జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన రెండు నెలల తరువాత గ్రేటర్ మేయర్ ఎన్నిక ముగిసింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెంటినీ తెరాస దక్కించుకుంది. మేజిక్ ఫిగర్ సాధించకున్నప్పటికీ... తెరాస మజ్లీస్ మద్దతుతో ఈ పదవులను ఎగరేసుకుపోయింది. ఎన్నికలప్పుడేమో మాకు ఎంఐఎం తో సంబంధం లేదు అని ప్రకటించిన కేసీఆర్.... ఇప్పుడు ఏకంగా మజ్లీస్ సహకారం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 

ఎన్నికలకు ముందు బీజేపీ ధాటికి తట్టుకు నిలవడానికి, తమది సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ ఎంఐఎం తో తమకు సంబంధం లేదని తెరాస బహిరంగంగా ప్రకటించింది. అంతకుముందు వరకు తెరాస- మజ్లీస్ లు ఒక్కటే అని వారి జుగల్ బందీని చూపిస్తూ బీజేపీ తీవ్ర విమర్శలు చేసేవారు. తెరాస కారు స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉంటుందంటూ పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం మనం చూసే ఉంటాము. 

ఇప్పుడు తెరాస కు మజ్లీస్ మద్దతు తెలపడంతో మరోమారు బీజేపీ నాయకులు తెరాస స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉందని, మజ్లీస్ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇద్దరు దొంగలు కలిసి మేయర్ ను గెలుచుకున్నారని, ప్రజలంతా దీనిని గమనిస్తున్నారని, తెరాస తన గితిని థానే తవ్వుకుందంటూ రాజాసింగ్ ధ్వజమెత్తారు. 

ఇక ఇప్పుడు బీజేపీ నేతలు ఎంఐఎం - తెరాస లు కలిసి నడవడాన్ని ఎత్తిచూపుతూ...; హిందుత్వ కార్డును బలంగా ప్రయోగిస్తూ తెలంగాణాలో రాజకీయం చేయబోతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజా సింగ్ వ్యాఖ్యలు ఇందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. 

మరి ఈ విషయం కేసీఆర్ కి తెలియదా..? కరీంనగర్ సభలో హిందువులు, బొందువులు అని కేసీఆర్ చేసిన ఒక వ్యాఖ్యను బీజేపీ ఎలా వాడి నాలుగు పార్లమెంటు సీట్లు గెలిచిందో మనమంతా చూసాము కూడా. ఆ విషయం మనకన్నా కేసీఆర్ కే బాగా తెలుసు. స్వయానా కేసీఆర్ కూతురు కవిత ఓటమి చెందారు. 

ఇక ఈ రోజు పరిణామాలను కొద్దిసేపు పక్కనబెడితే.... నిన్నటి హాలియా బహిరంగసభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నేరుగా బీజేపీ నేతలను ఉద్దేశించినవే. కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగరు అన్న చందంగా ఉంది బీజేపీ నాయకుల తీరు అని, తాము చేతులు ముడుచుకు కూర్చోలేదు అని, కుక్కలు అని రకరకాలుగా తనదైన స్టైల్ లో దుమ్ము దులిపారు. 

కేసీఆర్ ఇలా బహిరంగంగా బీజేపీ నేతలకు వార్నింగులు ఇవ్వడం, ఇప్పుడు మజ్లీస్ తో బహిరంగంగా పొత్తు కుదుర్చుకోవడం అన్ని చూస్తుంటే... కేసీఆర్ బీజేపీతో ప్రత్యక్ష పోరుకు తెర తీస్తున్నట్టుగా కనబడుతుంది. ఇక ఉగ్గబట్టుకు కూర్చున్నది చాలు, తమ సత్త ఏమిటో చూపించాల్సిన సమయం ఆసన్నమైందని కేసీఆర్ భావిస్తున్నట్టుగా అనిపిస్తుంది.