చంద్రబాబు సర్కారును గద్దె దించిన అతి ముఖ్యమైన కారణాల్లో ఇసుక మాఫియా ఒకటి. బినామీల పేరుతో ఇసుక,గ్రానైట్ వంటి ప్రకృతి వనరులను భోంచేశారని వైసీపీ అప్పట్లో ఆరోపించింది. ఇసుక,గ్రానైట్ సహా టీడీపీ పెద్దల అవినీతికి ఆంధ్రప్రదేశ్ దోపిడీకి గురయ్యిందని ఆరోపించింది. 

దీనితో అధికారంలోకి రాగానే టీడీపీ నేతల కబంధ హస్తాల నుండి బందీ అయిన ప్రకృతి  వనరులను  కాపాడటం పేరిట ఆంధ్రప్రదేశ్ లో ఇసుక-మైనింగ్ తవ్వకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. టీడీపీ నేతల అక్రమాలకు, అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేశామని తొలుత చెప్పుకున్నప్పటికీ,ఇప్పుడు ఇసుక కొరత నూతన తలనొప్పులు తెచ్చిపెడుతుంది జగన్ సర్కార్ కు. అంతేకాకుండా ఈ ఇసుక కొరత ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒక నూతన అస్త్రంగా మారింది.  

ఈ ఇసుక కొరత వల్ల ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన సంక్షోభం ఏర్పడి ఉంది. భవన నిర్మాణ రంగం కుదేలయింది. నిర్మాణ రంగంతోపాటు ఇంకో 20 అనుబంధ రంగాలు కూడా ఈ ఇసుక కొరత వల్ల దెబ్బతిన్నాయి. 

స్టీల్ సిమెంట్ అమ్మకాలు పడిపోయాయి. ఈ రవాణపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు పని దొరక్క నాలుగు నెలలవుతుంది. ఈ నిర్మాణ రంగంపై ఆధారపడ్డ మేస్త్రీలు,కార్మికులు ఉపాధి కరువై ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. వలస వెళ్లలేకపోయినవాళ్లు ఇతర రంగాల్లో ఉపాధిని వెతుక్కుంటున్నారు. 

ఇప్పటికే అమరావతి నిర్మాణం ఆగిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయింది. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ రంగం నుండి,నిర్మాణ పర్మిషన్ ల నుండి భారీ స్థాయిలోనే డబ్బులు వస్తాయి. ప్రస్తుతం దేశమంతటా ఆర్ధిక మాంద్యం తాండవం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనికి అతీతం కాదు. 

ఇప్పుడు ఇలా ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఆల్రెడీ దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ రంగం మరింత దెబ్బతిన్నది. ఇలా ఈ ఇసుక కొరత వల్ల చాల మంది ఉపాధి కోల్పోతున్నారని , రాష్ట్ర నిర్మాణ రంగం దెబ్బతిన్నదని,దీనిప్రభావం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై పడిందని, ఎందరో కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. 

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలు మంత్రుల ఇల్లు ముట్టడికి పిలుపునిస్తుంటే, టీడీపీ వారేమో పొర్లు దండాలు పెడుతూ విన్నూత్న నిరసనలు చేపడుతున్నారు. 

ప్రతిపక్షాల వాదనలెలా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత ఉందనేది వాస్తవం. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. నిర్మాణ రంగం సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగవుతుంది,