అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కార్పోరేషన్ల మేయర్ పదవులను, మున్సిపాలిటీల చైర్ పర్సన్ పదవులను కట్టబెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనపిస్తున్నారు. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఖరారు చేసినట్లు అర్థమవుతోంది. పార్టీ పునాదులను క్షేత్ర స్థాయిలో పటిష్టపరిచే దిశగా ఈ పదవుల పంపకం జరిగినట్లు భావిస్తున్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల్లో రాజకీయ చైతన్యం పెరుగుతున్న విషయాన్ని ఆయన పసిగట్లే ఉన్నారు. వారికి కోటాలను మించి పదవులను అప్పగించారు.  మహిళలకు 60.46 శాతం మున్సిపాలిటీ అధ్యక్ష పదవులను మహిళలకే ఇచ్చారు. యాభై శాతం కోటాను మించి ఆయన మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. 

అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 78 శాతం పదవులు లభించాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ, తిరుపతతి కార్పోరేషన్ల మేయర్లుగా బీసీ వర్గానికి చెందిన మహిళలకు ఇచ్చారు పార్టీ సాధించిన 11 కార్పోరేషన్లలో మేయర్ పదవులు 7 మహిళలకే దక్కాయి. రాజకీయ నేపథ్యం కూడా లేని మహిళలకు పదవులు అప్పగించారు. తద్వారా పార్టీకోసం పనిచేస్తే ఎవరికైనా పదవులు దక్కుతాయనే సంకేతాలను ఆయన పంపించినట్లయింది. 

11 మేయర్, 75 మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవులల్లో చట్టప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 45 శాతం పదవులు కేటాయించాల్సి ఉంది. అయితే వారికి 67 శాతం పదవులను వైఎస్ జగన్ అప్పగించారు. మొత్తం 86 పదవుల్లో మైనార్టీలు సహా బీీసలకు 30 పదవులు కేటాయించాల్సి ఉండగా 52 ఇచ్చారు. మొత్తం 70.3 శాతం పదవులు ఆ వర్గాలకు దక్కాయి. 

మొత్తం 86 పదవుల్లో మహిళలకు 50 శాతం కేటాయించాలి. ఆ రకంగా మహిళలకు 44 పదవులు కేటాయించాలి. కానీ జనగ్ ఏకంగా 52 మంది మహిళలకు పదవులు ఇచ్చారు తద్వారా 60.46 శాతం పదవులు మహిళలకు దక్కాయి.  జనరల్, బీసీ జనరల్, ఎస్సీ జనరల్ పదవుల్లో కూడా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు.

మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలకు అత్యధిక పదవులు కేటాయించడం ద్వారా పార్టీ పునాదులను పటిష్టపరుచుకోవడానికి వీలవుతుందని ఆయన భావించి ఉంటారు. అదే సమయంలో అగ్రవర్ణాలకే పెద్ద పీట దక్కుతుందనే అభిప్రాయాన్ని ఆయన తారుమారు చేయడానికి పూనుకున్నట్లు చెప్పవచ్చు. మొత్తంగా జగన్ రాష్ట్రంలో తన పార్టీ పునాదులను మరింతగా పటిష్టపరుచుకునే వ్యూహాన్ని అమలు చేశారు.