన కన్యాకుమారి వద్ద కనిపించే వివేకానంద స్మృతి, పాండిచ్చేరిలో అరవింద ఆశ్రమం, చెలం – సౌరీస్ – భీమిలి ఇవన్నీ చూడ్డానికి వేర్వేరు అంశాలుగా కనిపిస్తున్నప్పటికీ, వీటన్నిటిని కలిపి ఉంచిన అంశం - ‘సముద్రం’! అది మనిషిని మించింది. అయితే అది ఎలా సాధ్యమయింది అనేది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న,,, వెతుక్కోవలసిన... జవాబు. చివరిగా అక్కడికిప్పుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయం రావడం, అది కూడా భీమిలిలో కావడం... అనేది, విడిపోయిన ఆరేళ్ళకు... నెమ్మదిగా మనం కుదురుకోవడం కావొచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios