కరోనా వేళా దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు.  ఈ లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర కష్టాలనెదుర్కుంటున్నప్పటికీ... తమ ఉపాధిని కోల్పోయి, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నప్పటికీ... ప్రభుత్వం మీద గౌరవంతోనే, లేదా పోలీసులంటే భయంతోనో ఇండ్లకే పరిమితమవుతున్నారు. వారు తమ జీవనాధారాలను కోల్పోతున్నామని లోలోన బాధలు పడుతున్నా, ఇండ్లలోనే ఉంటున్నారు. 

కానీ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు మాత్రం లాక్ డౌన్ ని ఉల్లంఘిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు జనాలకు మాత్రమే తాము సామాన్యులం కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. 

తాజాగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరి ఎమ్మెల్యే రోజా గారు లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతున్నప్పటికీ... ఆమె మాత్రం బోర్ వెల్ (బోర్ పంప్ ) ను ప్రారంభించడానికి వెళ్ళింది. లాక్ డౌన్ సమయంలో ఇలాంటి ఓపెనింగులేమిటో అర్థం కావడం లేదంటే... ఆమె వచ్చే దారంతా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి పూలు చల్లుతూ ఆమెకు స్వాగతం పలికారు. (ప్రజలు స్వచ్చంధంగా వచ్చి ఇలా పూలు చల్లి స్వాగతం పలికారా, లేదా వారందరి చేతా ఎవరైనా బలవంతంగా పూలు వేయించారా అనేది అప్రస్తుతం. అయినా ఈ లాక్ డౌన్ వేళ ప్రజలు తిండికే ఇబ్బంది పడుతుంటే... పూలు ఎవరు, ఎలా కొని తీసుకొచ్చారు అనే ప్రశ్నలను మాత్రం అడగకండి)

ఇలా ఆమె ఆ బోర్ పంప్ ప్రారంభానికి వస్తున్నా, ఇలా పూలు చల్లడం అన్ని కూడా లాక్ డౌన్ ఉల్లంఘనే అని తెలిసిన స్థానిక నాయకులో, లేదా అధికారులో గాని వీడియోలు తీయొద్దంటూ ప్రజలను ఆదేశించడం మనం ఆ వీడియోలలో స్పష్టంగా వినొచ్చు. 

ఆమె అలా వస్తుంటే.. ప్రజలు దారి పొడవునా పూలు చల్లుతుంటే సదరు ఆదర్శనీయ, ప్రజల కోసం శాసనాలు చేసే, టీవీల్లో కూర్చుని కుటుంబ సమస్యలు పరిష్కరించే రోజా గారు మాత్రం ఆ పూలు అలా తన పాదాల వద్ద వేస్తుంటే పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేశారు తప్ప, ఎవర్ని కూడా ఏమిటిది అని వారించిన పాపాన పోలేదు సదరు మహిళా ఎమ్మెల్యే గారు. 

ఆమెకు ఊరిలోని ప్రజలు దండ వేసి సన్మానించారు కూడా. లాక్ డౌన్ అంటే... మాస్కులు కట్టుకోవడం ఒక్కటే అనుకున్నారు ప్రజలంతా, ఎమ్మెల్యేతో సహా మాస్కులు కట్టుకొని వీడియోలో కనిపించారు. అంతే తప్ప లాక్ డౌన్ వేళ ఇలాంటి ప్రారంభోత్సవాలు ఏమిటని అధికారులు కూడా ఎమ్మెల్యే గారిని వారించలేదా అనేది అర్థం కాని విషయం. 

గతంలో కూడా మరో వైసీపీ ఎమ్మెల్యే అదే చిత్తూరు జిల్లాకే చెందిన వ్యక్తి పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ కూడా ఇలానే ఒక బ్రిడ్జి ఓపెనింగ్ అని లాక్ డౌన్ ను ఉల్లంఘించడమే కాకుండా మీడియాపై కూడా దుర్భాషలాడాడు. 

ప్రజాప్రతినిధులు ఇలా వారికి ఇష్టం వచ్చినట్టు లాక్ డౌన్ ని ఉల్లంఘిస్తూ, చట్టం తమ చుట్టం అన్నట్టుగా ప్రవర్తిస్తుంటే.... సామాన్య ప్రజలు మాత్రం అత్యవసరంగా బయటకు వెళ్లినా  తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు అనే కంటే... లాక్ డౌన్ ఉల్లంఘన పేరుతో పోలీసులు ప్రాణాలను బలిగొంటున్నారు అనాలేమో!

నిన్న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మందులు కొనడానికి అత్యవసరంగా బయటకు వెళ్లిన యువకుడు పోలీసు దెబ్బలకు మరణించిన విషయం తెలిసిందే. అక్కడేమో లాక్ డౌన్ ఉల్లంఘన అంటూ కఠినంగా ప్రవర్తించిన పోలీసులు ఇక్కడ మాత్రం తమ కండ్లకు ఏమి కనపడలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అయినా ఒక ఎమ్మెల్యే పర్యటిస్తుందంటే.... అక్కడి సెక్యూరిటీ బాధ్యతలను చూసుకునేది పోలీసులే కదా!

అక్కడ నియమాలను అత్యుత్సాఅహంతో పాటించే పోలీసులు ఇక్కడ మాత్రం నియమాలను దెగ్గరుండీ తుంగలో తొక్కుతారు. సామాన్యులకు ఒక న్యాయం అధికార హోదాలో ఉన్న వారికి మరో న్యాయం! పోలీసులు ప్రజా సేవకులో, ప్రజా ప్రతినిధుల సేవకులో అర్థం కాక  తలలు పట్టుకుంటున్నారు సామాన్యులు!