NTR Jayanthi: ఎన్టీఆర్ తో విచిత్రమైన అనుభవం

ఎన్టీఆర్ విలక్షణమైన వ్యక్తిత్వం గల రాజకీయ నాయకుడు, తెలుగు సినీ దిగ్గజం. ఎన్టీఆర్ ను తలుచుకోవడమంటే తెలుగు ప్రాంతాల రాజకీయ చరిత్రనే కాదు, భారత రాజకీయ చరిత్రను కూడా నెమరు వేసుకోవడం.

NTR Jayanthi: My personal experience with NTR

సినీ వైతాళికుడు, రాజకీయ దురంధురుడు ఎన్టీ రామారావు అంటే గంభీరమైన వ్యక్తిత్వం కళ్ల ముందు కదులాడుతుంది. ఆయన గంభీరమైన వర్చస్సు చూసి చాలా మంది మాట్లాడడానికి కూడా భయపడేవారు. దూరంగా నించుని ఆయన చూపుల కోసం ఎదురు చూసేవారు. 1984 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తర్వాత ఆయన రాజకీయ జీవితం చాలా ఒడిదొడుకులతోనే సాగిందని చెప్పాలి. 1989 శానససభ ఎన్నికల్లో ఆయన అప్పటి  మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి శానససభా నియోజకవర్గం నుంచి ఓడిపోవడం నమ్మశక్యం కాని విషయం. టిడిపి 1989 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. బహుశా ఆయన ఇది ఊహించి ఉండరు. అప్పుడు నేను ఉదయం దినపత్రికలో రాజకీయ వార్తలు రాసే ప్రతినిధిగా తెలుగుదేశం వ్యవహారాలు చూస్తున్న కాలం.ప్రతిపక్షంలో ఉన్న పార్టీపై వార్తలు రాయడం కష్టమే. పెద్దగా రాయడానికి ఏమీ ఉండవు. కానీ, నేను అదే పనిగా రాస్తూ ఉండేవాడిని. 

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాల్లో నటించడం మానేశారు. అయితే, మోహన్ బాబు పట్టుబట్టి ఎన్టీ రామారావుతో మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించడానికి ఒప్పించారు. ఈ విషయం తొలుత నాకు తెలుగుదేశం నాయకుల ద్వారా తెలిసింది. దాంతో నేను ఎన్టీఆర్ ఆ సినిమాలో నటిస్తున్న విషయాన్ని వార్తాకథనంగా రాశాను. అదే సమయంలో ఎన్టీ రామారావు మద్యనిషేధ ఉద్యమాన్ని పెద్ద యెత్తున మొదలు పెట్టారు.

మద్య నిషేధంపై ఎన్టీ రామారావు మీద కాంగ్రెసు నాయకులు విమర్శలు చేస్తూ ఆయన కుమారుడు హరికృష్ణ ఆహ్వానం హోటల్లో బార్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించారు. దాన్ని ఎన్టీ రామారావు కొట్టిపారేశారు. హరికృష్ణ బార్‌కు చేసుకున్న దరఖాస్తు జీరాక్స్ ప్రతిని అచ్చేస్తూ వార్తాకథనం రాశాను. అదే సమయంలో ఆయన హైదరాబాదు నుంచి విశాఖపట్నం వరకు రైలులో మద్య నిషేధ యాత్రను తలపెట్టారు. రైలులో వెళ్తూ ఆయన మధ్య మధ్యలో మద్యనిషేధంపై ప్రసంగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దాన్ని కూడా నేను మలుపు ఇచ్చి రాశాను. విశ్వామిత్ర సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను అరకులోయలో చిత్రీకరించడానికి వెళ్తున్నారని, పనిలో పనిగా మద్య నిషేధ యాత్ర చేస్తున్నారని వార్తాకథనం రాశాను. అది పతాక శీర్షిక కింద అచ్చయింది. ఇలా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాసే పనిలో పడి చివరకు ఎన్టీ రామారావు ఇంటర్య్యూకు సమయం తీసుకున్నాను. 

తెల్లవారు జామునే నేనూ, అప్పుడు మాకు బ్యూరో చీఫ్‌గా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి ఎన్టీ రామారావు నివాసానికి వెళ్లాం. మేం వెళ్లేసరికే ఎన్టీ రామారావు అన్ని పనులూ పూర్తి చేసుకుని కుర్చీలో నిండుగా కూర్చున్నారు. మేం ఎదురుగా కూర్చోగానే ఎన్టీ రామారావు నుంచి అనూహ్యమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. నా వార్తలను తప్పు పడుతూ ఆయన చాలా సేపు మాట్లాడారు. కాస్తా అసహనం వ్యక్తం చేశారు. కానీ, ఆ తర్వాత మామూలుగా అయిపోయి, మేం అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చారు. ఇకపోతే, ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తూ కోర్టుకు కూడా ఎక్కారు. అప్పుడు, మరో సమయంలోనో గానీ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను ఎలా పెరిగింది, ఎలా ఎదిగింది - ఇలా తన జీవిత ప్రయాణ క్రమాన్ని వివరిస్తూ వచ్చారు. ఒక సందర్భంలో ఆయన కన్నీరు కూడా పెట్టుకున్నట్లు గుర్తు. నిజంగా, ఆ రోజు గుండె కరిగి నీరైంది. ఎన్టీ రామారావుకు ఇతరుల మీద ఈర్ష్యాద్వేషాలు ఉండేవి కావనే నాకు అనిపించింది. కానీ, తీవ్రమైన భావోద్వేగం మాత్రం ఉండేది. ప్రజలకు మేలు జరుగుతుందని అనుకుంటే ఆ పని చేసి తీరేవారు. ఎవరైనా నచ్చజెప్పేవారు ఉంటే, మేలు జరుగుతుందంటే, తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి కూడా వెనకాడేవారు. అలాంటి ఓ సంఘటన కూడా నా అనుభవంలో ఉంది. ఏమైనా, ఎన్టీ రామారావు సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఓ ఉత్తుంగ తరంగం. అటువంటి నేత మళ్లీ రాకపోవచ్చు కూడా.

కాసుల ప్రతాపరెడ్డి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios