ఆశ్చర్యం: మోడీపై కేసీఆర్ అమీతుమీ, రాహుల్ గాంధీ పిలుపునకు టీఆర్ఎస్ సై

ఆశ్చర్యకరంగా రాహుల్ గాంధీ పిలుపునకు టీఆర్ఎస్ సానుకూలంగా ప్రతిస్పందించింది. మల్లికార్జున్ ఖర్గే ఆఫీసులో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ తరఫున కేశవ రావు హాజరయ్యారు. కేసీఆర్ వైఖరిలో మార్పునకు ఇది సంకేతంగా నిలుస్తోంది.

KCR takes stand against Narendra Modi: TRS attends Opposition meet

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధపడినట్లు అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం విషయంలో మెతకగా వ్యవహరిస్తూ వస్తున్న KCR ఇటీవలి కాలంలో తన వైఖరిని మార్చుకుని యుద్ధం ప్రకటించారు. ఈ స్థితిలో ఢిల్లీ వేదికగా ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెసు నేత Rahul Gandhi ఆహ్వానానికి TRS సానుకూలంగా ప్రతిస్పందించింది.

రాహుల్ గాంధీ బుధవారం ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరైంది. 12 మంది సభ్యులను ఈ సమావేశాలంతటికీ సస్పెండ్ చేయడంపై చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి ప్రతిపక్షాల సమావేశం జరిగింది. ప్రతిపక్షాల సమావేశంం కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవ రావు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన 16 ప్రతిపక్షాల్లో టీఆర్ఎస్ ఒకటి. 

Also Read: ఆ రోజు మీరేం చేశారో నాకు తెలుసు.. క్షమాపణలు చెబితేనే : 12 ఎంపీల సస్పెన్షన్‌పై పీయూష్ గోయెల్

తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నవంబర్ మొదటి వారంలో కేసీఆర్ ప్రకటించిన సమరానికి కొనసాగింపుగానే ప్రతిపక్షాల సమావేశానికి Keshav Rao హాజరైనట్లు భావిస్తున్నారు. హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేశవ రావు ప్రతిపక్షాల సమావేశానికి హాజరయ్యారు. 

జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఏర్పాటు చేస్తున్న సమావేశాలకు టీఆర్ఎస్ ఇప్పటి వరకు దూరంగా ఉంటూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలకు కూడా టీఆర్ఎస్ దూరంగానే ఉంటూ వచ్చింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపునకు మాత్రం నిరుడు డిసెంబర్ లో సానుకూలంగా ప్రతిస్పందించారు. ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. ఆ తర్వాత సాగు చట్టాలపై కేసీఆర్ మౌనం వహించారు. పైగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పార్లమెంటులో ఓటు వేసిన సందర్భంలో టీఆర్ఎస్ సమావేశాలకు గైర్హాజరైంది. 

Also Read: Rajya sabha: ఎంపీలపై సస్పెన్షన్ రద్దు చేసేందుకు వెంకయ్య నాయుడు నిరాకరణ.. విపక్షాల వాకౌట్

ప్రస్తుతం ప్రతిపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరు కావడంపై వాడివేడి చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో చేతులు కలపడానికి టీఆర్ఎస్ సిద్ధమైనట్లు భావిస్తున్నారు. ఇటీవల తన అధికార నివాసం ప్రగతి భవన్ లో కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

పార్లమెంటు సమావేశాల తొలి రోజున రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో వారిని సస్పెండ్ చేశారు సస్పెన్షన్ కు గురైన సభ్యుల్లో ఆరుగురు కాంగ్రెసు పార్టీకి చెందినవారు. తృణమూల్ కాంగ్రెసు, శివసేనకు చెందిన ఇద్దరేసి సభ్యులున్నారు. సీపీఎం, సీపిఐలకు చెందిన ఒక్కరేసి సభ్యులున్నారు. డిసెంబర్ 23వ తేదీన ముగిసే సమావేశాల వరకు వారు సస్పెన్షన్ కు గురయ్యారు. వారి సస్పెన్షన్ ను ఎత్తేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios