Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ముందస్తు ఎన్నికలు.. ఫ్లోలో నోరుజారిన సజ్జల.. చంద్రబాబు వ్యూహం అందుకేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల వస్తాయనే చర్చ గత కొంతకాలంగా కొనసాగుతుంది. అయితే వైసీపీ శ్రేణులు ఈ వార్తలను ఖండిస్తూ వచ్చాయి. అయితే తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే.. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమేనని అనిపిస్తుంది. 

Sajjala ramakrishna reddy hints early elections in andhra pradesh
Author
Tadepalli, First Published May 7, 2022, 11:17 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల వస్తాయనే చర్చ గత కొంతకాలంగా కొనసాగుతుంది. అయితే వైసీపీ శ్రేణులు ఈ వార్తలను ఖండిస్తూ వచ్చాయి. అయితే తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే.. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమేనని అనిపిస్తుంది. జగన్ సర్కార్ తరఫున అధికారిక ప్రకటనలు చేసే సజ్జల.. మీడియా సమావేశాల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఉన్న సజ్జల.. ప్రభుత్వ వైఖరిని వెల్లడించడంతో పాటుగా ప్రతిపక్షాలు చేసే విమర్శలపై కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంటారు. ఆయన సీఎం జగన్ మౌత్ పీస్‌గా వ్యవహరిస్తుంటారు. జగన్ చెప్పాల్సిన విషయాలనే సజ్జల చేత చెప్పిస్తుంటారని ప్రచారం ఉంది. 

అయితే తాజాగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ఫ్లోలో నోరుజారారు. ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని సజ్జల చెప్పారు. తమ ప్రభుత్వ పనితీరు ప్రజల్లోకి బాగా వెళ్లిందని, జగన్ అమలు చేసిన పథకాలు విజయవంతమయ్యాయని అన్నారు. మాములుగా అయితే ఏపీలో మరో రెండేళ్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే సజ్జల మాత్రం ఏడాది, రెండేళ్లలో అని చెప్పడం ద్వారా.. వైసీపీ క్యాడర్‌లోని ముందస్తు సంకేతాలు పంపారనే టాక్ వినిపిస్తోంది. 

అయితే ఈ మాటలు పార్టీలోని ఇతర నాయకులు, మంత్రులు చెప్పినా పెద్దగా చర్చ సాగేది కాదు. సజ్జల నోటి నుంచి ఇలాంటి మాటలు వినిపించడంతో.. వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లనుందనే వార్తలకు బలం చేకూరినట్టు అయింది. మరోవైపు జగన్ కూడా పార్టీని బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే గడప గడపకు వైసీపీ కార్యక్రమానికి చుట్టారు. గడప గడపకు వైసీపీలో భాగంగా నెలలో కనీసం 10 గ్రామ సచివాలయాలను సందర్శించాలని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వాలని సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ఇక, వైసీపీలో జగన్‌ తర్వాత కీలకంగా ఉన్న సజ్జల, విజయసాయి రెడ్డిలు ఇటీవల సమావేశం అయ్యారు. వీరిద్దరు కూడా పార్టీ భవిష్యత్తు కార్యచరణపై ప్రత్యేకంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. 

అయితే తాజాగా సజ్జల వ్యాఖ్యల నేపథ్యంలో ముందస్తు ఎన్నికల ప్రణాళికలో భాగంగానే సీఎం జగన్ ఈ రకమైన అడుగులు వేస్తున్నట్టుగా చెబుతున్నారు. తెలంగాణలో వచ్చే ఏడాది డిసెంబర్‌‌లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కేసీఆర్ కూడా ముందస్తుకు వెళ్తారని ప్రచారం సాగుతుంది. ప్రతిపక్షాలు సరైన సమయం తీసుకునే అవకాశం లేకుండా కేసీఆర్ ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం ఉంది. ఇదే విధానంలో జగన్ కూడా.. వచ్చే ఏడాది ముందస్తుకు వెళ్లనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. 

మరోవైపు వైసీపీ ముందస్తుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబు నాయుడు బలంగా నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులతో చెబుతున్నారు. ఎన్నికలకు సిద్దం కావాలని పిలుపునిచ్చన చంద్రబాబు.. ఆ దిశలో ప్రణాళికలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న పార్టీని.. ఈసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. జగన్ సర్కార్ తీరుపై తీవ్రమైన విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. 

బాదుడే బాదుడు నిరసల్లో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటకు వెళ్లిన చంద్రబాబు.. మే నేలలో నిర్వహించే మహానాడు అనంతరం ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లనున్నట్టుగా టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోక్‌ష్ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్దం చేసుకుంటున్నట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమనే కనిపిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios