దేశమంతా కరోనా వైరస్ విలయతాండవం గురించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన కరోనా ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీ గురించి చర్చలు నడుస్తున్నప్పటికీ.... మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ కరోనా చర్చ కన్నా కూడా ఎప్పుడు ఏదో ఒక రాజకీయ చర్చ జోరుగా సాగుతూనే ఉంది. 

స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తరువాత రమేష్ కుమార్ విషయం, రంగుల రాజకీయం, ఇంగ్లీష్ మీడియం, ఆ తరువాత అతి విషాదకరమైన విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటన. ఈ గ్యాస్ లీకేజి దుర్ఘటనకు రాజకీయాలకు సంబంధం లేదు. 

అది అజాగ్రత్త వల్ల జరిగిన ఒక దుర్ఘటన. దీనిపై ప్రభుత్వం తాము చేయగలిగిన ఆర్ధిక సహాయాన్ని మాత్రం ఎవరు ఊహించని రాతిలో చేసింది. ఆ కంపెనీ పై చర్యలు తీసుకోవడం తరువాయి. దానిపై కూడా త్వరలోనే జరుగుతున్న విచారణ పూర్తయ్యేలానే కనబడుతుంది. 

ఈ విషయాలను పక్కనబెడితే... తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలలో చెప్పిన సంక్షేమ పథకాల అమలుకు బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టింది. విశాఖ, గుంటూరు సహా 9 ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ భూమిని అమ్మడం ద్వారా నవరత్నాల్లో చెప్పిన సంక్షేమ పథకాల అమలుకు డబ్బును సమకూర్చుకోవడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. 

సంక్షేమ పథకాలను అమలు చేయడం పేదలు అధికంగా ఉన్న భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో అత్యవసరం. ఇంకా దారిద్య్ర రేఖకు దిగువన ఎందరో పేదలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎవరూ అడ్డు పడరు. 

కాకపోతే... ఇలా ప్రభుత్వ భూమిని విక్రయించి ఆ డబ్బును ఖర్చు పెట్టడం అనేది ఇక్కడ సమంజసంగా అనిపించడం లేదు. భూములను అమ్మి ఆ డబ్బును కనీసం వేరే అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టినా దాని వల్ల రాష్ట్రంలో మరింత ఆర్ధిక వృద్ధి జరుగుతుంది కాబట్టి ఒకింత సహేతుకంగా అనిపించొచ్చు.  

కానీ ఇలా ఉన్న ఆస్తులను అమ్ముకొని సంక్షేమ పథకాల మీద ఖర్చు పెట్టడం అనేది మాత్రం హర్షణీయం కాదు. ఇది మంచి సంప్రదాయం కూడా కాదు. ఉదాహరణకు భూములను అమ్మి రోడ్ల నిర్మాణమో లేదా ఇతరాత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేసినా అది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. 

ఇలా గనుక సంక్షేమ పథకాల మీద ఖర్చు పెడితే... ఆ భూములు ప్రైవేట్ పరం అవడంతోపాటుగా ప్రభుత్వం సమీకరించిన డబ్బు కూడా కొన్ని నెలల్లోనే ఆవిరయిపోతుంది. దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు. 

దానికి బదులుగా ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న ల్యాండ్ డెవలప్మెంట్ పద్దతిని పాటించొచ్చు కదా! ఇక్కడ ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. ప్రభుత్వం దగ్గర అంత డబ్బే ఉంటే.... ఇలా ఆస్తులెందుకు అమ్ముకుంటుంది? 

కానీ ప్రభుత్వం ఆ స్థలాలను అభివృద్ధి చేస్తా అంటే.... బ్యాంకులు ముందుకొచ్చి లోన్లు ఇస్తాయి. అసలే ఆర్ధిక మందగమనం వల్ల మార్కెట్లలోకి డబ్బులు ఇంజెక్ట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది కేంద్రం. 

ప్రభుత్వానికి ఇప్పుడు ఆ ప్రాజెక్టుల నిర్మాణం మొదలుపెడితే.... భూమికి భూమి మిగులుతుంది, దానితోపాటుగా ఈ కష్టకాలంలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజానీకానికి చేతినిండా పని దొరుకుతుంది. 

పోనీ ప్రభుత్వానికి అభివృద్ధి చేయడం కష్టమైతే... పీపీపీ మోడల్ లోనయినా ప్రైవేట్ సంస్ఠలను భాగస్వాములను చేస్తే.... ఇటు ప్రభుత్వానికి ఖర్చు ఆదా అవుతుంది, ప్రజలకు పని కూడా దొరుకుతుంది. 

వాటిని గనుక సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చేస్తే.... ఆ భూముల రేట్లు పదింతలు కూడా అవుతాయి. ఒకరకంగా ఆ ప్రాంతమంతా కూడా అభివృద్ధి బాటలో పయనించి అక్కడ అవసరమైన అన్ని మౌలికవసతులు కూడా ఏర్పరుచుకోవచ్చు. 

ఆస్తులున్నాయికదా అని రోజువారీ ఖర్చులకోసం మన సొంత ఆస్తులనయితే అమ్ముకోలేము కదా. ఈ రోజు మనం దాన్ని అమ్ముకొని తినొచ్చు. కానీ రేపు ఏమి మిగులుతుంది? కూర్చిని తింటే... కొండలయినా కరుగుతాయన్న పెద్దల సామెత ఊరికే పోదు కదా! ఇక్కడ చేయాల్సింది సంపద సృష్టి. ఆ దిశగా అడుగులు వేయాలి. 

ఈ సమయంలో ప్రభుత్వం ఉన్న భూములను సంక్షేమ పథకాల కోసం అని ఖర్చుపెడితే.... రేపు వచ్చే మరో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సర్కారో, పవన్ కల్యాణో, బీజేపీ ఓ ఇలా ఇంకో అవసరం ఉందని ఆయా ప్రభుత్వాలు అమ్మవని గ్యారంటీ ఏమిటి?

ఇలా అన్ని ప్రభుత్వాలు భూములను అమ్ముకుంటూ పోతే.... చివరికి నష్టపోయితేది మాత్రం ప్రజలు. ప్రజల సొమ్మును ప్రభుత్వాలు అమ్మడం, అందునా సంక్షేమ పథకాలకు ఇదెక్కడి న్యాయం? 

అందునా ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి ఉన్న తరుణంలో ఆ భూములను అమ్మినా పెద్దగా ప్రయోజనం ఉందదు. వాటి రేట్లు విపరీతంగా పడిపోయి ఉన్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు ప్రస్తుతానికి పని తీరిపోయినా దాని భవిష్యత్తు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 

ఎన్నిసార్లు మనం మన సొంత భూమిని అమ్ముకున్న తరువాత కొన్ని సంవత్సరాలకు ఆ భూముల రేట్లు పదింతలు అయినప్పుడు అప్పుడు అనవసరంగా అమ్మామే! అప్పుడు అమ్మకుండా ఉంటే... ఇప్పుడు బంగారం కదా అని అనుకోలేదు చెప్పండి?