టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి: హుజూరాబాద్ అతి పెద్ద సవాల్
2019 పార్లమెంటు ఎన్నికల్లో ఒకింత మెరుగైన ప్రదర్శనను చేసిన కాంగ్రెస్... ఆ తరువాతి నుంచి రాష్ట్రంలో పూర్తిగా ప్రభావాన్ని కోల్పోయింది. నాయకత్వ లేమి, నాయకుల మధ్య సమన్వయ లోపం అన్ని వెరసి తెలంగాణలో తెరాస కు ప్రత్యామ్నాయం తామే అనే పరిస్థితికి బీజేపీ వచ్చింది.
2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటినుండి తెలంగాణ కాంగ్రెస్ నూతన సారథి ఎవరవుతారని నెలకొన్న సందిగ్ధతకు తెర దించుతూ కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత నుంచే టీపీసీసీ అధ్యక్షా మార్పుకు సంబంధించిన చర్చ తెర మీదకు వచ్చినప్పటికీ... 2019 పార్లమెంటు ఎన్నికల తరువాత ఉత్తమ్ రాజీనామాతో ఇక మార్పు అనివార్యమయింది. కానీ అడపా దడపా వస్తున్న ఎన్నికల దృష్ట్యా, కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు వల్ల ఎప్పటికప్పుడు అధ్యక్షా మార్పు వాయిదా పడుతూ వస్తుంది.
2019 సెప్టెంబర్ లోనే రేవంత్ కుటుంబ సమేతంగా సోనియా గాంధీని కలిసినప్పుడే రేవంత్ ని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని ఏఐసీసీ కార్యాలయం నుంచి అంతర్గతంగా వార్తలు కూడా అందాయి.
కాంగ్రెస్ మార్కు అంతర్గత కుమ్ములాటలు, లాబీయింగ్ అన్ని వెరసి రేవంత్ కి ఆ పదవి దక్కకుండా కాంగ్రెస్ సీనియర్లు అడ్డుపడ్డారు. కానీ ఇటీవల కాలంలో అన్ని రాష్ట్రాల్లోనూ నాయకత్వ బలోపేతానికి నాయకత్వ మార్పులు చేపడుతున్న నేపథ్యంలో తెలంగాణాలో కూడా అధ్యక్ష మార్పు తథ్యం అయింది. ఈసారి కూడా సీనియర్లు అడ్డుపుల్లలు వేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ... రేవంత్ అధ్యక్షా పదవిని దక్కించుకున్నాడు.
ఇక రేవంత్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తున్న నేపథ్యంలో అతనికి హుజూరాబాద్ ఉపఎన్నిక సవాలు విసురుతుంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఒకింత మెరుగైన ప్రదర్శనను చేసిన కాంగ్రెస్... ఆ తరువాతి నుంచి రాష్ట్రంలో పూర్తిగా ప్రభావాన్ని కోల్పోయింది.
నాయకత్వ లేమి, నాయకుల మధ్య సమన్వయ లోపం అన్ని వెరసి తెలంగాణలో తెరాస కు ప్రత్యామ్నాయం తామే అనే పరిస్థితికి బీజేపీ వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ లో పునరుత్తేజం కల్పించాలంటే రేవంత్ హుజురాబాద్ ఎన్నికల్లో తామేమిటో నిరూపించాల్సిన అవసరం ఉంది.
హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఆలోచించినట్టు కూడా కనబడడం లేదు. అక్కడ వార్ బీజేపీ వర్సెస్ తెరాస గా ఉంది. అక్కడ కాంగ్రెస్ గెలవడం కన్నా బలమైన పోటీ ఇచ్చిందని అనిపించుకోవడం ప్రధానం.
కనీసం సంస్థాగతంగా ఉన్న కాంగ్రెస్ వోట్ బ్యాంకునైనా కాపాడుకునే ప్రయత్నం చేయాలి నాయకులూ. రేవంత్ రాకతో ఒకింత పార్టీలో ఊఒపు రావడం మాత్రం తథ్యం. రేవంత్ కి యువతలో మంచి క్రేజ్ ఉంది. ఆ ఫాలోయింగ్ తో యువత సమస్యలను ముందుకు తెచ్చి తెరాస సర్కార్ పై గుర్రుగా ఉన్న యువతను తనతోపాటుగా ర్యాలీ చేయించాలనేది రేవంత్ ఉద్దేశంగా కనబడుతుంది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఇప్పుడు క్షేత్ర స్థాయిలో తామున్నామని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వైపు బీజేపీ తెరాసతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ కి ఈ ఉపఎన్నిక జీవన్మరణ సమస్య. ఈ ఉపఎన్నికలో గనుక కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వకపోతే పార్టీ అస్తిత్వానికి, నాయకుల ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.
మరొక రెండేండ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండనే ఉన్నాయి. ఈ ఎన్నికలప్పటికీ పార్టీ బలపడాలన్నా, ఉన్న కార్యకర్తలను కాపాడుకోవాలన్నా కూడా కాంగ్రెస్ ఇప్పటినుండే బలమైన పోరాటాన్ని ప్రారంభించాలి. ఇందుకోసం రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఉపఎన్నికలో తన సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!