Asianet News TeluguAsianet News Telugu

కృష్ణయ్యతో ఠాక్రే భేటీ.. కాంగ్రెస్ నుంచి కీలక హామీ.. మరి వైఎస్ జగన్ అంగీకరిస్తారా?

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, సీనియర్ నేత వీ హనుమంతరావు శనివారం భేటీ అయ్యారు.

manikrao thakre meets YSRCP MP R Krishnaiah ksm
Author
First Published Jul 30, 2023, 10:08 AM IST

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, సీనియర్ నేత వీ హనుమంతరావు శనివారం భేటీ అయ్యారు. సుమారు అరగంటకుపైగా ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీకి బీసీల మద్దతును కోరారు. 

కృష్ణయ్య వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీసీ వర్గాల్లో గణనీయమైన ప్రభావం ఉన్నందున ఆయనను కలిశామని మాణిక్రావ్ ఠాక్రే, హనుమంతరావు స్పష్టం చేశారు. త్వరలో కాంగ్రెస్‌ ‘బీసీ డిక్లరేషన్‌’తో ముందుకు వస్తుందని కూడా చెప్పారు. బీసీ గర్జన బహిరంగ సభను కూడా భారీగా నిర్వహిస్తామని అన్నారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)లకు ప్రాధాన్యత ఇచ్చారని.. కేంద్రంలో పార్టీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా వారికి ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు. ఐఐఎం, ఐఐటీల్లో రిజర్వేషన్లు కల్పించే హామీలతో సహా కాంగ్రెస్ ఎజెండాలో ఓబీసీ అంశాలు ప్రముఖంగా ఉంటాయని ఠాక్రే అన్నారు.

ఈ భేటీ అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ..  ఐఐఎంలు, ఐఐటీలు, ఇతర విద్యా కోర్సుల్లో ఓబీసీ రిజర్వేషన్లను 27 నుంచి 50 శాతానికి పెంచడం, సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు వంటి 18 డిమాండ్లపై నేను ఠాక్రేకు రిప్రజెంటేషన సమర్పించానని తెలిపారు. ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని, కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీ మంత్రిని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ వచ్చిందని కృష్ణయ్య అన్నారు. 

అయితే గత కొంతకాలంగా బీసీ జనగణన చేయాలని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు  కృష్ణయ్య ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీసీ జనగణనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

ప్రస్తుతం కృష్ణయ్య వైసీపీ నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కాంగ్రెస్‌ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ కక్షగట్టి జైలుకు పంపించిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే జగన్ మాత్రం సోనియా గాంధీని సైతం ఎదుర్కొని నిలబడ్డారని చెబుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీల సమస్యలపై కాంగ్రెస్‌తో కలిసి కృష్ణయ్య పనిచేసేందుకు వైఎస్ జగన్ ఒప్పుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ కృష్ణయ్య కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తే.. ఒకింత బీసీల ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉంది. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. 

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సీఎం జగన్‌కు సత్సబంధాలు ఉన్నాయి. అలాంటిది కృష్ణయ్య ఈ విషయంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తే జగన్ ఒప్పుకుంటారా?.. లేదా?.. ఏదైనా కండిషన్ పెడతారా? అని తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్‌ను ఒప్పించడం కృష్ణయ్యతో అవుతుందా?.. జగన్ ఒప్పుకోకుంటే ఆయన ఏ విధంగా ముందుకు సాగుతారు? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కూడా మరికొద్ది నెలల సమయం ఉండటంతో.. బీసీల సమస్యలపై పోరాటంలో కాంగ్రెస్‌కు కృష్ణయ్య మద్దతిస్తారా? లేదా?  అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios