జలవివాదాలు: కేసీఆర్ టార్గెట్ వైఎస్ షర్మిల, ద్విముఖ వ్యూహం

కృష్ణా జలవివాదాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ ను మాత్రమే కాకుండా షర్మిలను కూడా టార్గెట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. వైఎస్ మీద విమర్శలు చేయడం ద్వారా షర్మిలను అడ్డుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నారు.

Krishna water dispute: KCR moves to check YS jagan and Sharmila

కృష్ణా జలవివాదాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. జలవివాదాలపై రాజకీయంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మాత్రమే కాకుండా ఆయన సోదరి వైఎస్ షర్మిలను కూడా టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నారు. వైఎస్ జగన్ ను మాత్రమే కాకుండా ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా టీఆర్ఎస్ నేతలు తప్పు పడుతున్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలని, శ్రీశైలం కుడి గట్టు కాలువ విస్తరణ పనులు కూడా నిలిపేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ రాజకీయ పార్టీని పెట్టబోతున్న వైఎస్ షర్మిలను నిలువరించడానికి జలవివాదాలను వాడుకోవాలని కేసీఆర్ భావించి, అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇటీవల మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాత ఐదారుగురు తెలంగాణ మంత్రులు జగన్ మీదనే కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎస్ నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డిలతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ మీదనే కాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ నీటిని దోచుకున్నారంటూ వారు విమర్శలు చేస్తున్నారు. 

కృష్ణా నదీ జలాల వివాదంపై ఇరు రాష్ట్రాల మంత్రులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ గానీ జగన్ గానీ బయటకు వచ్చి మాట్లాడడం లేదు. జగన్ కేంద్రానికి లేఖలు రాయడంలో మునిగిపోగా, కేసీఆర్ త్వరలో ప్రధానిని కలవడానికి సిద్ధపడుతున్నారు. 

తెలంగాణలో షర్మిలను నిలువరించడానికే వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా వివాదంలోకి లాగి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణకు వెళ్లాలంటే వీసా కావాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ స్థితిలో వైఎస్ రాజశేఖర రెడ్డిని తెలంగాణ వ్యతిరేకిగా నిలబెట్టడం ద్వారా రాజన్న రాజ్యం తెస్తానంటున్న షర్మిలను నిలువరించడానికి కేసీఆర్ వ్యూహరచన చేసినట్లు భావిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios