కేటీఆర్ ఫామ్ హౌస్ వివాదం: రేవంత్ రెడ్డి పేల్చే బాంబు ఇదేనా...
నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డి ముందుంది మొసళ్ల పండగ అని శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో చిరంజీవి చెప్పినట్టుగా ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అని ట్వీట్ చేసి కేటీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేసారు.
తెలంగాణలో రాజకీయ వాతావరణం కేటీఆర్ కి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులివ్వడంతో ఒక్కసారిగా వేడెక్కింది. నిర్మాణాల్లో అతిక్రమణలకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదరన్ శాఖ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, జీవో 111 కింద ఉన్న ఆస్తులపై పరిశీలన జరపడానికి హై లెవెల్ కమిటీని కూడా నియమించాలని ఆదేశించింది.
జీవో 111 ను అతిక్రమించి స్విమ్మింగ్ పూల్, ఇతర సదుపాయాలతో కేటీఆర్ జన్వాడ ప్రాంతంలో ఫార్మ్ హౌస్ నిర్మించారని, అందునా ఉస్మాన్ సాగర్ లోకి వర్షపునీరు చేరే సహజసిద్ధమైన నాలాను ఆక్రమించి రక్షిత స్థలంలో ఈ నిర్మాణం చేప్పటారని ఆయన ఆరోపించారు.
రేవంత్ రెడ్డి తన అనుచరులతో ఆ ఫార్మ్ హౌస్ సందర్శనకు వెళ్ళినప్పుడు, పోలీసులు అడ్డుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిన విషయం విదితమే! మార్చ్ లో ఈ సంఘటన చోటుచేసుకున్న తరువాత రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు. దానితరువాత ఆయన ఎన్జీటీలో ఫిర్యాదు చేసారు.
జూన్ 6వ తారీఖు రాత్రి 7.30 ప్రాంతంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ తనకు ఆ ప్రాపర్టీ (ఫార్మ్ హౌజ్) కి ఎటువంటి సంబంధం లేదని, కాంగ్రెస్ నేత ఇలా ఎన్జీటీలో కేసును దాఖలు చేయడం ఉద్దేశపూర్వకంగా తనపై వ్యక్తిగత కక్షసాధింపు చర్య అని, తప్పుడు ఆరోపణలపై చట్టప్రకారంగా ముందుకు సాగుతానని తెలిపారు కేటీఆర్.
ఇక్కడిదాకా బాగానే ఉంది. తనపై ఫిర్యాదు చేసినందుకు సదరు ఆరోపణలను రాజకీయ నాయకుడిగా ఆయన ఖండించారు. కానీ ఇక్కడే ఇది మరో వివాదానికి తెరతీసింది. ఈ వివాదంలోకి ఇప్పుడు తెలంగాణ పోలీసులను లాగింది.
రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడానికిగల ప్రధాన కారణం ఆయన కేటీఆర్ "రిసైడింగ్ ప్రెమిసెస్" వద్ద తచ్చాడుతున్నందువల్ల (లోయిటరింగ్ అరౌండ్) ఆయనను అరెస్ట్ చేసారు. సింపుల్ గా చెప్పాలంటే కేటీఆర్ ఫార్మ్ హౌజ్ వద్ద తచ్చాడుతూ ఆయన విధులకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించినందుకు గాను ఆయనను అరెస్ట్ చేసారు.
నార్సింగి పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ మెమోలో... మార్చ్ 2వ తేదీ అర్ధరాత్రివేళ మియాఖాన్ గడ్డ ప్రాంతంలోని స్వరూప్ క్రికెట్ గ్రౌండ్ పరిసరాల్లో ఎవరో అనుమతులు లేకుండా డ్రోన్ ని ఎగురవేస్తున్నట్టు మొబైల్ లేక్ పోలీసులు గుర్తించారు. వెంటనే ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసారు.
రెండు రోజుల విచారణ అనంతరం నిందితులు ప్రవీణ్ పాల్ రెడ్డి, ఓం ప్రకాష్ రెడ్డి, జైపాల్ రెడ్డి, రాజేష్, విజయసింహ రెడ్డిలను అరెస్ట్ చేసారు. మార్చ్ 5వ తేదీన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు వారు తెలిపారు.
పోలీసుల విచారణలో వీరంతా మంత్రి కేటీఆర్ తోసహా ఇతర ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు ఉన్న ప్రాంతంలో అనవసరంగా తచ్చాడుతున్నారని, వారి విధుల నిర్వహణకు ఆటంకం కలిగించేలా వ్యవహరించినందున వీరంతా నేర శిక్షాస్మృతి సక్షన్ 7 కింద శిక్షకు అర్హులని పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఐపీసీ సెక్షన్ 287, 115, 109, 201, 120(బి) కింద వీరిపై కేసులు నమోదుచేసినట్టు నార్సింగి పోలీసులు కోర్టుకి తెలిపారు.
పోలీసులేమో కేటీఆర్ ఫార్మ్ హౌజ్ చుట్టూ వీరు తచ్చాడుతున్నందున అరెస్ట్ చేసాము అని అంటుంటే... కేటీఆర్ ఏమో ఆ ఫార్మ్ హౌజ్ తనది కాదు అని అంటున్నారు. ఇంతకు ఆ ఫార్మ్ హౌజ్ కేటీఆర్ ది కాకపోతే... పోలీసులు తప్పుడు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసారా...? లేదా కేటీఆర్ ఆ ఫార్మ్ హౌస్ తనది కాదు అని అబద్ధమాడుతున్నారా అనేది తేలాల్సిన అంశం.
తాజాగా నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డి ముందుంది మొసళ్ల పండగ అని శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో చిరంజీవి చెప్పినట్టుగా ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ అని ట్వీట్ చేసి కేటీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేసారు.
బహుశా చూడబోతుంటే రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయం లేవనెత్తేలా కనబడుతున్నారు. ఆయన ఇందుకు సంబంధించి వేరే ఏవైనా సాక్ష్యాధారాలను బయటపెడతారా, ఏమిటి అనే విషయం వేచి చూడాలి.