Asianet News TeluguAsianet News Telugu

హ్యాట్రిక్‌పై కేసీఆర్ గురి.. 20కి పైగా స్థానాల్లో సిట్టింగ్‌ల మార్పు..!!

తెలంగాణలో ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని  బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పులువురు సిట్టింగ్‌లను మార్చే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

KCR Likely to change several Sitting MLAs for 2023 assembly polls ksm sir
Author
First Published Jul 27, 2023, 11:07 AM IST

తెలంగాణలో ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని  బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారు. ఇందుకు తగ్గటే ఆయన వ్యూహారచన ప్రారంభించారు. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితులపై నివేదికలు తెప్పించుకోవడంతో పాటు తన రాజకీయ అనుభవంతో ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన పలువురు శాసనసభ్యులు బీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆ నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్నవారి సంఖ్య అధికంగానే ఉంది. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య సాగుతుంది. ఇదికాకుండా.. పలువురు బీఆర్ఎస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలతో ప్రజాగ్రహం కూడా ఉంది. 

దీంతో కేసీఆర్ ఆచితూచి ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకు ఉద్వాసన పలకాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 20కి పైగా స్థానాల్లో సీటింగ్‌ల స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. 

ఉమ్మడి నల్గొండ జిల్లా.. మునుగోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కడం కష్టమనే తెలుస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక జరగ్గా.. కూసుకుంట్ల బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. అయితే ఈ సారి ఆయన టికెట్ దక్కడం కష్టంగా కనిపిస్తుంది. మునుగోడు బరిలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి  లేదా పాల్వాయి స్రవంతి పేర్లను బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

అయితే పాల్వాయి స్రవంతి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే ఆమెకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కష్టమని కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తోంది. మునుగోడు నుంచి చెలమల కృష్ణారెడ్డి బరిలో నిలపాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఆర్థికంగా బలమైన వ్యక్తిగా చెలమలకు పేరుంది. ఈ నేపథ్యంలో పాల్వాయి స్రవంతిని బీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చి.. పోటీ చేయిస్తే కాంగ్రెస్‌ను దెబ్బతీయవచ్చనే ఈక్వేషన్స్ కూడా గులాబీ బాస్ వద్ద ఉన్నాయని చెబుతున్నారు. ఇక, ఇటీవల గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తన కొడుకు టికెట్ విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయం అని  చెప్పారు. 

ఇక, కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్‌కు టికెట్ దక్కడం కష్టమని తెలుస్తోంది. పలు పార్టీలు మారుతూ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన బొల్లం మల్లయ్య యాదవ్ విజయం సాధించారు. అయితే సొంత పార్టీ నేతల నుంచే బొల్లం మల్లయ్య యాదవ్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే ఈసారి కోదాడ టికెట్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్‌ గూటికి చేరిన పక్షంలో.. పద్మావతి ఉత్తమ్‌కు ఇచ్చే ప్రణాళిక సిద్దం  చేసినట్టుగా తెలుస్తోంది. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికి వస్తే.. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు మార్పు ఖాయంగా తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే వనమా, అతని కుటుంబం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వచ్చింది. సొంత పార్టీలోనే వనమాపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. తాజాగా వనమా ఎన్నికల చెల్లదంటూ హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. రానున్న ఎన్నికల్లో ఆయనను టికెట్ దక్కడం కష్టమే. 

అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జలగం వెంకట్రావుకు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశంపై కూడా సందిగ్దత కొనసాగుతుందని  తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి  కాంగ్రెస్ తరఫున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పోటీ చేయించాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని పొంగులేటి బరిలో దిగిన పక్షంలో.. ఆయనను ఆర్థికంగా ఎదుర్కొనే విధంగా ప్రస్తుతం ఎంపీగా ఉన్న వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి)ని బరిలో దింపాలనే ఆలోచనతో గులాబీ పార్టీ ఉన్నట్టుగా సమాచారం. 

ఉమ్మడి మహబూబ్‌ నగర్ విషయానికి వస్తే.. కొడంగల్‌లో పట్నం నరేందర్ రెడ్డి మార్పు కూడా ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న పట్నం ఫ్యామిలీ.. కాంగ్రెస్ గూటికి చేరనున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ  చైర్‌పర్సన్‌గా ఉన్న ఆయన సతీమణి సునీతా మహేందర్ రెడ్డిలతో పాటు నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరిని పోటీ నిలుపుతుందనే చర్చ సాగుతుంది. అయితే ఈ విషయంపై గులాబీ పార్టీలో ఇప్పటివరకు ఎటువంటి సమాలోచన జరగలేదని తెలుస్తోంది. 

కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ విషయంలో 50-50 చాన్స్ ఉన్నాయని తెలుస్తోంది. కల్వకుర్తి నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా (రెండుసార్లు టీడీపీ, ఒక్కసారి బీఆర్ఎస్) గెలుపొందారు. అయితే ఆయనపై ఏదైనా వ్యతిరేకత ఉందా? అనే విషయాన్ని గులాబీ అధిష్టానం ఆరా తీస్తుంది. మరోవైపు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలయిన భావిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ, బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్‌ కసిరెడ్డి నారాయణ రెడ్డి తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి పోటీచేసే అవకాశం ఉండటతో.. ఆయనను ఎదుర్కొనేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన కసిరెడ్డిని బరిలో దింపితే ఎలా ఉంటుందనే ఆలోచనలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఈ విషయంలో గులాబీ బాస్ అన్ని అంశాలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

ఉమ్మడి రంగారెడ్డి విషయాని వస్తే.. ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బేతి సుభాష్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కకపోవచ్చనే తెలుస్తోంది. ఉప్పల్ బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వర్గం  వర్సెస్ జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో బొంతు రామ్మోహన్‌కే టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఉమ్మడి జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఎలాంటి  మార్పు ఉండకపోవచ్చనే తెలుస్తోంది. అయితే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. రానున్న ఎన్నికల్లో తనకు బదులుగా తన కొడుకు ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందిగా అధిష్టానాన్ని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై గులాబీ బాస్ ఏ  విధమైన నిర్ణయం  తీసుకుంటారనేది మాత్రం తెలియాల్సి ఉంది. 


ఉమ్మడి మెదక్ జిల్లాలో.. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌కు రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. గతకొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానానికి క్రాంతి కిరణ్‌లకు మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో ఆయనను బరిలో దింపేదుకు గులాబీ పార్టీ అధిష్టానం సుముఖంగా లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్.. గులాబీ గూటికి వస్తే ఆయనను బరిలో నిలపాలనే ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.  

నర్సాపూర్ విషయానికి వస్తే.. ఇక్కడ చిలుముల మదన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకపోవచ్చు. నర్సాపూర్‌ నుంచి రెండుసార్లు గెలిచిన మదన్‌రెడ్డి.. ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని చూస్తున్నారు. అయితే నర్సాపూర్ బీఆర్ఎస్‌లో కూడా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. మరోవైపు మదన్‌రెడ్డికి అనారోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాలతో ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డిని బరిలో నిలపాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న సునీతాలక్ష్మారెడ్డి.. రెండు సార్లు మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన  ఆమెకు నియోజకవర్గంలో బలమైన క్యాడరే ఉంది. 

జహీరాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావుకు కూడా రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. జహీరాబాద్ బీఆర్ఎస్‌లో కూడా నేతల మధ్య అంతర్గత  కలహాలు ఉన్నాయి. ఇక్కడ టికెట్ ఆశావాహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అందులో ఒకరు.. టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రోళ్ల శ్రీనివాస్ జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని ఆశించారు. కానీ అది సాధ్యపడలేదు. ఈసారి మాత్రం ఎర్రోళ్ల శ్రీనివాస్ వైపే బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపుతుండటంతో.. మాణిక్‌రావుకు టికెట్ దక్కకపోవచ్చని తెలుస్తోంది. 

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా విషయానికి వస్తే.. ముషీరాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముఠా గోపాల్‌ను తప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో ముషీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ను మరోసారి తనకు లేదా తన కుమారుడు ముఠా జైసింహకు ఇవ్వాలని ముఠా గోపాల్ కోరుతున్నారు. అయితే మరోవైపు ఈ టికెట్ కోసం తెరవెనక కూడా పలువురు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందనే అంచనాకు వచ్చిన బీఆర్ఎస్ అధిష్టానం.. ప్రస్తుతం తెలంగాణ ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ గడల శ్రీనివాస్‌రావును బరిలో నిలపాలని చూస్తుంది. అయితే శ్రీనివాస్‌రావు గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానం మెప్పు కోసం ప్రయత్నాలుచేయడమే కాకుండా.. కొత్తగూడెం టికెట్ కోసం  ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగూడెంలో సమీకరణాల దృష్ట్యా.. బీఆర్ఎస్ విజయం తేలికని భావిస్తున్న ముషీరాబాద్‌లో ఆయనను అడ్జెస్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. 

జూబ్లీహిల్స్‌లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు తప్పించనున్నారు. నియోజకవర్గంలో గోపినాథ్‌పై వ్యతిరేకత, పలు సర్వే రిపోర్టులలో ఆయనకు నెగిటివ్ రిపోర్టు రావడమే  ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇకడి నుంచి రావుల శ్రీధర్ రెడ్డికి టికెట్ ఖాయంగా తెలుస్తోంది. ఇందుకోసం శ్రీధర్ రెడ్డి తెరవెనక ప్రయత్నాలు చేసినట్టుగా సమాచారం. 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున జూబ్లీహిల్స్ నుంచి పోటీచేసిన శ్రీధర్‌రెడ్డి  ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన గులాబీ గూటికి చేరారు. రానున్న ఎన్నికల్లో శ్రీధర్‌రెడ్డి వైపు బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. 

ఖైరతాబాద్ విషయానికి వస్తే.. సిట్టింగ్ విషయంలో మార్పుపై సందిగ్దత కొనసాగుతుంది. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి పోటీ  చేయాలని దాసోజ్ శ్రావణ్ తీవ్రంగా  ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్, మరోకరికి ఎమ్మెల్సీ ఇచ్చేలా సర్దుబాటు చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఇక, కంటోన్మెంట్ నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడి ఎమ్మెల్యే సాయన్న ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికలలో అక్కడి నుంచి సాయన్న కుమార్తె లాస్య నందితకు టికెట్ ఖాయమని తెలుస్తోంది. 

ఉమ్మడి వరంగల్ విషయానికి వస్తే.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ కష్టమనే తెలుస్తోంది. వివాదాలకు కేంద్రబిందువుగా ఉండటం, సొంత కూతురు ఆరోపణలు, ఇతరత్రా కారణాలతో రానున్న ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సుముఖంగా లేదు. ఇక్కడి నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించనున్నట్టుగా తెలుస్తోంది. 

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియంల మధ్య వర్గపోరు ఉన్న సంగతి  తెలిసిందే. మరోవైపు తాటికొండ రాజయ్య నిత్యం కాంట్రావర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు. సర్పంచ్ నవ్య ఎపిసోడ్‌ విషయంలో రాజయ్య తీరుపై బీఆర్ఎస్ అధిష్టానం గుర్రుగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ సారి అక్కడి నుంచి కడియంను బరిలో నిలపాలని చూస్తున్నట్టుగా  తెలుస్తోంది. 

మహబూబాబాద్‌ విషయానికి వస్తే ఎమ్మెల్యే శంకర్ నాయక్‌‌ను తప్పించనున్నట్టుగా  తెలుస్తోంది. ఆయనపై సొంతపార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని కూడా బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే శంకర్ నాయక్ను పక్కనబెట్టి సత్యవతి రాథోడ్ను బరిలో దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, డోర్నకల్ విషయానికి వస్తే..అక్కడి నుంచి రెడ్యా నాయక్‌ను తప్పించి ప్రస్తుతం ఎంపీగా ఉన్న  ఆయన  కూతురు మాలోతు  కవితకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. 

ఉమ్మడి ఆదిలాబాద్ విషయానికి వస్తే.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తుంది. వరుసగా వివాదాలకు కేరాఫ్‌ మారిన దుర్గం చిన్నయ్యపై క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత ఉండటం.. ఆయన తీరు పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉండటంతో రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వొదని గులాబీ  బాస్ డిసైట్ అయినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి జిల్లా గ్రంథాలయాల చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌‌ను బరిలో దించే అవకాశం ఉంది. 

ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు కూడా టికెట్ దక్కకపోవచ్చు. ఆమెపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆమెపై అవినీతి ఆరోపణలు నేరుగా బీఆర్ఎస్ అధిష్టానం వద్దకు కూడా చేరాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి రానున్న ఎన్నికల్లో ఆమె మార్పు ఖాయంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి బదావత్ పూర్ణనాయక్‌ను బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ అనుచరుడిగా పూర్ణనాయక్‌కు గుర్తింపు ఉంది. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే.. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు షాక్ షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తుంది. చాలా కాలంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చెన్నమనేనిపై వ్యతిరేకత కొనసాగుతుంది. అంతేకాకుండా వయసు పైబడటం, నియోజకవర్గంలో యాక్టివ్‌గా లేరనే ముద్ర కూడా ఉంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో చల్మెడ లక్ష్మీనరసింహరావుకు టికెట్ కేటాయించే అవకాశం ఉంది. అందుకే ఆయన కొంతకాలంగా వేములవాడలో పార్టీ కార్యక్రమాలను సొంతంగా నిర్వహించుకుంటున్నారు. 

మానుకొండూరులో ఎమ్మెల్యే  రసమయి బాలకిషన్‌కు ఈసారి టికెట్ దక్కకపోవచ్చు. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌ను బరిలో దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో రసమయి బాలకిషన్‌పై వ్యతిరేకతే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మానుకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆరేపల్లి మోహన్ ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. 

ఇక, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే.. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అందించిన వివరాలు.. తాజాగా ఉన్న సమీకరణాలు, సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. రాజకీయాల్లో ఏ క్షణం ఏదైనా జరిగేందుకు  వీలు ఉంటుంది కనుక.. ఎన్నికల వరకు ఆయా నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు, చేర్పులకు కూడా అవకాశం లేకపోలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios