జనసేన, టీడీపీ మధ్య పొత్తు పొడుపు: పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్?
టీడీపీతో తెగదెంపులు చేసుకున్నప్పటికీ జనసేన మండలాధ్యక్ష పదవులను చేజిక్కించుకోవడానికి పొత్తుకు సిద్ధపడింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల పరిషత్తు అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి మెజారిటీ రాని చోట్ల జనసేన, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లకు మధ్య పొత్తు కుదిరినట్లు తెలుస్తోంది. మండలాధ్యక్ష పదవులను కైవసం చేసుకుని పంచుకోవడానికి ఆ పార్టీలు సిద్ధపడ్డాయి. బద్ధ శత్రువులుగా కొనసాగుతూ వస్తున్న ఈ ఇరు పార్టీల మధ్య స్థానిక స్థాయిలో పొత్తు కుదరడంపై బలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
2019 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన టీడీపీకి దూరమైంది. బిజెపికి స్వయానా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడే స్వయంగా దూరమయ్యారు. ఆ తర్వాత బిజెపి, జనసేనల మధ్య పొత్తు కుదిరింది. పరిషత్తు ఎన్నికలను టీడీపీ బహిష్కరించినప్పటికీ మండలాధ్యక్ష పదవులను కైవసం చేసుకోవడానికి జనసేనతో చేతులు కలుపుతోంది.
ఉభయ గోదావరి జిల్లాల్లో మండలాధ్యక్ష పదవులను చేజిక్కించుకుని రెండేళ్లు, మూడేళ్ల చొప్పున పంచుకోవడానికి జనసేన, టీడీపీ సిద్ధపడ్డాయి. తూర్పు గోదావరి జిల్లాలోని కడియం, రాజోలు, ఆలూరు, పి. గన్నవరం, వీఆర్ పురం మండలాల అధ్యక్ష పదవులు వైసీపీ దక్కకుండా తాము కలిసి దక్కించుకోవడానికి రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం, ఆచంటల్లో కూడా జనసేన, టీడీపీలు చేతులు కలుపుతున్నాయి.
టీడీపీతో పొత్తుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పచ్చజెండా ఊపారా, లేదా అనేది తెలియదు. బహుశా ఆయన వద్దకు ఆ విషయం వచ్చిందో లేదో కూడా తెలియదు. పొత్తును తెంచుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత టీడీపీ ప్రభుత్వం తీరుపై తీవ్రమైన విమర్శలు చేశారు. టీడీపీపై కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అటువంటిది పవన్ కల్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుకు అంగీకరిస్తారా అనేది ప్రశ్న.
ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, టీడీపీల పొత్తుపై బిజెపి నాయకులు ఏమీ మాట్లాడడం లేదు. బిజెపి జనసేనతో పొత్తులో ఉంది. తమతో పొత్తు పెట్టుకున్న జనసేన టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటుందనే ప్రశ్న బిజెపి నుంచి రావడం లేదు. వైఎస్ జగన్ ఎదుర్కోవడంలో భాగంగా బిజెపి కూడా ఆ పొత్తును అంగీకరిస్తోందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
కాగా, జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి గానీ ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి గానీ టీడీపీ అదినేత నారా చంద్రబాబు నాయుడికి ఏ విధమైన అభ్యంతరాలు ఉండకపోవచ్చు. నిజానికి, జనసేనతో పొత్తును తెంచుకోవాలని చంద్రబాబు అనుకోలేదు. భవిష్యత్తులో ఆయన జనసేనతో మాత్రమే కాదు, బిజెపితో కూడా పొత్తుకు సిద్ధపడవచ్చుననే అభిప్రాయం బలంగా ఉంది. అయితే, ప్రస్తుత పొత్తులు రాష్ట్రస్థాయిలో చంద్రబాబు ఆశించినట్లు కుదురుతాయా అనేది వేచి చూడాల్సిందే.
ఇదిలావుంటే, వామపక్షాలు వైసీపీ దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తమకు మెజారిటీ రాని వీఆర్ పురంలో సీపీఎంతో చేతులు కలపడానికి జగన్ నాయకత్వంలోని వైసీపీ సిద్ధపడింది. ఈ పొత్తుపై వైఎస్ జగన్ కు అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఎంపీటీసీ ఎన్నికల్లో జరుగుతున్న ఈ పొత్తులు ఏపీలో భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు దారి తీస్తాయా అనేది వేచి చూడాలి.