Asianet News TeluguAsianet News Telugu

RTC strike: కోర్టుకు అర్థమైనంత కూడా కెసిఆర్ కు అర్థమవ్వడం లేదా?

 సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్న సబ్బండ వర్గాలంతా ఒకప్పుడు కెసిఆర్ వెంట నడిచినవారే. ఇప్పుడింతమంది మంది ఎందుకు కెసిఆర్ కు వ్యతిరేకమయ్యారనే విషయాన్నీ కూడా కెసిఆర్ ఆలోచించడం లేదు. ఆలోచించడం కాదు అసలు వినడానికి కూడా సిద్ధంగా లేడు. 

rtc strike: can't kcr understand what court understands?
Author
Hyderabad, First Published Oct 18, 2019, 5:02 PM IST

ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో విచారణ మొదలయ్యింది.  గత వారం ఈ ఆర్టీసీ సమ్మెపై వాదనలు విన్న కోర్ట్ కేసును ఈ రోజుకి వాయిదా వేసింది. గత దఫాలో ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. యూనియన్లకు కూడా సమ్మెను విరమించాలని చెప్పింది. 

నేటి వాదనల్లో కోర్టు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోపాటు హెచ్చరికలు చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తిమంతులని, వారు తిరగబడితే ఎవ్వరూ ఆపలేరని కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు వాదనలు వింటుంటే ప్రభుత్వ అలసత్వంపై చాల సీరియస్ గా ఉన్నట్టు మనకు కనపడుతుంది. 

ఆర్టీసీ ఎండీని ఎందుకు నియమించలేదని ప్రశ్నకు ప్రభుత్వం ఒక వింత సమాధానం ఇచ్చింది. ఎండి ని నియమిస్తే సమస్య పరిష్కారం కాదని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. దానితోపాటు ఇప్పుడు సమర్థవంతుడైన సీనియర్ అధికారి ఇంచార్జి గా ఉన్నాడని చెప్పింది. కోర్టు వెంటనే అంత సమర్థుడైతే అతన్నే నియమించొచ్చు కదా అని కోర్టు మొట్టికాయలు వేసింది. 

రోజూ జరుగుతున్న పరిణామాలను కోర్టు నిశితంగా గమనిస్తున్నట్టు వారు చేసిన వ్యాఖ్యలు వింటే మనకు అర్థమవుతుంది. గత దఫాలోనేమో బస్సులకు అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం అంటే, తాను వచ్చే దారిలో ఒక్క బస్సు కూడా ఎందుకు కనిపించలేదని జడ్జి అనడం కోర్టులో నవ్వులు పూయించింది. 

ఈ రోజు కూడా ఆర్టీసీ సమ్మెకు రోజు రోజుకు మద్దతు పెరుగుతుందనే విషయాన్నీ కోర్టు గమనించింది. ఇంకొంతమంది ఆర్టీసీకి మద్దతు ప్రకటిస్తే దాన్ని ఆపడం ఎవరితరం కాదని కోర్టు వ్యాఖ్యానించడం ఒక రకంగా ప్రభుత్వ తీరుపై కోర్టు ఆగ్రహాన్ని తెలియచేస్తుంది. 

రోజు రోజుకి ఆర్టీసీ సమ్మెకు మద్దతు పెరుగుతుందనే విషయం బహిరంగంగానే మనకు కనపడుతుంది. ఉద్యమ సమయంలో ఎలాగయితే వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేసారో ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా అవే మార్గాలను ఎంచుకుంటున్నారు. వంటావార్పు నుంచి భిక్షాటన వరకు రకరకాల రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. 

నేడు శుక్రవారం రోజున నాంపల్లి కోర్టు వద్ద లాయర్లు కూడా తమ మద్దతును ఆర్టీసీ కార్మికులకు ప్రకటించారు. వారు అక్కడ కెసిఆర్ దిష్టి బొమ్మను తగలబెట్టారు. దిష్టి బొమ్మ తగలబెట్టడం మాములు విషయం. కానీ వారు కెసిఆర్ దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టడానికి ఎగబడ్డారు. ఇదే లాయర్లు తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ నాయకత్వంలో ఉద్యమించినవారే. 

కేవలం ఈ లాయర్లే కాదు, ఇప్పుడు సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్న సబ్బండ వర్గాలంతా ఒకప్పుడు కెసిఆర్ వెంట నడిచినవారే. ఇప్పుడింతమంది మంది ఎందుకు కెసిఆర్ కు వ్యతిరేకమయ్యారనే విషయాన్నీ కూడా కెసిఆర్ ఆలోచించడం లేదు. ఆలోచించడం కాదు అసలు వినడానికి కూడా సిద్ధంగా లేడు. 

కోర్టు మాత్రం కెసిఆర్ మెడలు వంచుతూ తీర్పు వెలువరించింది. చర్చలు జరపవలిసిందేనని ఉత్తర్వులిచ్చింది. పాలనకు దూరంగా ఉండే కోర్టుకే బయట జరుగుతున్న ఆర్టీసీ సమ్మె తీవ్రత అర్థమైతే, పాలకుడైన కెసిఆర్ కు అర్థం కాలేదా?

Follow Us:
Download App:
  • android
  • ios