Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ మంత్రివర్గంలో ఆరుగురే తెలంగాణ ఉద్యమనేతలు

కేసీఆర్ మంత్రివర్గంలోని 16 మందిలో టీఆర్ఎస్ లో మొదటి నుంచి ఉంటూ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవారు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ ను కూడా లెక్కలో వేసుకుంటే ఎడుగురు అవుతారు.

Only six ministers in KCR cabinet, who were in Telangana movement
Author
Hyderabad, First Published May 6, 2021, 10:24 AM IST

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో లేరని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దాంతో ఎవరు మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్నారు, ఎవరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట ఉన్నారు, వారిలో ఎంత మంది ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారనే చర్చ సాగుతోంది. 

తెలంగాణ రాష్ట్రం కోసం తెగబడి కొట్లాడినవాళ్లు, పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లు ఎంత మంది మంత్రివర్గంలో ఉన్నారనే చర్చ సాగుతోంది. ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేయడంతో ప్రస్తుతం కేసీఆర్ మంత్రివర్గంలో 16 మంది మంత్రులు ఉన్నారు. వారిలో ఆరుగురు మాత్రమే తెలంగాణ కోసం పోరాడినవారు. మిగతా వాళ్లంతా ఏదో రూపంలో తెలంగాణను వ్యతిరేకించినవాళ్లు, తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసినవారు. 

తెలంగాణ కోసం పనిచేసినవాళ్లలో హరీష్ రావు, జగదీష్ రెడ్డి,  కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కేటీ రామారావు మాత్రమే మంత్రులుగా ఉన్నారు. కేటీఆర్ కూడా 2009లో టీఆర్ఎస్ లో చేరి తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. 

తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన తలసాని శ్రీనివాస రావు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆయన కేసీఆర్ మీద విమర్శలు చేశారు. చంద్రశేఖర రావును నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే ఉంటుందని, తెలంగాణ రాదని ఆయన అన్నారు. తాను తలుచుకుంటే కేసీఆర్ ఇల్లు ఖాళీ చేయిస్తా అని కూడా అన్నారు. ఇంకా చాలానే అన్నారు 

ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చి మంత్రి అయ్యారు. ఈటెల రాజేందర్ ను తగ్గించడానికే ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారనే అభిప్రాయం ఉంది. టీడీపీ నేతగా ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేసినవారే. ఆయన ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుల సమీకరణలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. టీఆర్ఎస్ లో చేరి తొలిసారి ఆయన మంత్రి పదవిని పొందారు.

ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ తొలుత కాంగ్రెసు,లో ఆ తర్వాత వైసీపీలో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆయన కేసీఆర్ మీద విమర్శలు చేశారు. పువ్వాడ అజయ్ ఇప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో ముఖ్యమైనవారు. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెసులోనూ టీడీపీలోనూ ఉన్నారు. బిఎస్పీ నుంచి పోటీ చేసి గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇక సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్నారు. వైఎస్ చేత చేవెళ్ల చెల్లెమ్మగా పిలిపించుకున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో తొలి మహిళా మంత్రిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. సత్యవతి రాథోడ్ తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చి మంత్రి పదవిని చేజిక్కించుకున్నారు.

ప్రస్తుత హోం మంత్రి మహమూద్ అలీ తెలంగాణ ఉద్యమంలో కనిపించలేదు. శ్రీనివాస్ గౌడ్ మాత్రం తెలంగాణ ఉద్యోగులకు నాయకత్వం వహిస్తూ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. కాంగ్రెసు టికెట్ దక్కకపోవడంతో ఆయన టీఆర్ఎస్ లోకి వచ్చారని అంటారు. శ్రీనివాస గౌడ్ ను కూడా తెలంగాణ ఉద్యమ నేతగా పరిగణనలోకి తీసుకుంటే కేసీఆర్ మంత్రివర్గంలోని 16 మంది మంత్రుల్లో ఏడుగురు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసినవారు కనిపిస్తారు.

ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించారు. కేసీఆర్ నిరాహారదీక్షను విరమించడానికి సిద్ధపడినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో విద్యార్థులకు నచ్చజెప్పి, వారిని చల్లబరచడంలో ఈటెల రాజేందర్ పాత్ర మరువలేనిది. ఇప్పుడు ఆయన కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. టీఆర్ఎస్ లో కొనసాగే పరిస్థితి కూడా లేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత కేసీఆర్ తొలుత టీడీపీని, ఆ తర్వాత కాంగ్రెసు చావుదెబ్బ తీయడానికి వలసలను ప్రోత్సహించారు. ఆ పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. కొంత మందికి మంత్రిపదవులు ఇచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం, బంగారు తెలంగాణ కోసం రాజకీయ పునరేకీకరణ జరగాలని, అందువల్ల తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినవారిని కూడా పార్టీలో ఆహ్వానిస్తున్నానని కేసీఆర్ అప్పట్లో పదే పదే చెబుతూ వచ్చారు. 

ఈ స్థితిలోనే ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం అనేదాన్ని ఎజెండా మీదికి తెస్తున్నారు తెలంగాణ అభివృద్ధి మాత్రమే కాదు, ఆత్మగౌరవం కోసం కూడా తెలంగాణ ఉద్యమం జరిగిందని, ఆత్మగౌరవాన్ని కోల్పోయి అణగిమణిగి ఉండాల్సిన అవసరం లేదని ఆయన మాట్లాడుతున్నారు. ప్రస్తుత స్థితిలో ఆత్మగౌరవ నినాదం తెలంగాణ ప్రజలను కూడగట్టడానికి ఈటెల రాజేందర్ కు పనికి వచ్చే అవకాశాలు లేకపోలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios