సినిమా థియేటర్లలో మద్యం అమ్మకాలు: అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం!
మద్యాన్ని థియేటర్లలో పెడదామనే ఆలోచన ఏదో పైకి చూడడానికి బాగానే అనిపించినప్పటికీ.... దీనివల్ల చాలా సమస్యలు తలెత్తేలా కనబడుతున్నాయి. విదేశాల్లో సినిమా చూడడం దాన్నొక వినోదంగా భావిస్తారు. కానీ మనదగ్గర సినిమా కొందరికి ఒక మతం
కరోనా వైరస్ దెబ్బకు ప్రజలంతా ఇండ్లలోనే ఉంటున్నారు. ఈ లాక్ డౌన్ ముగిసిన తరువాత కూడా ప్రజలు ఎంతమేర బయట మునపటిలాగా తిరుగుతారు అనేది అనుమానమే! జనసమ్మర్ధమైన ప్రాంతాల్లో జనాలు ఇప్పుడప్పుడు సంచరించేలా కనబడడం లేదు.
ఈ లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలు బాగా దెబ్బతిన్నాయి. లాక్ డౌన్ ఎత్తిన తరువాత మిగిలిన రంగాలు ఒకింత పుంజుకున్నా కూడా..... సినిమా రంగం మాత్రం తట్టుకొని నిలబడేలా కనబడడం లేదు. ముఖ్యంగా థియేటర్ల పరిస్థితి మరి అధ్వానంగా ఉంది.
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే గ్యారంటీ లేదు. ఈ సంవత్సరం ఆఖరు వరకు, లేదా వచ్చే సంవత్సర ఆరంభంలో తెరుచుకున్నా తెరుచుకున్నట్టే. థియేటర్లు తెరుచుకున్న తరువాత కూడా ప్రజలు ఎంతమేర థియేటర్లకు వస్తారు? వచ్చినా భౌతిక దూరం పాటించాలి కాబట్టి అన్ని సీట్లను నింపలేరు.
ఈ నేపథ్యంలో థియేటర్లకు ప్రజలను ఎలా తీసుకురావాలని అందరూ తలలు పట్టుకుంటున్నారు. కొందరు ఇప్పటినుంచే ప్లాన్స్ ని రూపకల్పన చేస్తున్నారు కూడా! ఈ నేపథ్యంలో మహానటి చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ ఓ ప్రతిపాదనను తెర మీదకు తీసుకువచ్చాడు.
`గతంలో సురేష్ బాబు, రానాతో మాట్లాడుతున్నప్పుడు ఓ ఆలోచన వచ్చింది. కొన్ని దేశాల్లో ఉన్నట్టుగా మన దగ్గర కూడా థియేటర్లలో మధ్యం సర్వ్ చేసేందుకు అనుమతులు పొందితే ఎలా ఉంటుంది. వీటి వల్ల ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. థియేటర్ బిజినెస్‌ను అది కాపాడుతుంది (ప్రస్తుతం సినిమాను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది) మీరే మంటారు..? మంచి ఐడియానా.? లేక చెత్త ఐడియానా?' అని ట్వీట్ చేసాడు.
ఇలా మద్యాన్ని థియేటర్లలో పెడదామనే ఆలోచన ఏదో పైకి చూడడానికి బాగానే అనిపించినప్పటికీ.... దీనివల్ల చాలా సమస్యలు తలెత్తేలా కనబడుతున్నాయి. విదేశాల్లో సినిమా చూడడం దాన్నొక వినోదంగా భావిస్తారు. కానీ మనదగ్గర సినిమా కొందరికి ఒక మతం.
పూర్తిగా సినిమాలో లీనమైపోయి చూసేమనోల్లు ఆ సినిమాలో సాధారణ డైలాగ్స్ కె విజిల్స్ వేస్తూ గోల చేస్తారు. ఇక మందు తాగుతూ సినిమా చూస్తే... ఇంకేమన్నా ఉందా? అవ్వే సీసాలను పైకి గాల్లోకి విసిరేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇది పక్కకుంచితే... మన థియేటర్లకు ఫామిలీ ఆడియన్స్ పూర్తిగా తగ్గిపోతారు. ఇంకా మనదగ్గర మద్యం తాగడమనేది ఒక వినోదం కోసం అన్నట్టుగా చూడరు. అది ఒక వ్యసనం కింద, దాన్ని ఒక సాంఘీక దురాచారం కిందే లెక్కగడతారు.
ఈ నేపథ్యంలో మహిళలు, ఫామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం పూర్తిగా ఆగిపోతుంది. అయినా కొన్ని థియేటర్లలో పక్కనున్న ఇతర ప్రేక్షకులకు ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మద్యం తాగి వచ్చిన వారిని థియేటర్లలోకి కూడా అనుమతించారు కదా!
అసలే అమ్మాయిలను సాధారణంగా చూస్తేనే పిచ్చిపట్టినట్టు రెచ్చిపోయే కొందరు ఉన్న సమాజం మనది. అలాంటి వారిచేతికి మందు ఇస్తే.... అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది.
ఇంకో అంశం ఏమిటంటే.... థియేటర్లకు చాలామంది తమ సొంత వాహనాల్లో వస్తారు. ఇక సినిమా థియేటర్లలో కూడా మద్యాన్ని అమ్మితే... ఒకవేళ వారు తాగిన తరువాత ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే.... వారితోపాటుగా వారి కుటుంబసభ్యులు కూడా బాధపడాల్సి వస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉండనే ఉన్నాయి. ఆ టెస్టుల్లో దొరకడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు చెప్పండి?