ఆంధ్రప్రదేశ్‌తో సహా నాలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలు.. పార్టీ విస్తరణపై వేగం పెంచిన కేసీఆర్..!

బీఆర్ఎస్ విస్తరణ దిశగా ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. తన ప్రణాళికలను కేసీఆర్ మరింత వేగవంతం చేశారు. 
 

KCR to expand BRS and plans to start offices in 4 states including andhra Pradesh

బీఆర్ఎస్ విస్తరణ దిశగా ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్.. ఇటీవల మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ను జాతీయ స్థాయిలో బలమైన పార్టీగా తీర్చిదిద్దడంలో ఇప్పటికే ఒక రూట్‌ మ్యాప్‌ను సిద్దం చేసుకున్న కేసీఆర్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడం.. రాష్ట్రంలో ఎన్నికలకు మరికొన్ని  నెలల సమయం ఉండటంతో.. ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణకు సంబంధించి కేసీఆర్ ఎక్కువ సమయం కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. తన ప్రణాళికలను కేసీఆర్ మరింత వేగవంతం చేశారు. 

గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తద్వారా జాతీయ రాజకీయాల్లోకి కీలకమైన ముందడుగు వేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలోనే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించేందుకు గులాబీ బాస్ సిద్దమయ్యారు. తద్వారా అక్కడ పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు వేయనున్నారు. ఇప్పటికే ఒడిశా, కర్ణాటకలలో బీఆర్ఎస్ కార్యాలయాల ఏర్పాటకు సంబంధించి స్థలాలు  ఖరారు కాగా.. ఏపీ, మహారాష్ట్రలలో స్థలాలను ఖరారు చేయాల్సి ఉందని సమాచారం. 

కర్ణాటకలో మరో రెండు, మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అంతకంటే ముందే అక్కడ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై మాత్రం కేసీఆర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బదులుగా.. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బరిలో దిగేందుకే ఆయన ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ  ఎన్నికల్లో జేడీఎస్‌కు  బయటి నుంచి మద్దతు ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పలు స్థానాల్లో అభ్యర్థులను నిలపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, అతని కుమారుడు శిశిర్ గమాంగ్‌తో పాటు మరికొందరు నేతలు కూడా ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. వారు ఇప్పటికే ఒడిశాలో బీఆర్ఎస్ విస్తరణకు కార్యచరణను సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటుకు సిద్దమయ్యారు. ఇందుకు సంబంధించి ఒక భవనాన్ని గుర్తించి.. దానిని పార్టీ అధినేత కేసీఆర్ ఆమోదం కోసం పంపారు. కేసీఆర్ కూడా త్వరలోనే ఒడిశాలో పర్యటించనున్నారని.. ఆ సందర్భంగా భువనేశ్వర్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. విజయవాడలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ సమర్పించిన ప్రతిపాదనలు కేసీఆర్ పరిశీలనలో ఉన్నాయి. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అనువైన స్థలాలను గుర్తించే బాధ్యతను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి అప్పగించినట్టుగా తెలుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios