కేసీఆర్ ప్లాన్: ప్రశాంత్ కిశోర్ తో ఒప్పందం, ప్రాంతీయ పార్టీల కూటమి
బిజెపిని ఎదుర్కునేందుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశాంత్ కిశోర్ తో ఒప్పందం కుదుర్చుకునే దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బలమైన ప్రాంతీయ పార్టీల కూటమికి కూడా పునాదులు వేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ తోసిపుచ్చారు దీంతో తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 డిసెంబర్ లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆయన ఆచితూచి అడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో బలం పుంజుకోవాలని చూస్తున్న బిజెపిపై KCR ఇప్పటికీ సమరభేరీ మోగించారు. జాతీయ స్థాయిలో బిజెపిని డీకొంటానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు
ఈ నేపథ్యంలో 2023 శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం, 2024 ఏప్రిల్ లో జరిగే లోకసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడానికి కేసీఆర్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ - ప్యాక్)తో ఒప్పందం కుదుర్చుకునేందుకు కేసీఆర్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ తో ఇప్పటికే కేసీఆర్ సమావేశమైనట్లు చెబుతున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ తనయుడు కేటీ రామారావు కూడా Prashant Kishor తో మాట్లాడినట్లు చెబుతున్నారు.
గత రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించి, తెలంగాణలో అధికారంలో కొనసాగుతోంది. మూడోసారి కూడా తిరుగులేని మెజారిటీతో విజయం సాధించడానికి టీఆర్ఎస్ సమాయత్తమవుతుంది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో బిజెపియేతర పక్షాలతో కలిసి పనిచేసేందుకు కూడా కేసీఆర్ సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఇందులో కూడా ప్రశాంత్ కిశోర్ పాత్ర ఉంటుందని భావిస్తున్నారు. కేసీఆర్ ను ఇప్పటికే వామపక్షాల నేతలు కలిశారు. అదే సమయంలో ఆర్డేడీ నేత తేజస్వి యాదవ్ కూడా కేసీఆర్ తో భేటీ అయ్యారు.
త్వరలో తాను శివసేన నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలుస్తానని కేసీఆర్ చెప్పారు. ఉద్ధవ్ థాకరేను కలిసేందుకు తాను ముంబై వెళ్తానని చెప్పారు. బిజెపియేతర పక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగానే సాగుతున్నట్లు అర్థమవుతోంది. తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపికి వ్యతిరేకంగా సమరం సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను కూడా ఆమె అందుకు వేదికగా చేసుకున్నారు. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని ఎస్పీ కూడా ప్రతిపక్షాలతో కలిసే అవకాశం ఉంది.
డీఎంకె అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దేశంలోని 36 పార్టీలకు లేఖలు రాశారు. అందులో కాంగ్రెసు పార్టీ కూడా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి బలమైన కూటమి ఏర్పడుతుందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ చెప్పారు. దీన్నిబట్టి బిజెపికి వ్యతిరేకంగా బలంగా ముందుకు రావాలని ప్రాంతీయ పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇందులో కేసీఆర్ పాత్ర కూడా ప్రముఖం అవుతుందనే అచనాలు సాగుతున్నాయి.