కరోనా వైరస్: లాక్ డౌన్ ఎత్తివేత సాధ్యాసాధ్యాలు ఇవీ...
రెండవ దఫా లాక్ డౌన్ కూడా ముగింపు దశకు రావడం, ఏప్రిల్ 27వ తేదీనాడు ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో సర్వత్రా కూడా ఈ లాక్ డౌన్ పై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడడానికి ప్రపంచం వద్ద ఎటువంటి ఆయుధం లేదు. కేవలం లాక్ డౌన్ లో తల దాచుకుంటూ ఆ వైరస్ నుంచి తప్పించుకుంటోంది. భారతదేశం కూడా ప్రపంచ దేశాలు చూపిన బాటలోనే పయనిస్తూ లాక్ డౌన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ మూడు వారల లాక్ డౌన్ ముగుస్తుండగానే.... మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు స్వయానా ప్రధానమంత్రే ప్రకటించారు.
ఇక ఇప్పుడు రెండవ పర్యాయం విధించిన లాక్ డౌన్ కూడా మరో 9 రోజుల్లో ముగియనున్న విషయం అందరికి తెలిసిందే. మే 3వతేదితో ప్రధాని విధించిన లాక్ డౌన్ పూర్తవుతుంది. మే 7వ తేదీతో తెలంగాణాలో కూడా లాక్ డౌన్ ముగుస్తుంది.
ఇక ఇప్పుడు రెండవ దఫా లాక్ డౌన్ కూడా ముగింపు దశకు రావడం, ఏప్రిల్ 27వ తేదీనాడు ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో సర్వత్రా కూడా ఈ లాక్ డౌన్ పై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
సోషల్ మీడియాలో ఈ లాక్ డౌన్ కి సంబంధించి అప్పుడే థియరీలు, విశ్లేషణలు లీకుల పేరుతో వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇంకో పది రోజుల గడువు ఉన్నందున ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ పై ఏ నిర్ణయానికి కూడా రాలేము.
కానీ భారత ఆర్ధిక సలహాదారుల నుంచి మొదలు, ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం వరకు అందరూ కూడా ఈ లాక్ డౌన్ ను పొడిగించబోరు అని చెబుతున్నారు. ఇప్పటికే భారతదేశం ఈ లాక్ డౌన్ వల్ల రోజుకు దాదాపుగా 35,000 కోట్ల రూపాయలను నష్టపోతుంది.
మరికొన్ని రోజుల లాక్ డౌన్ భారాన్ని భారతీయ ప్రజలు మోయలేరు. పేదలు తిండి దొరక్క, ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. మధ్యతరగతి వారు కూడా ఈ లాక్ డౌన్ వల్ల తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో అర్థం కాక భయాందోళనలకు లోనవుతున్నారు.
ఇంకా కూడా ఈ లాక్ డౌన్ ను పొడిగిస్తే... కరోనా వల్ల ఎంతమంది మరణిస్తారో తెలియదు కానీ.... తిండి దొరక్క మాత్రం చాలామంది మరణించే ఆస్కారం ఉంది. కరోనా వల్ల కలిగే నష్టం కన్నా లాక్ డౌన్ వల్ల ఎక్కువ నష్టం కలిగే ప్రమాదం ఉంది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డీఏ లో కోత విధించింది. చాలా వరకు రాష్ట్రప్రభుత్వాలు జీతాల్లో కోతలను విధించాయి. ప్రైవేట్ కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకునేందుకు ఉద్యోగులను తొలగించడమో లేక వారి జీతాలను కట్ చేయడమో, లేదా సెలవుల మీద వెళ్ళమని ఆదేశించడమో జరుగుతూనే ఉంది.
పరిశ్రమలు తమ పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ఇప్పటికే అడుగుతున్నాయి. నెల రోజులపాటు యంత్రాలను వాడకుండా పక్కనుంచడంతో వాటిలో ఏమైనా సమస్యలు తలెత్తుతాయి అనే భయం కూడా పరిశ్రమల అధినేతల్లో లేకపోలేదు.
ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించడానికి ఆస్కారాలు చాలా తక్కువ. అలా అని లాక్ డౌన్ కి ముందు ఉన్న పూర్వపు పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు.
సోషల్ డిస్టెంసింగ్, మాస్కులు ధరించటం, ప్రార్థనామందిరాలపై ఆంక్షలు, సభలు, సమావేశాలపై ఆంక్షలు కొనసాగవచ్చు. కానీ లాక్ డౌన్ ని మాత్రం ఎత్తివేయక తప్పదు. దానికి తోడు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం లాక్ డౌన్ ఈ వైరస్ కి సొల్యూషన్ కాదు అని పదే పదే చెబుతుండడంతో కేంద్రం లాక్ డౌన్ ని ఎత్తివేయడానికి యోచిస్తోంది.
ఇవే పరిస్థితులు కొనసాగితే లాక్ డౌన్ ను ఎత్తివేయడం తథ్యం. ఒకవేళ అలా కాకుండా, కేసులు మరింతగా పెరిగితే మాత్రం లాక్ డౌన్ ను పెంచే ఆస్కారం ఉంటుంది. పరిస్థితి మామూలుగా ఉంటే మాత్రం లాక్ డౌన్ ను ఎత్తివేసే ఆస్కారమే ఎక్కువ. స్కూళ్ళు, కాలేజీలకు మాత్రం సెలవులు కొనసాగుతాయి.