Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ 40 రైళ్ల ప్లాన్ కు దెబ్బ: తెలంగాణకు వలస కూలీల చిక్కులు!

తెలంగాణ విషయానికి వస్తే... ఇక్కడ ఇప్పుడు వలస కూలీలా అవసరం అత్యధికంగా ఉన్న రెండు రంగాలు రైస్ మిల్లులు, నిర్మాణ రంగాలు. ఈ రెండు రంగాల్లో పని జరగాలంటే... వారు లేనిది కుదిరే పని కాదు. 

KCR 40 train's Plan takes a hit: Problems Loom large over the state with Migrant labour leaving Telangana
Author
Hyderabad, First Published May 10, 2020, 4:51 PM IST

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా పేదవారు, రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు ఎందరో... ఈ లాక్ డౌన్ ధాటికి తమ జీవనోపాధిని కోల్పోయి తినడానికి తిండి కూడా దొరక్క ఇబ్బంది పడుతున్నారు. 

ఇక వలస కార్మికుల పరిస్థితయితే వర్ణనాతీతం. ఎక్కడి నుంచో ఉపాధి కోసం వచ్చి , ఇంటికి, సొంతవారికి దూరంగా దొరికింది తింటూ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చాలామంది ఇప్పటికే కొన్ని వందల, వేల కిలోమీటర్లు కాలినడకన కూడా బయల్దేరి వెళ్లారు. 

రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుంటే... పోలీసులు కొడుతున్నారని, ఎవ్వరికి కనపడకుండా రైలు పట్టాల వెంట నడుచుకుంటూ వెళదామనుకొని బయల్దేరిన కొందరు కూలీలపై రైలు దూసుకెళ్లి 15 మందిని పొట్టనబెట్టుకుంది. 

ప్రభుత్వం వలస కూలీలకు వారివారి సొంత రాష్ట్రాలకు వెళ్ళడానికి అనుమతులనిచ్చినప్పటికీ.... ఆ అనుమతులకు తోడుగా పరిశ్రమలను, నిర్మాణ రంగాలకు కూడా ఇచ్చిన అనుమతులు ఇప్పుడు వలసకూలీలపాలిట శరాఘాతాలుగా మారుతున్నాయి. 

తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక నుండి బీహార్, యూపీ కి వలసకూలీలను తీసుకెళ్లే రైళ్లను రద్దు చేసింది (తరువాత తీవ్రస్థాయిలో విమర్శలు తలెత్తడంతో వాటిని పునరుద్ధరించింది అది వేరే విషయం). కారణం.... శక్తివంతమైన బిల్డర్ లాబీ కార్మికులు కావలి కాబట్టి, వారిని వెళ్ళడానికి అనుమతులివ్వొద్దు అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. 

వలసకూలీల హక్కులను కాలరాస్తూ... వారి జీవితం మీద సర్వ హక్కులు తామే కలిగి ఉన్నామని సర్కారు వారు అనుకున్నట్టున్నారు. రైళ్లను రద్దు చేసారు. ఇలా వలస కూలీలా అవసరం ఇప్పుడు ఏ ఒక్క కర్ణాటక రాష్ట్రానికో మాత్రమే కాదు అన్ని రాష్ట్రాలకు ఉంది. 

మన తెలంగాణ విషయానికి వస్తే... ఇక్కడ ఇప్పుడు వలస కూలీలా అవసరం అత్యధికంగా ఉన్న రెండు రంగాలు రైస్ మిల్లులు, నిర్మాణ రంగాలు. ఈ రెండు రంగాల్లో పని జరగాలంటే... వారు లేనిది కుదిరే పని కాదు. 

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో చిక్కుకున్న వలస కూలీలను వెనక్కి పంపిస్తునే... అక్కడి నుండి వలస కూలీలను వెనక్కి కూడా తీసుకొస్తుంది. మొన్న బీహార్ వెళ్లిన ఒక రైలు దాదాపు 250 మంది వలస కూలీలను వెనక్కి తీసుకొని వచ్చింది. అలా అనేక రాష్ట్రాలకు వెళ్లిన రైళ్లు 20 వేల మందిని ఇక్కడి రైస్ మిల్లుల్లో పనిచేయడానికి తీసుకొస్తాయని అన్నారు. 

తెలంగాణ రాష్ట్రం నుండి వారి వారి సొంత ఊర్లకు వెళ్లినవారంతా తిరిగి వస్తారనే ఒక ఆశతో ఉంది రాష్ట్ర సర్కార్. బీహార్, ఝార్ఖండ్, యూపీ రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు వారి వారి సొంతూర్లలో పని దొరక్క తెలంగాణకు తిరిగి వస్తారనేది వారి ఆలోచన. 

కానీ ఇక్కడే ఇంకొన్ని సమస్యలు దాగి ఉన్నాయి. మొదటగా లాక్ డౌన్ ఇంకెంతకాలం ఉంటుంది అనేదానిపై క్లారిటీ లేదు. ఇకపోతే విపత్కర పరిస్థితుల్లో అందరం కలిసి కలోగంజో తాగి బ్రతుకుదాము కానీ, అందరం ఒకేదగ్గర ఉందామనే మన భారతీయ కుటుంబ వ్యవస్థ మనకు నేర్పింది.ఇక మన కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే.... బ్రతికుంటే బలుసాకు తిని బతకొచ్చు కదా! 

ఇక ఈ కారణాలతోపాటుగా... ఇక్కడి నుండి వెళ్లిన వలస కూలీలు ఇక్కడి పరిస్థితులను వారి సొంతూర్లలోని వారికి కూడా వివరిస్తారు. ఇక్కడ పనుల్లేక, ఎలా కలం గడుపుతున్నామో చెబుతారు. ఎందరో వలస కూలీల జీతాలు ఆగిపోయాయి. 

ఈ నేపథ్యంలో వారు ఈ విషయాలను ఫోన్ ద్వారా అయినా వారి సొంత ఊర్లలో వారికి చేరవేస్తారు. అక్కడి వారు ఇక్కడికి బయల్దేరి వచ్చే ముందు ఈ విషయాలన్నింటిని బేరీజు వేసుకుంటారు కూడా. 

ఈ అన్ని పరిస్థితులను పరిశీలిస్తుంటే.... వలసకూలీలు ఎంతమంది వెనక్కి వస్తారనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే 3 లక్షల పైచిలుకుమంది వలస కూలీలు వారివారి సొంతూర్లకు వెళ్ళడానికి ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకున్నారు కూడా. 

ఈ పరిస్థితులు కొనసాగుతుండగానే శుక్రవారం నుంచి ఊర్లకు వెళ్లాలనుకునే వలసకూలీల పేర్లను నమోదు చేసుకోవడం ఆపేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇలా ఆపగానే పోలీస్ కమీషనర్ సజ్జనార్ ఇక్కడి వలస కూలీలు తమ వంతు వచ్చేవరకు ఆగండని, అప్పటివరకు ఇక్కడ తమ పనిని తాము చేసుకోండని ఒక వీడియో విడుదల చేసారు.  

ఇలా ఊర్లకెళ్లాలనుకునేవారి నమోదు ప్రక్రియను ఆపేయడం, సజ్జనార్ వీడియో మెసేజ్ ఇవన్నీ చూస్తుంటే... తెలంగాణ ప్రభుకిత్వం ఇక్కడే వారిని ఉద్యోగాలు వెతుక్కోమని చెబుతున్నట్టు కనబడుతుంది. 

కొత్థవారు రావడానికి అంత ఆసక్తి కనబర్చడం లేదు, ఉన్నవారు వెళ్లిపోతున్నారు, రాష్ట్రంలో ప్రధాన రంగాలు నడవడానికి వలస కార్మికుల అవసరం తీవ్రంగా ఉంది. రోజుకి నడుపుతామన్న 40 రైళ్లు నడవడం లేదు. వలస కూలీల సొంత రాష్ట్రాలు కూడా వీరి కోసం క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలి కాబట్టి సమయం పడుతుందని, అందుకనే తాము రోజుకి 40 రైళ్లు నడపడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.... అవతలి ప్రభుత్వాల అనుమతులు పొందడం ఆలస్యమైతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. 

మూడు లక్షలపైచిలుకు మంది ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే... ఇప్పటివరకు తరలించింది 20 లక్షల పైచిలుకు మందిని మాత్రమే! కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్మికులను ఇక్కడే ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది కేసీఆర్ సర్కార్. వారు గనుక ఇక్కడే పనులు చూసుకుంటే... ప్రస్తుతానికి రాష్ట్రంలో తెరుచుకున్న రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం, రైస్ మిల్లులకు ఊతమిస్తుందనేది ప్రభుత్వ ఆలోచన! 

ఇకపోతే... బీహార్, యూపీ  నుంచి కొత్తగా వచ్చిన వలస కూలీలకు కూడా 14 రోజుల క్వారంటైన్ ఏర్పాటు చేస్తారా....?  చేస్తే ఆ ఖర్చు ఎవరు భరించాలి?  ఒకవేళ వారందరినీ 14 రోజుల క్వారంటైన్ లో ఉంచితే.... ఆ పధానాలుగు రోజులపాటు కూలీలు దొరక్క ఈ రంగాలన్నీ ఇబ్బంది పడవా అనేది వేచి చూడాల్సిన అంశం!

Follow Us:
Download App:
  • android
  • ios