తండ్రి బాటలోనే జగన్.. చిరుతో పొలిటికల్ గేమ్ వర్కౌట్ అయ్యేనా ?
ఏపీలో రెండో సారి అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే వైసీపీ అడుగులు వేస్తోంది. దీని కోసం ప్రస్తుత సీఎం జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి దారిలోనే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్చడానికి జనసేనను ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేనను ఒంటరి పోరుకు ఒప్పించేందుకు ఇటీవల సీఎం జగన్, సినీ నటుడు చిరంజీవితో భేటీ అయ్యారని సమాచారం. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రెండో సారి అధికారం చేపట్టేందుకు ప్రజా రాజ్యం పార్టీ ఎంతో ఉపయోగపడిందని ఆరోపణ ఉంది.
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే హడావిడి కనిపిస్తోంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనకు కలిసి వస్తుంది ? ఎక్కడ ఏ అభ్యర్థిని నిలబడితే గెలుస్తారు ? ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవడం ఎలా ? ఆ ఓట్లను చీల్చడం ఎలా ? అంటూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయంలో సమావేశాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్, సీనీ నటుడు చిరంజీవిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశం సినిమా టిక్కెట్ల రేటు పెంపు విషయంలో జరిగిందని బయట చెప్పినప్పటికీ.. అంతర్గతంగా మాత్రం 2024 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా చర్చలు సాగినట్టు తెలుస్తోంది.
అధికారంలోకి రావటంలో జనసేనదే కీ రోల్..
2014 మార్చి నెలలో జనసేన పార్టీ ఆవిర్భవించింది. దీనిని సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించారు. అయితే ఈ పార్టీ ఆ తరువాత వచ్చిన రెండు రాష్ట్రాల (ఏపీ, తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనలేదు. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ కూడా టీడీపీకి మద్దతు తెలిపింది. దీంతో టీడీపీ ఘన విజయం సాధించి ఏపీలో అధికారంలోకి వచ్చింది. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీతో వచ్చిన విభేదాల కారణంగా జనసేన పార్టీ ప్రతక్ష్యంగా దాదాపు అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. బీజేపీ, టీడీపీ, వైసీపీ కూడా ఒంటరిగానే పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చింది.
ఈ రెండు ఎన్నికలను పరిశీలిస్తే మొదటి సారి టీడీపీ అధికారంలోకి రావడానికైనా, రెండో సారి వైసీపీ అధికారంలోకి రావడానికైనా జనసేన పార్టీ చాలా కీలక పాత్ర పోషించనట్టు అర్థమవుతోంది. మొదటి సారి టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండో సారి ఒంటరిగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు జనసేనకు, బీజేపీకి పడటం వల్ల వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ పొలిటికల్ స్ట్రాటజీని వైసీపీ శ్రేణులు భాగం అకలింపు చేసుకున్నాయి. రెండో సారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పుడు జనసేనను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి.
జనసేనను ఒంటరిగా పోటీ చేయించడమే లక్ష్యం ?
2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత క్షేత్ర స్థాయిలో టీడీపీ, జనసేన కొంత వరకు దగ్గరయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల కలిసి కూడా పోటీ చేశాయి. వచ్చే ఎన్నికల సమయం నాటికి జనసేనతో మరింత దగ్గరై కలిసి పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. ఈ విషయాన్ని పలు మార్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి కూడా. అయితే బీజేపీ కూడా ఇప్పుడు అధికార వైసీపీపై సమయం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతోంది. సందర్భానుసారం విమర్శలు చేస్తోంది. మరోవైపు జనసేనతో బీజేపీ సాన్నిహిత్యంగా ఉంటోంది. ఇటీవల జనసేన 8వ వార్షికోత్సవానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగంగానే శుభాకాంక్షలు తెలిపారు. ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీని ఓడించేందుకు బీజేపీ పెద్దలు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారని, దానిని ద్వారా ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని పవన్ కల్యాణ్ చెప్పడం ఇప్పుడు వైసీపీ శ్రేణులను కలవరపెడుతోంది. జనసేన, టీడీపీ, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తేనే రెండో సారి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. అందుకే జనసేన ను ఒంటరిగా పోటీ చేయించడానికి పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవితో ఏపీ సీఎం జగన్ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. జనసేనను ఒంటరిగా పోటీ చేసేలా పవన్ కల్యాణ్ ను ఒప్పించాలని కోరినట్టు అర్థమవుతోంది. అయితే విషయంలో చిరంజీవి నిస్సాహాయత వ్యక్తం చేశారు. పార్టీ విషయంలో తన తమ్ముడు తన మాట వినడని చెప్పినట్టు తెలుస్తోంది.
ప్రజారాజ్యం మాదిరిగానే.. జనసేన ?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీలో రెండో సారి అధికారంలోకి రావడానికి చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ కీలకపాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక ఓట్లను చీల్చి, ప్రతిపక్షాలకు అధికారం చేపట్టే అవకాశం ఇవ్వకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీని వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారని టాక్. ఆ సమయంలో వైఎస్ఆర్ కు చిరంజీవి సహకరించారని ఆరోపణ ఉంది. అయితే ఇప్పుడు తండ్రి బాటలోనే కుమారుడు జగన్ కూడా రెండో సారి అధికారంలోకి వచ్చేందుకు చిరంజీవిని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే జనసేనను ఒంటరిగా రంగంలోకి దించేలా సాయం చేయాలని చిరంజీవిని జగన్ కోరుతున్నారు. ప్రస్తుతం వరకైతే ఈ విషయంలో తాను ఎలాంటి సహాయమూ చేయలేనని చిరు తెలిపినా.. దీనిని వైసీపీ వదిలిపెట్టేలా కనిపించడం లేదు. చిరు సహాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి సీఎం జగన్ వ్యూహాం ఎంత వరకు ఫలిస్తుందనేది ఎదురు చూడాల్సి ఉంది.