ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సహాయానికి థాంక్స్ అన్నట్టుగా ఏకంగా జగన్ మోహన్ రెడ్డి వచ్చి ప్రగతి భవన్ లో కుటుంబ సమేతంగా కేసీఆర్ ని కలిసి వెళ్లారు. విజయసాయి రెడ్డి అయితే కేసీఆర్ కు పాదాభివందనం చేయడానికి ప్రయత్నం కూడా చేసాడు. 

ఈ విధంగా సఖ్యతగా సాగుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బంధంలో అనుకోకుండా నీటి వివాదం చిచ్చు పెట్టింది. సాధారణంగా చిచ్చు ఆర్పే నీళ్ళే, ఇక్కడ చిచ్చును రాజేయడం విశేషం. ఇక అది లగాయతు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య దూరం పెరిగిపోతున్నట్టుగా కనబడుతుంది. 

పోతిరెడ్డిపాడు విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేటట్టుగా ఉంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ, టీవీ ఛానెళ్లలో సవాళ్లు విసురుకుంటూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. 

ఇరు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్నది ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ సమస్యల ఆధారంగా రాజకీయం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీలు. ప్రాంతీయ సమస్యలు ఇరు రాష్ట్రాల్లోనూ రాజకీయాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. ఈ విషయం ఎవరికీ తెలియనిది కాదు.   

ఇరు రాష్ట్రాలు కూడా అవతలి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించము అంటున్నాయి, కానీ కలిసి కూర్చొని మాత్రం మాట్లాడుకోరు. ఇరు రాష్ట్రాల మధ్య ఈ సమస్య ముదరడంతో నేడు కృష్ణ రివర్ బోర్డు మీటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. 

అపరచాణక్యుడిగా పేరున్న కేసీఆర్ ఈ విషయంలో తెలంగాణ వాణిని బలంగా వినిపించేందుకు రంగం సిద్ధం చేసాడు. ఇప్పటికే ఈ విషయమై అధికారులతో జూన్ నెల ప్రారంభంలోనే సమావేశం కూడా అయ్యారు సీఎం కేసీఆర్. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో నీటిపంపకాలు, అప్పటి ప్రాజెక్టులపై సర్వే అనే క్లాజ్ ను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ ను ఇరుకున పెట్టాలని చూస్తున్నారు కేసీఆర్. 

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచే విషయమై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సర్వే నిర్వహించలేదని, తాజాగా ఏపీ ప్రభుత్వం మాట్లాడుతున్న సంగమేశ్వరం ఊసు కూడా అప్పటిది కాదని వాదించనున్నట్టు తెలుస్తుంది తెలంగాణ యంత్రాంగం. 

ఇక తెలంగాణ ప్రాజెక్టుల గురించి వాదించేందుకు జగన్ మోహన్ రెడ్డి తండ్రి అయిన మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి అస్త్రాన్ని బయటకు తీయనుంది తెలంగాణ. రాజశేఖర్ రెడ్డి హయాంలోనే తెలంగాణలోని ప్రస్తుత ప్రాజెక్టుల రూపకల్పన జరిగిందని వాదించాలని నిర్ణయానికి వచ్చింది. తద్వారా తండ్రి పేరు చెప్పే జగన్ ను ఇరుకున పెట్టాలని చూస్తుంది తెలంగాణ సర్కార్. 

తండ్రి తీసుకున్న నిర్ణయాలకే తనయుడు అడ్డం పడుతున్నాడని ఇరుకున పెట్టాలని చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అలా ఆంధ్రప్రదేశ్ తమ పరిమితికి మించి నీటిని వాడుకుంటుందని చెప్పాలని అధికారులకు కేసీఆర్ సూచించినట్టు తెలియవస్తుంది. 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. గోదావరి నుంచి ఇప్పటికే నీటిని కృష్ణకు మళ్లిస్తున్నందున, కృష్ణ నదిలో తెలంగాణకు రావలిసిన న్యాయబద్ధమైన వాటాను దక్కేవిధంగా చూడాలని కోరనున్నట్టు తెలుస్తుంది.  

గోదావరి, కృష్ణ రెండు నది బోర్డు సమావేశంలో ఇదే వ్యూహాన్ని పాటించాలని కేసీఆర్ అధికారులతో అన్నట్టుగా తెలుస్తుంది. నేటి కృష్ణ బోర్డు సమావేశం, రేపటి గోదావరి బోర్డు సమావేశం రెంటిలో కూడా తెలంగాణ ఇదే తరహా వాదనను ముందుపెట్టనున్నట్టు తెలియవస్తుంది.