చంద్రబాబు పొత్తు ఆశలు: వెంటాడుతున్న గతం
వచ్చే ఎన్నికల్లో బిజెపి, జనసేనలతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆశపడుతున్నట్లు కనిపిస్తున్నారు. కుప్పంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇతర పార్టీలతో పొత్తులు ఉంటాయని ఆయన చెప్పారు. 2024 ఎన్నికల్లో జనసేన, వామపక్షాలు తమ పార్టీతో కలిసి పోటీ చేస్తాయని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పొలిట్ బ్యూర్ సభ్యుడు అహ్మద్ షరీప్ చేసిన వ్యాఖ్యలతో ఆ విషయం తెర మీదికి వచ్చింది. నిజానికి, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే Chandrababu Naidu నాయకత్వంలోని టీడీపీ విజయాలు సాధించింది.
చంద్రబాబు వ్యాఖ్యలకు బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ప్రతిస్పందించారు. చంద్రబాబుపై లవ్ కామెంట్స్ చేశారు. BJPతో పొత్తు కుదరడమనేది కల్ల అని ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. అవసరమైనప్పుడు లవ్ చేయడంలో చంద్రబాబు సమర్థుడని Somu Veerrajuఅన్నారు. చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారని ఆయన అన్నారు. అవసరమైనప్పుడు చంద్రబాబు లవ్ చేస్తారని, ఆ తర్వాత ఏం చేస్తారనేది తన నోటితో చెప్పలేనని అంటూ గతంలో కాంగ్రెసును కూడా చంద్రబాబు లవ్ చేశాడని అన్నారు. ఈ వ్యాఖ్య ద్వారా గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నెరిపిన రాజకీయాన్ని సోము వీర్రాజు ఎత్తిపొడిచారు.
గత లోకసభ ఎన్నికలకు ముందు చంద్రబాబు కాంగ్రెసుతో స్నేహం చేశారు. బిజెపి ఓడిపోతుందని, వివిధ పార్టీల బలంతో కాంగ్రెసు అధికారంలోకి వస్తుందని భావించి ఆయన పడిన శ్రమ తక్కువేమీ కాదు. Rahul Gandhiతోనూ కన్నడ నేత కుమారస్వామితోనూ ఇతర ఇతర నేతలతోనూ అత్యంత సన్నిహితంగా మెలుగుతూ జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి ప్రయత్నించారు. అది కాస్తా బెడిసికొట్టింది. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో ఆయన బిజెపితోనూ, Jana sena అధినేత Pawan Kalyanతోనూ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్ జనసేన ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ చంద్రబాబు విజయం కోసం ప్రచార సభల్లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి చంద్రబాబు వేదికను పంచుకున్నారు. ఈ రెండు పార్టీలతో పొత్తు కారణంగానే కాకుండా అనుభవం ఉన్న నాయకుడిగా తనకున్న ప్రజాభిప్రాయం కారణంగా కూడా ఆయన అధికారంలోకి వచ్చారు.
ఆ తర్వాతనే పరిస్థితులు చంద్రబాబుకు ఎదురు తిరుగుతూ వచ్చాయి. రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు బిజెపి దూరమైంది. పవన్ కల్యాణ్ జనసేన కూడా ఒంటరిగా పోటీ చేసింది. దీంతో చంద్రబాబు TDP ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది. టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ బంపర్ మెజారిటీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అది మొదలు చంద్రబాబుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు కలలు కన్న అమరావతి రాజధానికి జగన్ ఉనికి లేకుండా చేశారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ ఘోరమైన ఫలితాలను చవి చూసింది. తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా చంద్రబాబుకు గాలి ఎదురు తిరిగింది.
ఈ పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఏ విధమైన ఫలితాలు ,సాధిస్తుందనేది చెప్పలేకుండా ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజెపితో జత కట్టారు. బిజెపి, జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్ధపడ్డాయి. ఆ పార్టీలో చంద్రబాబును కలుపుకోవడానికి ఏ మాత్రం ఇష్టంగా లేవని సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అది జగన్ కు కలిసి వచ్చే విషయం కూడా. బిజెపి, జనసేన కూటమి ఎంతగా బలపడితే టీడీపీ అంతగా బలహీనపడుతుంది.
అదే సమయంలో వైసీపీని ఒంటరిగా తమ పార్టీ ఎదుర్కోలేదనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లు కనిపిస్తున్నారు. అందుకే తిరిగి పొత్తులపై మాట్లాడుతున్నారు. బిజెపి, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ కు నష్టం వాటిల్లుతుందనేది చెప్పక తప్పదు. అయితే, బిజెపి చంద్రబాబుతో జత కట్టడానికి ఏ మాత్రం ఇష్టంగా లేదు. ఈసారి చంద్రబాబు టీడీపీని అధికారంలోకి తేలేకపోతే మరిన్ని గడ్డు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ను తేవాలని కొంత మంది టీడీపీ నాయకులు చెబుతున్నారు. Jr NTRను తేవడం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదు. టీడీపీకి ప్రస్తుతం తీవ్రమైన గడ్డు పరిస్థితులే ఉన్నాయి. వచ్చే కాలం కూడా అదే పరిస్థితి ఎదురు కావచ్చు. గతంలో కాంగ్రెసుతో నెరిపిన స్నేహమే చంద్రబాబు వెంటాడుతోంది.