శుక్రవారం ఉదయం అందరి ఇళ్లల్లో ఒక్కటే మాట, సోషల్ మీడియా హోరెత్తిపోతోంది...బాగా  జరిగింది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, హమ్మయ్యా, ముందు అనుకున్నదే, లేట్  చేశారు..చంపాల్సింది కాదు, ఇదే దీనికి పరిష్కారమా ఇలాంటి అనేక రకాల మాటలు  వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి. ఫార్వర్డ్ అవుతున్నాయి. షేర్ అవుతున్నాయి.  

అయితే గత వారం రోజులుగా ఓ ఆడపిల్ల తల్లిగా నేను పడ్డ టెన్షన్ కు ఈ ఘటన ఉపశమనం  కలిగించింది. ఐదు దాటితే ఎక్కడికైనా వెళ్లాలంటే భయమేస్తుంది మమ్మీ...ఇంట్లో ఉంటే మాత్రం  సేఫ్ ఉందా...ఎవర్ని నమ్మాలో అర్థం కావడంలేదు...నాకు స్కార్ఫ్ కట్టుకోవడం ఇష్టం  లేదు..కానీ ఇలాంటివి చూస్తుంటే భయమేసి కట్టుకుంటున్న...అన్న మా అమ్మాయి  మాటలు...ఈ మాటలు నా బిడ్డవి మాత్రమే కావు...నా బిడ్డలాంటి చాలామంది చదువుకునే  అమ్మాయిలవి. ఈ వార్త వినగానే మా అమ్మాయి అన్న మొదటి మాట ఇప్పుడు హ్యాపీగా  ఉంది అని...అందుకే నాకు సంతోషంగా ఉంది.    

దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఈ ఘటన కదిలించింది. ప్రతి ఒక్క ఆడపిల్లను, ఆడపిల్ల  తల్లిదండ్రులను భయంతో ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. ఎవ్వరికి ఫోన్ చేసినా, ఎవ్వరితో  మాట్లాడినా జాగ్రత్తలు చెప్పేవారే. జాగ్రత్త చీకటి పడకముందే ఇంటికి చేరుకోండి. పాప  జాగ్రత్త..ఇలాంటి మాటలు భయాన్ని మరింత పెంచాయి. బైటికి చెప్పలేని ఒ రకమైన గుండెను  మెలిపెట్టే బాధను మోస్తూ తిరుగుతున్నాం.    

చంపడం నేరం కావచ్చు. మనిషిని ఉరితీయడం కరెక్ట్ కాదు కావచ్చు..యాక్టివిస్టుల మాటలు  ఏకీభవించొచ్చు కానీ తక్షణ న్యాయం కోరుకుంటాం. అది మానవనైజం. అందుకే నాలాంటి  తల్లులకు ఇది నచ్చుతుంది. ఇక్కడ నేను జర్నలిస్టును కాను, యాక్టివిస్టును కాను,  సమాజంమీద అవగాహన ఉన్న వ్యక్తిని కాను కేవలం ఓ ఆడపిల్ల తల్లిని.   నిముషం నిముషం   వేయికళ్లతో అమ్మాయిని కాపాడుకుంటూ...కోడి తనరెక్కల కింద బిడ్డను  కాపాడుకున్నట్టు   కాపాడుకుంటున్న తల్లిని. ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎంత బిజీలో ఉన్నా  కాలేజ్ వదిలే   సమయానికి ఎక్కడుందో కనుక్కోవడం వదలని తల్లిని, కాస్త లేట్ అయితే టెన్షన్  పడి పదే   పదే ఫోన్లు చేసి బిడ్డను విసిగించిన తల్లిని. టీనేజ్ దాటినా పదే పదే జాగ్రత్తలు  చెబుతున్న   తల్లిని.   అందుకే నాకు ఈ సంఘటన సంతోషాన్ని కలిగించింది.  

అయితే ఇక్కడో మాట..సజ్జనార్ సార్  మీకు రాఖీ కట్టాలనిపిస్తుంది. వరంగల్ స్వప్నిక   కేసులోనూ ఇప్పుడు దిశ కేసులోనూ మీరు  చూపిన తెగువ మాకు నచ్చింది. మీరున్నారన్న   ధైర్యం ఉంది.   అయితే సార్ ఇదే సమయంలో మీకో విషయం చెప్పాలని ఉంది. వీళ్లన చంపారు  మంచిదే..కానీ ప్రతీచోట..ప్రతీ నీడల్లో...కాస్త చీకటి పడగానే ప్రతీ మూలమలుపులో ఉండే  ఇలాంటి వాళ్లను ఏం చేస్తారో చెప్పండి. షేర్ ఆటోల్లో, బస్టాపుల్లో, క్యాబుల్లో, ఆటోల్లో, బస్సుల్లో,  డివైడర్లమీదా, కాలేజీల్లో కనిపించే ఇలాంటి వారికోసం మీరేం చర్యలు తీసుకుంటారో వినాలని  ఉంది. ఇప్పటికైనా గుండెలమీద చెయ్యేసి పడుకునే భరోసా ఇవ్వగలరని అనిపిస్తుంది.    

తొందరగా అలాంటి చర్యలు తీసుకోండి సార్.   దిశ ఘటన మీద నిరసనలు, ఆక్రోశాలు   వెల్లువెత్తుతున్న సమయంలోనే  చిన్నపిల్లలనూ వదలని వాళ్లను, 50 యేళ్ల   ఒంటరిమహిళనూ ఒదలని వాళ్లను,  ఆడపిల్లలు...క్షమించాలి...ఇక్కడ వయసుతో సంబంధం   లేదు...ఆడది అయితే చాలు నెలల  పిల్లనుండి 70యేళ్ల ముసలోళ్లవరకూ కేవలం గుండ్రటి   మర్మాంగంలా మాత్రమే కనిపించే  వాళ్లను ఈ వ్యవస్థ మారడానికి, ఆలోచనల్లో మార్పు   తేవడానికి మనమందరం కలిసి ఏం  చేద్దామో, ఏం చేయాలో చెప్పండి.    

మొదట పోర్న్ సైట్లను నిషేధించండి..నిర్భంద చదువును అందించండి...ఓ వయసు  వచ్చేదాకా సెల్ ఫోన్లు అందుబాటులో ఉంచకండి..A సర్టిఫికెట్ సినిమాలు తీస్తూ డబ్బులు  చేసుకుంటున్న వాళ్లమీద కేసులు పెట్టంది. అలాంటి సినిమాలకు అనుమతినిస్తున్న సెన్సార్  బోర్డు వాళ్లను అరెస్ట్ చేయండి. వాడికేం లే అబ్బాయి అనుకునే తల్లిదండ్రులకు శిక్ష వేయండి.  ఏ రంగమైన సరే సెలబ్రిటీలు అయి ఉండి అమ్మాయిలమీద పిచ్చివాగుడు వాగే వాళ్లమీదా  కేసులు పెట్టండి. పిచ్చి సాహిత్యం రాసే వాళ్ల వెన్నులు, పెన్నులు విరిచేయండి. అన్నింటికంటే  ముఖ్యంగా మద్యనిషేధం అమలుకు కృషి చేయండి.

-సుమ బాల