Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో మరో ఉపఎన్నికకు బీజేపీ తెరతీస్తుందా?.. వాళ్లకు పోయేది ఏం లేదు.. కేసీఆర్‌కు మాత్రం చుక్కలే!

తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక‌లో బీజేపీ అభ్యర్థి ఓడిపోవడంతో.. ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో ఎలాంటి వ్యుహంతో ముందుకు వెళ్తుందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఏదో విధంగా తమ బలాన్ని నిరూపించుకోవాలనే ఆలోచనలో ఉన్న బీజేపీ.. మునుగోడు మాదిరిగానే బీజేపీ తెలంగాణలో మరో ఉప ఎన్నికకు తెరతీస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

may be BJP Eye on Another Bypoll In telangana After Munugode defeat
Author
First Published Nov 7, 2022, 6:49 PM IST

తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక‌లో బీజేపీ అభ్యర్థి ఓడిపోవడంతో.. ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో ఎలాంటి వ్యుహంతో ముందుకు వెళ్తుందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మునుగోడులో విజయం సాధించి.. వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అధిష్టానం భావించింది. ఇందుకు తగ్గట్టే మునుగోడులో గెలుపు కోసం కృషి చేసింది. మునుగోడులో విజయం సాధించడం ద్వారా ఆపరేషన్ కమలంను మరింత విస్తృతం చేయడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రణాళికలు రచించింది. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేసింది. 

ఈ క్రమంలోనే మునుగోడులో బీజేపీని ఓడించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సర్వశక్తులు ఒడ్డారనే చెప్పాలి. హుజురాబాద్‌లో బీజేపీ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని.. మరోసారి అలాంటి ఫలితం మునుగోడులో రిపీట్ కాకుండా ముందు నుంచే కేసీఆర్ జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికలో వామపక్ష పార్టీల మద్దతు తీసుకున్నారు. అంతేకాకుండా మంత్రివర్గంతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు పెద్ద సంఖ్యలో మునుగోడు ప్రచారానికి తరలించారు. ఆయన కూడా ఓ గ్రామానికి బాధ్యునిగా ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రెండు బహిరంగ సభలకు కూడా కేసీఆర్ హాజరయ్యారు. ఒకటి ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడక ముందు జరగ్గా.. మరోకటి ఉప ఎన్నిక పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు జరిగింది. ఈ రెండు సందర్భాల్లో కూడా కేసీఆర్ ప్రసంగం బీజేపీని టార్గెట్‌గా చేసుకునే సాగింది. బీజేపీని గెలిస్తే అంతే సంగతులు అన్నట్టుగా కేసీఆర్ ప్రసంగం సాగింది. అయితే ఇలా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసిన టీఆర్ఎస్‌కు వచ్చింది 10 వేల ఓట్ల మెజారిటీనే. అయితే ఈ విషయంలో వామపక్షాల మద్దతు, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఓట్లు కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి.    

ఈ విధంగా కేసీఆర్ బీజేపీ ఆశలపై నీళ్లు చల్లారని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఒకవేళ మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తే.. ఆ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయనే ప్రచారం సాగింది. అంతేకాకుండా టీఆర్ఎస్‌పై, కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలు నమ్మకం కోల్పోయారనే సంకేతం కూడా వెలువడేది. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే మాటను కాషాయ పార్టీ మరింత బలంగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసేది. కానీ అలా జరగలేదు. మరోవైపు బీజేపీని కౌంటర్  చేయడానికి టీఆర్ఎస్ ఎప్పటికప్పుడూ ప్రయత్నాలను  ముమ్మరం చేస్తూనే ఉంది. మొయినాబాద్ పామ్ హౌస్ ఘటనలో బీజేపీని  దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో పాగా వేయాలనే తమ ప్రణాళికలకు మునుగోడు రూపంలో తగిలిన అడ్డంకిని.. బీజేపీ ఎలా హ్యాండిల్ చేయనుంది? భవిష్యత్తు ప్రణాళికలు ఎలా రచించనుంది? అనేది వేచి చూడాల్సి ఉంది. 

అయితే తెలంగాణలో తాము ఏదో విధంగా బలాన్ని నిరూపించుకోవాలనే ఆలోచనలో ఉన్న బీజేపీ.. మునుగోడు మాదిరిగానే బీజేపీ తెలంగాణలో మరో ఉప ఎన్నికకు తెరతీస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. బీజేపీ ఎక్కడైనా మిషన్ చేపట్టిందంటే దానిని విజయవంతం చేసేందుకు ఎంతవరకైనా వెళ్తుందనే ప్రచారం ఉంది. మునుగోడు ఉప ఎన్నికకు ముందు తెలంగాణలో బీజేపీకి వచ్చిన హైప్‌ను గనక కంటిన్యూ చేయాలని ఆ పార్టీ అధిష్టానం భావించిన నేపథ్యంలో.. మరో ఉప ఎన్నికకు తెరతీయడం పెద్ద కష్టమేమి కాదు. 

కాంగ్రెస్‌ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరి అక్కడి నుంచే కాషాయ పార్టీ తరపున ఉప ఎన్నిక బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలో రాజగోపాల్ రెడ్డికి ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి పరోక్షంగా సాకారం అందించాడనేది బహిరంగ రహస్యమే. ఈ క్రమంలోనే వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు వెంకట్ రెడ్డి వ్యతిరేక వర్గం ఆయనపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటే.. ఆయన పార్టీ నుంచే బయటకు వచ్చే అవకాశం లేకపోతే. తమ్ముడి బాటలోనే వెంకట్ రెడ్డి బీజేపీలో చేరితే.. ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో భువనగిరి పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ దిశగా బీజేపీ ఆలోచన చేస్తుందా? లేదా? అనేది దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఆమె ఇక్కడి రాజకీయ పరిణామాలపై అమిత్ షా నివేదిక ఇచ్చి ఉంటారనే చర్చ సాగుతుంది. ఈ పరిణామాలను గమనిస్తే.. బీజేపీ అధినాయకత్వం ఏదో సీరియస్‌గానే ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే బీజేపీ తలచుకుంటే తెలంగాణలో మరో ఉప ఎన్నిక రావడం అనేది పెద్ద పని కాదనే చెప్పాలి. 

అయితే భువనగిరి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే బీజేపీని ఎదుర్కొవడం కేసీఆర్‌కు చాలా కష్టమైన టాస్క్‌గా మారే చాన్స్ ఉంటుంది. ఉపఎన్నిక జరిగినప్పుడు త్రిముఖ పోరు (బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్) అనేది  టీఆర్ఎస్‌ పార్టీకి కలిసివచ్చే అంశంగా కనిపిస్తుందని.. కానీ పార్లమెంట్ స్థానానికి ఎన్నిక జరిగితే ఓటర్లు జాతీయ స్థాయి కోణంలో కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇది బీజేపీకి ఎడ్జ్ ఫ్యాక్టర్‌గా కనిపిస్తుంది. అలాగే ఆ పార్లమెంట్ స్థానం పరిధిలో కోమటిరెడ్డి సోదరులకు పట్టు ఉంది. 2014లో అక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన బూర నర్సయ్య గౌడ్ కూడా ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలో మునుగోడుతో పాటు, ఇబ్రహీంపట్నం, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగామ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ అర్బన్ ఓటర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైన పక్షంలో.. ఇవన్నీ కూడా కేసీఆర్‌కు ప్రతికూల అంశాలే. 

బీజేపీకి మాత్రం మరో ఉప ఎన్నికలో ఓడిపోయినప్పటికీ పెద్దగా ఎలాంటి ప్రభావం ఉండబోదు. ఆ పార్టీకి పోయేది కూడా ఏమి ఉండదు. కానీ  గెలిస్తే మరింత కొండంత  శక్తి లభించినట్టే అనే చెప్పాలి.  కానీ కేసీఆర్‌కు అలా కాదు.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆయనకు ప్రతి ఎన్నిక కూడా జీవన్మరణ సమస్య లాంటిదే. అందుకే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ విజయం కోసం ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో అందరికి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ స్థానానికి గనక ఉపఎన్నిక జరిగే మాత్రం కేసీఆర్ మరోసారి కష్టాలు తప్పవనే చెప్పాలి. మరి ఈ విషయంలో బీజేపీ ఎలాంటి వ్యుహాం అనుసరిస్తుందో వేచిచూడాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios