తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచనకు రివర్స్ గేర్ పడేలా కనిపిస్తోంది. టీఎస్ ఆర్టీసి కార్మికుల సమ్మె మొదటికే మోసం తెచ్చేలా ఉంది. ఉద్యోగులకు ఉద్వాసన తప్పదంటూ చేసిన ప్రకటన ఆర్టీసి కార్మికులను భయపెట్టలేకపోయింది. ఆర్టీసి సమ్మెపై మాట్లాడుతూ కేసీఆర్ నర్మగర్భంగా యూనియన్ల విషయంలో తన వైఖరిని వెల్లడించారు. 

ఆర్టీసిలోకి కొత్త ఉద్యోగులను తీసుకునేటప్పుడు వారి చేత యూనియన్లలో చేరబోమనే ఒప్పంద పత్రం తీసుకోవాలని సూచించారు. దాన్ని బట్టి కేసీఆర్ యూనియన్ల ఖతమ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కార్మికు, ఉద్యోగ సంఘాల నాయకులు భావిస్తున్నారు. దాంతో కార్మిక, ఉద్యోగ సంఘాలు ఏకం కావాలనే ఆలోచనలో పడ్డాయి. 

ఆర్టీసి సమ్మెకు మద్దతు ఇవ్వకపోతే భవిష్యత్తులో తాము కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవాలనే ఆందోళన వారిని ఆవహించినట్లు అర్థమవుతోంది. ఒక్కో యూనియన్ ఆర్టీసి సమ్మెకు మద్దతుగా ముందుకు వస్తున్నాయి. ప్రైవేట్ లారీ, టాక్సీ కార్మికుల సంఘాల జెఎసి ఆర్టీసి సమ్మెకు మద్దతుగా ముందుకు వస్తోంది. 

నిజానికి, ఉద్యోగ సంఘాలు కూడా ఆర్టీసి కార్మికుల సమ్మెకు మద్దతుగా ముందుకు రావాలనే ఆలోచన చేశాయి. ఆర్టీసి కార్మిక నాయకులతో చర్చలు జరిపడానికి కూడా టీఎన్జీవో నాయకులు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆ విషయం తెలిసి హడావిడిగా కేసీఆర్ వారిని తన వద్దకు పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి శ్రీనివాస గౌడ్ ఆధ్వర్యంలో టీఎన్టీవో నాయకులు గురువారం కేసీఆర్ ను కలిశారు. 

టీఎన్డీవో నాయకులను కేసీఆర్ అభినందించారు కూడా. అయితే, ఐఆర్, పీర్సీ విషయంలో కేసీఆర్ తన హామీని నిలబెట్టుకోలేదనే ఆసహనం ఉద్యోగుల్లో ఉంది. దాన్ని టీఎన్డీవో నాయకులు ఎలా ఎదుర్కుంటారనేది ప్రశ్నగానే మిగిలింది. ఐఆర్, పీఆర్సీలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే.

ఆర్టీసి సమ్మెకు ట్రేడ్ యూనియన్లు మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రతిపక్షాలన్నీ అండగా నిలిచాయి. బ్యాంక్ ఉద్యోగులు కూడా ఆర్టీసి సమ్మెకు మద్దతు ప్రకటించారు. తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఎపీ-టీఎస్ రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్, నాబార్డు ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆర్టీసి సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేశాయి. 

హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికపై కూడా ఆర్టీసి సమ్మె ప్రభావం పడే అవకాశం ఉంది. హుజూర్ నగర్ లో ఆర్టీసి డిపో లేకపోవడం కొంత నయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తూ ఉండవచ్చు. కానీ, మిర్యాలగుడా, కోదాడల్లో డిపోలున్నాయి. ఆర్టీసి కార్మికులు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వినూత్నమైన నిరసనకు దిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గానికి వెళ్లి ఓటర్ల కాళ్లు పట్టుకుని టిఆర్ఎస్ ను ఓడించాలని కోరడానికి వారు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలియదు గానీ హుజూర్ నగర్ ఉప ఎన్నికపై అది ప్రభావం చూపుతుందని మాత్రం చెప్పవచ్చు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే విషయంపై పునరాలోచన చేస్తామని సిపిఎం ఇప్పటికే ప్రకటించింది. సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 

మొత్తం మీద. ఆర్టీసి సమ్మె అన్ని రంగాలకు చెందిన ఉద్యోగ, కార్మిక సంఘాలను ఏకం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు మాత్రం అర్థమవుతోంది. అదే కనుక జరిగితే కేసీఆర్ కు వ్యతిరేక పవనాలు వీచే ప్రమాదం ముంచుకొస్తుంది.