Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ 100.. లోక్‌సభ ఎన్నికల కోసం కేసీఆర్ మిషన్.. ఏపీపై ఇప్పట్లో ఫోకస్ లేనట్టే..!

భారత రాష్ట్ర సమితితో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్.. కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా వేగంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి గట్టి కౌంటర్ ఇవ్వడంతో పాటు.. పలు రాష్ట్రాల్లో ఆ పార్టీని ఎదుర్కొనేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

KCR Likely to plan field brs candidates in 100 Lok Sabha constituencies
Author
First Published Dec 29, 2022, 10:33 AM IST

భారత రాష్ట్ర సమితితో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్.. కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా వేగంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి గట్టి కౌంటర్ ఇవ్వడంతో పాటు.. పలు రాష్ట్రాల్లో ఆ పార్టీని ఎదుర్కొనేలా ప్రణాళికలు రచిస్తున్నారు. తొలి అడుగులోనే లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం  543 స్థానాలకు అభ్యర్థులను నిలపడం ఏ పార్టీకైనా కష్టమనే చెప్పాలి. అందుకే కనీసం 100 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలపాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే సమయం ఉండటంతో.. కేసీఆర్ ఇప్పటికే ఈ మిషన్‌ను ప్రారంభించినట్టుగా తెలిసింది. 

ఈ 100 స్థానాల్లో కొన్నిచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులను సొంతంగా నిలపాలని, మరికొన్ని చోట్ల బీజేపీ వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకుని తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్.. గుజరాత్‌, కేరళ, పుదుచ్చేరి, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు, మహారాష్ట్ర‌లపై ఫోకస్ చేశారని సమాచారం. ఆ రాష్ట్రాల్లో అనువైన స్థానాలను గుర్తించేందుకు కేసీఆర్ గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఆ రాష్ట్రాల్లోని ఏయో ప్రాంతాల్లో తెలుగు జనాభా అధికంగా ఉందనే గణంకాలను కూడా పరిశీలిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు, జాతీయ రాజకీయాలపై విశ్లేషణ అనుభవం ఉన్న కొందరు ముఖ్యులతో కలిసి కేసీఆర్ విస్తృతమైన మంతనాలు జరుపుతున్నారు.  అయితే బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో దింపేందుకు ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే 60 లోక్‌సభ స్థానాలను కేసీఆర్ గర్తించారని గులాబీ పార్టీ వర్గాలు నుంచి అందుతున్న సమాచారం.

ఆంధ్రప్రదేశ్ మాటేమిటి..?
బీఆర్ఎస్ పార్టీ ప్రకటన వెలువడినప్పటీ నుంచే.. కేసీఆర్ మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి వైఖరి అనుసరిస్తారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఏపీలో పార్టీ గ్రాండ్ లాంచ్‌ కోసం కేసీఆర్ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు తెరవెనక ప్రయత్నాలు  జరుగుతున్నట్టుగా సమాచారం. అయితే ఏపీలో విస్తరణ వ్యుహాలు ఉన్నప్పటికీ.. అక్కడ పోటీ చేసే స్థానాల విషయంలో కేసీఆర్‌ ఇంకా దృష్టి సారించలేదని గులాబీ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. 

అయితే ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలే కారణమని తెలుస్తోంది. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి. వైసీపీ తాము ఒంటరిగానే బరిలో దిగుతామని స్పష్టం చేసింది. మరోవైపు సీఎం జగన్ కేంద్రంలోని బీజేపీతో సత్సబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్‌ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత తీసుకుంటున్నానని చెప్పడంతో ద్వారా.. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కొవాలంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవసరం ఉందని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారనే మాట వినిపిస్తోంది. 

ఈ క్రమంలోనే అక్కడ పొత్తులపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌కు పోటీ చేసే స్థానాల గుర్తింపు ప్రక్రియను కేసీఆర్ ప్రారంభించలేదని బీఆర్ఎస్‌ వర్గాలు తెలిపాయి. అక్కడ రాజకీయ పరిణామాలపై ఓ క్లారిటీ వచ్చాక కేసీఆర్ ఆ ప్రక్రియను ప్రారంభిస్తారని తెలుస్తోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలోని రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌కు అవగాహన ఉన్న నేపథ్యంలో ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి తక్కువ టైమ్ తీసుకుంటారనే చెప్పాలి. 

ఇక, క్రిస్మస్ తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లి.. అక్కడి నుంచే తన మిషన్‌ను ముమ్మరం చేయాలని భావించారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. రాష్ట్రపతి హైదరాబాద్‌‌కు రాగా.. కేసీఆర్ హకీంపేటకు వెళ్లి ఆమెకు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విందు కూడా ఇవ్వాలని కేసీఆర్ చూస్తున్నారు. ఆ తర్వాతే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.  

తాజా పరిణామాలపై ఫోకస్..
ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు, ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారునిగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావన.. తదితర అంశాల నేపథ్యంలో రాష్ట్రంలో అనుహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ పార్టీలోని ముఖ్యనేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలాంటి వైఖరి అవలంభించాలనే దానిపై కూడా కేసీఆర్ మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ సంక్రాంతి తర్వాతే ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

ఇదిలా ఉంటే.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 10 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణలోని రాజకీయ పరిణామాలపై దృష్టి సారిస్తున్నారు. తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన కేసీఆర్.. మరోసారి పార్టీని గెలిపించుకునేలా వ్యుహాలు రచిస్తున్నారు. తెలంగాణ భారీ మెజారిటీతో విజయం సాధిస్తే.. అది జాతీయ స్థాయిలో కొంత ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది. ఒకవేళ తెలంగాణలో కేసీఆర్ పార్టీకి ఓటమి ఎదురైతే.. జాతీయ పార్టీ ప్రణాళికలకు ఘోరమైన ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ ప్రణాళికలు రచిస్తూనే.. రాష్ట్రంలో పార్టీ విజయం కోసం అమలు చేయాల్సిన కార్యచరణకు సంబంధించి సమయం కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios