Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసి సమ్మె: హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఎఫెక్ట్

ఆర్టీసి సమ్మె హుజూర్ నగర్ శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అఖిలపక్ష సమావేశం తర్వాత సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చేసిన ప్రకటన ఆ విషయాన్ని తెలియజేస్తోంది.

RTC Strike blow to TRS in Huzurnagar bypoll
Author
Hyderabad, First Published Oct 9, 2019, 4:24 PM IST

హైదరాబాద్: తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పండుగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ఒక మహా యుద్ధమే నడుస్తుంది.

విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తుంటే, ఇలాంటి బెదిరింపులు మాకు కొత్త కావని ఆర్టీసీ సంఘాలంటున్నాయి.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగారు. 

చెప్పినట్టుగానే కెసిఆర్ విధులకు హాజరుకాని ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటన చేసారు. ఇలాంటి బెదిరింపులకు తలొగ్గేదిలేదని కెసిఆర్ ఖరాఖండీగా తేల్చి చెప్పారు.  

తమను డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తున్నా కామ్రేడ్లకు కనపడడం లేదా అని  కమ్యూనిస్టు నాయకులపై ఆర్టీసీ యూనియన్ నాయకుడు అశ్వద్ధామ రెడ్డి విరుచుకుపడ్డారు.

సిపిఐ పార్టీ కెసిఆర్ కు అమ్ముడుపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చాడ వెంకట్ రెడ్డి తన స్వలాభం కోసం ఇలా సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారని అన్నారు. 

తాము సమ్మె చేస్తుంటే సంఘీభావం కూడా తెలుపకుండా, తమను డిస్మిస్ చేస్తామని బెదిరిస్తున్న అధికార తెరాస తో చేతులు కలిపి సిద్ధాంతాలకు నీళ్లొదిలారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల పక్షాన పోరాడి కార్మికులంతా ఏకం కండి వంటివాటిని నినాదాలకే పరిమితం చేసారని ఎద్దేవా చేసారు. 

కార్మికుల వ్యతిరేక ప్రభుత్వానికి సిపిఐ మద్దతెలా ఇస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఎమ్మెల్సీ పదవికోసమే ఇలా ప్రజా వ్యతిరేక ఉద్యమానికి మద్దతిస్తున్నారా అని వారు ప్రశ్నిస్తున్నారు.

చాడ వెంకట్ రెడ్డి శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఈ విషయంలో స్వయంగా జోక్యం చేసుకొని పరిష్కరించాలని కోరారు. వెంకట్ రెడ్డి గారి మాటను కెసిఆర్ సీరియస్ గా తీసుకున్నారు కాబోలు, స్వయంగా కెసిఆర్ ప్రెస్ మీట్ పెట్టిమరీ కార్మికులను తొలగిస్తున్నట్టు తెలిపాడు. 

ఇప్పుడు సిపిఐ ఈ విషయమై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మొన్న ఇదే విషయమై సిపిఐ ముఖ్యనేతలైన చాడ వెంకట్ రెడ్డి, నారాయణలతోని మాట్లాడడానికి ప్రయత్నించగా వారు మొఖం చాటేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే విషయంపై పునరాలోచన చేస్తామని ఆయన ఏషియానెట్ న్యూస్ ప్రతినిధితో అన్నారు. ఇది ఒక రకంగా టీఆర్ఎస్ కు తలనొప్పిగా పరిణమిస్తుందని చెప్పవచ్చు.

ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటూ తరచు పిలుపునిచ్చే కమ్యూనిస్టులు నిజంగా ఈ నినాదానికి కట్టుబడి ఉన్నారా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే ఒక విచిత్రమైన విషయం దాగుంది. సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. సిపిఐ పార్టీ కూడా సమ్మెకు మద్దతు పలికింది. కాకపోతే హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస కు ఇస్తున్న మద్దతును ఉపసంహరించమంటే మాత్రం అది రాజకీయ నిర్ణయం. దానికి దీనికి లంకె పెట్టొద్దు అని అంటున్నారు. కేవలం కార్మికులు ఇలా డిమాండ్ చేశారనుకుంటే పొరపాటే. ఏఐటీయూసీ నేతలు స్వయంగా ఈ విషయమై సిపిఐ ముఖ్యనేతలను కలిశారు కూడా!

ఒకప్పుడు ప్రజల తరుపున పోరాడడమే మా పంథా అని చెప్పుకున్న సిపిఐ, నేడు ఏకంగా తన విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టేనా అని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. చాడ వెంకట్ రెడ్డి గారిని నిన్న ఇదే విషయమై ప్రశ్నిస్తే, కేంద్ర కమిటీ రాజకీయ నిర్ణయం అని తప్పించుకునే ప్రయత్నం చేసారు. 

మొత్తం మీద సిద్ధాంతాలకు కట్టుబడ్డ పార్టీగా పేరున్న సిపిఐ ఇలాంటి ద్వంద నిర్ణయాలను తీసుకుంటూ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తుంటే సగటు ఓటర్ మాత్రం వీరు కూడా ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందారనుకోవడం మాత్రం తథ్యం. 

Follow Us:
Download App:
  • android
  • ios