ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగగానే కెసిఆర్ ఒక మాట అన్నాడు. తాము జీతాలు భారీ స్థాయిలో పెంచామని ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చా మని చెప్పారు. దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. 

ఉమ్మడి రాష్ట్రంలోనే జీతం ఎక్కువగా వచ్చేదని వారు లెక్కలతో సహా రుజువు చేసారు. కెసిఆర్ ఫిట్మెంట్ ఇచ్చి డీఏ ను తగ్గించారని, తద్వారా ఉద్యోగి సగటు జీతం తగ్గిందే తప్ప పెరగలేదని వారు లెక్కలు కట్టి చూపిస్తున్నారు. 

దీనిపై ఉద్యోగ సంఘాల వారితో మాట్లాడగా వారు ఈ విధంగా లెక్కకట్టినట్టుగా తెలిపారు. 

ఉమ్మడి రాష్ట్రంలో:

రోశయ్య సర్కార్ హయాంలో 39% ఫిట్మెంట్ ఇచ్చారు.  కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి 10% డీఏ కి 8.576% ఇచ్చారు. ఒక పీఆర్సీ కాలం 5 సంవత్సరాలు. డీఏ ఏడాదికి రెండు సార్లు పెరుగుతుంది. మొత్తంగా ఒక పీఆర్సీ కాలం లో 10 డీఏ  లు వస్తాయన్నమాట. 

ప్రతి డీఏ 10% అనుకుందాం. మరి మొత్తంగా ఒక పీఆర్సీ కాలంలో రోశయ్య సర్కారు ఇచ్చిన డీఏ, 5 సం. లో 8.576*10= 85.76% అన్నమాట. 

దీనికి అదనంగా ఫిట్మెంట్ 39%. మొత్తం 39% + 85.76% = 124.76%. అంటే 100 జీతం ఉన్నవాడి సాలరీ ఆ 5 సంవత్సరాల పూర్తి పీఆర్సీ కాలంలో వాడికి వచ్చే కొత్త జీతం 224.76.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక కెసిఆర్ హయాంలో :    

కెసిఆర్ సర్కార్ 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. కానీ డీఏ ను తగ్గించింది.  డీఏ కుదింపు ప్రతి 10% కి 5.324%. అలా ఒక పీఆర్సీ కాలం లో ఒక్కో ఉద్యోగి తీసుకునే మొత్తం డీఏ 5.324*10= 53.24%.

అంటే 100 రూపాయల జీతగాడికి 5 సంవత్సరాలలో పెరిగిన మొత్తం జీతం 100 + 43+ 53.24 = 193.24 మాత్రమే. ఇది గత ఉమ్మడి ప్రభుత్వ హయాంలో కన్నా తక్కువని వారు వాపోతున్నారు. తక్కువ ఇవ్వడమే కాకుండా, ఉద్యోగులకు ఇబ్బడి ముబ్బడిగా జీతాలు పెంచినట్టు, ప్రభుత్వోద్యోగులు ఇంత భారీ జీతాలు తీసుకుంటూ పని సరిగా చేయట్లేరని, లంచగొండులని అపవాదులు వేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేసారు.