ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు దేవిప్రియ రచనల సంకలనం బహుముఖ పేరుతో పాఠకుల ముందుకు రానుంది. కవిత్వం, పత్రికారచన, వ్యక్తిత్వ విశ్లేషణల సమాహారం అది. ఆ గ్రంథాన్ని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఆవిష్కరించనున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ (శనివారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులోని పర్యాటక భవన్ ది ప్లాజాలో జరుగుతుంది. ఈ సందర్భంగా మల్లేపల్లి లక్ష్మయ్య రాసిన ప్రత్యేక వ్యాసాన్ని అందిస్తున్నాం
    
దేవిప్రియ. ఇది ఒక పేరు. నిజానికి ఇది నడుస్తున్న చరిత్రకు ఒక నమూనా. పుట్టింది ఏ మతమైనా తాను ఒక మనిషిగా మాత్రమే అందరికి తెలిసిన వాడు. ప్రముఖ హిందీ రచయిత, కవి షాహిర్‌ లూథియాన్వి రాసినట్టు ‘‘తు హిందూ బనేగా న ముసల్మాన్‌ బనేగా, ఇన్సాన్‌ కా అవులాద్‌ హో ఇన్సాన్‌ బనే గా’’ అన్న తాత్వికతకు నిలువుటద్దంలాంటి వాడు దేవిప్రియ.
    

దేవిప్రియ కవిగా, రచయితగా, జర్నలిస్టుగా, సినీమా రచయితగా, దర్శకునిగా ఎన్నో ప్రక్రియల్లో తనదైన ముద్ర వేసినవాడు. తన అరవై ఎనిమిదేళ్ళ జీవితంలో ఎంతో గుర్తింపును, ఎన్నో ప్రశంసలను అందుకొన్న దేవిప్రియ గురించి ఎందరో మిత్రులు, ప్రముఖులు, తమ అనుభవాలను ఎన్నో వేదికల మీద, పుస్తకాల రూపంలో పంచుకున్నారు. దేవిప్రియ కృషిని, సాహితీశక్తిని, భాషా పరిణతిని కొలవడానికి నేను సరిపోను. ఎందుకంటే ఆయనకన్నా చాలా చిన్నవాణ్ణి. ఆయన రాసిన రాతల నుండి రాజకీయాలను నేర్చుకున్న విద్యార్థిని. దేవిప్రియ రాసిన పుస్తకాల గురించి నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు.
    

ఆయనొక అద్భుతమైన కవి మాత్రమే కాదు. సమకాలీన రాజకీయాలను అతి చిన్న పదాలతో ప్రపంచ గమనాన్ని ప్రతిరోజూ విప్పి చెప్పిన కవి, రచయిత, జర్నలిస్టు దేవిప్రియ మాత్రమే. ఆ మూడు లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రమే అటువంటి ప్రక్రియను కొనసాగించగలరు. ఆ ప్రక్రియనే ‘రన్నింగ్‌ కామెంటరీ’. ఉదయం పత్రికలో ప్రతిరోజూ మొదటి పేజీ కింది భాగంలో ప్రత్యక్షమయ్యే రన్నింగ్‌ కామెంటరీ ఆరోజు ఉధృతంగా సాగిన విప్లవోద్యమానికి, విప్లవోద్యమ కార్యకర్తలకి ఒక టాబ్లెట్‌ లాంటిది. ఆరోజు ఉద్యమ సంఘాలు ప్రచురించి, పంపిణీ చేసే కరపత్రాలకు మకుటాలుగా దేవిప్రియ గారి రన్నింగ్‌ కామెంటరీ పనికివచ్చేది. ఆ రోజుల్లో నేనొక విద్యార్ధి కార్యకర్తను, విప్లవోద్యమంలో భాగస్వామిని, ఉదయం దినపత్రిక చదివిన ఎవరైనా రన్నింగ్‌ కామెంటరీ చూడకుండా పోవడం సాధ్యంకాదు. రన్నింగ్‌ కామెంటరీ అందించే అవగాహన, ఆలోచన కార్యకర్తలకు ఒక ఆయుధంలా ఉండేది. అది బడ్జెట్‌ కావొచ్చు, ఎన్కౌంటర్‌, ఉద్యమం, ఊరేగింపు, రాజకీయ పరిణామాలు, ప్రజ జీవితాలు, దళితులపై అత్యాచారాలు, ఆదివాసుల అరణ్యరోదన, మహిళా హక్కు ఆందోళనలు - అన్నీ రన్నింగ్‌ కామెంటరీగా మారిపోతుంది. ఎనిమిది చిన్న చిన్న లైన్లలో సాగిన ఆ రన్నింగ్‌ కామెంటరీ జర్నలిజం చరిత్రలోనే అరుదైన విశేష ప్రక్రియ. రన్నింగ్‌ కామెంటరీ ఎంతోమందిని ఉద్యమాలకు చేరువ చేసిందంటే అతిశయోక్తి కాదు.
    

ప్రజాతంత్రకు సంపాదకుడిగా ఉన్న దేవిప్రియ ఎన్నో నూతన పద్ధతులను ప్రవేశపెట్టారు. విద్యార్థిగా వున్న సమయంలో ప్రజాతంత్ర పత్రిక మాకు అభ్యుదయ కరదీపికగా ఉండేది. ఆ రోజుల్లో నేను చదివిన పత్రికల్లో ప్రజాతంత్ర ముఖ్యమైనది. ప్ర.జ. పేరుతో శ్రీశ్రీ చేత చెప్పించిన జవాలు ఎంతో ఆసక్తిగా వుండేవి. అవి ఆ రోజు శ్రీశ్రీతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్లు అనిపించేవి. శ్రీశ్రీ అంటే ఒక ఆవేశం కలిగే మాలాంటి విద్యార్థులకు ఆ శీర్షిక ఒక అద్భుత ప్రత్యక్ష చైతన్యచిత్రం. దేవిప్రియ సంపాదకీయాలు, ఉదయంలో రన్నింగ్‌ కామెంటరీని చదివి స్ఫూర్తి పొందిన నాకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. 2008లో హెచ్‌.ఎం. టివి ఛానెల్‌లో అటువంటి అరుదైన అనుభవం కలిగింది. ఆయన ఏనాడూ ఆధిపత్యం, అజమాయిషీ చేసి ఎరుగరు. 

అతి కింది స్థాయి ఉద్యోగి నుంచి, తోటి జర్నలిస్టు, ఆపైన ఉన్న యాజమాన్య ప్రతినిధుందరితో ఒకే విధమైన సంబంధాలు కలిగి ఉండేవారు. నేను హెచ్‌.ఎం. టివి లో విరామం లేకుండా సాగించిన వీక్షణం కార్యక్రమం 150 ఎపిసోడ్స్‌ పూర్తయిన సందర్భంలో ఆయన నా గురించి రాసిన రన్నింగ్‌ కామెంటరీ ఇప్పటికీ మా ఇంట్లో ఫ్రేమ్‌ కట్టి ఉంది. నన్ను ఆయన చాలా ప్రేమగా, అభిమానంగా చూడటం ఒక నిండైన  ఆనందాన్నిఇస్తూంటుంది. ఇప్పటికీ ఆయన చూపే ఆప్యాయత ఒక తండ్రిని గుర్తుకు తెస్తుంటుంది. అది నాకు ఒక అపురూప సందర్భం.
    

దేవిప్రియ అందరు కవులవంటివాడు కాదు. ఆయన ఏ సంఘంలోనూ సభ్యుడు కాదు. ఏ సిద్ధాంత ప్రచారకుడూ కాదు. కానీ ఆయనలో సభ్యత్వాలు కలిగిన వాళ్లకన్నా, సిద్ధాంత ప్రచారకులకన్నా ప్రజల పట్ల ప్రేమ ఎక్కువగా వున్నది. విప్లవ, అభ్యుదయ, ప్రగతిశీల, ప్రజాస్వామ్య సంఘాల్లో పనిచేసిన వారికన్నా చాలా నిబద్ధత కలిగి ఉన్నాడు. ఆయన తనకు తానుగా పదేపదే మార్క్సిస్టుగానో, సెక్యులరిస్టుగానో చెప్పుకున్న వాడు కాదు. కానీ ఆయన జీవితం దానికి నిదర్శనంగా నిలిచింది. ముఖ్యంగా దేవిప్రియ జీవితం ప్రధాన భాగమంతా విప్లవోద్యమం బలంగా కొనసాగిన రోజులు. అటువంటి ఉద్యమాన్ని మనసారా గుండెకు హత్తుకున్నవాడు. వాటిపట్ల కొనసాగిన దమనకాండను తీవ్రంగా వ్యతిరేకించినవాడు.
    

అదేవిధంగా తనది ఒక మతం, మతంలో పేరు వేరు, తాను కొనసాగించిన పేరు వేరు. తాను వరించిన రాజ్యలక్ష్మిది వేరే మతం. పిల్లలకు తమ జీవితాలను ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చినవాడు. ఇల్లే ఒక లౌకిక జీవనానికి ‘అమ్మచెట్టు’. అటువంటి అరుదైన వ్యక్తి హిందువూ కాదు. ముసల్మానూ కాదు. క్రైస్తవుడు అంతకన్నా కాదు. ఆయన ఒక మనిషి. మహా మనిషి. భావితరాలకు ఆయన ఒక నమూనా.

                       "