ఐశ్వర్య రాయ్ సౌందర్యం వెలుగులో ప్రపంచ విజేత కరణం మల్లీశ్వరిపై చీకట్లు
దేశానికి తొలి స్వర్ణం గెలిచింది మొదలు 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో మెరుపుల వరకు కరణం మల్లీశ్వరికి ఎన్నడూ తగిన గుర్తింపు లభించలేదు. దారిద్య్రరేఖకు దిగువన ఉండే శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన కరణం మల్లిశ్వరి వెయిట్‌లిఫ్టింగ్‌లో దేశానికి రోల్ మోడల్.
1994 నవంబర్ నెలాఖరు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఫొటోగ్రాఫర్లు, మీడియా హడావుడి నడుస్తుంది. ఇంతలోనే ప్రపంచ సుందరి టైటిల్ గెలిచి ఐశ్వర్యారాయ్ భారత్ వచ్చింది. అందరూ ఆమెను కెమెరాల్లో బంధించడానికి, ఆమెకు అపూర్వ స్వాగతం చెప్పడానికి ఎగబడుతున్నారు.
ఇంతలోనే ఇస్తాంబుల్ ఫ్లైట్ దిగిన ఒక విశ్వ విజేత కూడా ఎయిర్ పోర్టు లాబీల్లోకి వచ్చింది. తాను ప్రపంచ ఛాంపియన్ గా అవతరించి భారత్ తిరిగి వచ్చినప్పటికీ ఆమెకు మాత్రం ఎటువంటి స్వాగతం దక్కలేదు. విశ్వ విజేత అయి తిరిగి వచ్చినప్పటికీ... ఢిల్లీ ఎయిర్ పోర్టు బయటకు వచ్చి, ఒక ఆటో మాట్లాడుకొని తన అకాడెమీకి వెళ్ళింది. అదే సంవత్సరం సుస్మిత సేన్ విశ్వ సుందరి కిరీటాన్ని, ఐశ్వర్య రాయ్ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలవడంతో కరణం మల్లీశ్వరి గురించి కానీ, ఆమె సాధించిన విజయం గురించి కానీ పెద్దగా చర్చ కూడా జరగలేదు.
ఆరేండ్లు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే... 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో 240 కేజీలు (110 కేజీలు స్నాచ్, 130 కేజీలు క్లీన్ అండ్ జెర్క్) ఎత్తిపడేసింది. విశ్వ క్రీడల్లో కాంస్య పతకం గెల్చుకుంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఆమె తెలుగు తేజం, దిగ్గజ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి.
దేశానికి తొలి స్వర్ణం గెలిచింది మొదలు 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో మెరుపుల వరకు కరణం మల్లీశ్వరికి ఎన్నడూ తగిన గుర్తింపు లభించలేదు. దారిద్య్రరేఖకు దిగువన ఉండే శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన కరణం మల్లిశ్వరి వెయిట్‌లిఫ్టింగ్‌లో దేశానికి రోల్ మోడల్.
సిడ్నీలో పతకం నెగ్గి ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా నిలిచిన 20 ఏండ్ల తర్వాత మల్లీశ్వరి జీవితంపై ఓ సినిమా రాబోతుంది. సిక్కోలు నుంచి సిడ్నీ వరకు మల్లీశ్వరి ప్రయాణాన్ని దర్శకురాలు సంజనరెడ్డి వెండితెరపై చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
శ్రీకాకుళం వంటి మారుమూల జిల్లా నుంచి వచ్చిన కరణం మల్లీశ్వరి దేశం గర్వపడే విజయాలు సాధించింది. ఆ విజయాలు, ఆ ప్రస్థానం అంత సులువుగా ఆరంభం కాలేదు. ఇప్పటికీ ఆడపిల్లలపై చిన్నచూపు, వివక్ష చూస్తూనే ఉన్నాం. 30 ఏండ్ల కిందట రోజుల్లో పరిస్థితి సులువుగానే ఊహించవచ్చు.
ఆడపిల్లలను చదవించటమే తప్పు అని తిట్టిపోసిన కాలంలో, ఓ అమ్మాయి క్రీడలను ఎంచుకోవటం సాహాసమే అని చెప్పాలి. కరణం మల్లీశ్వరి అటువంటి సాహసమే చేసింది. వెయిట్ లిఫ్టింగ్ కోసం కండలు పెంచినా, విమర్శలు ఎదుర్కొన్న మల్లీశ్వరి ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.
వెయిట్ లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న తర్వాత, అందులో విజయం సాధించటమే ఏకైక లక్ష్యంగా సాగింది. కరణం మల్లీశ్వరి చారిత్రక విజయాలు సాధించినా, ఆమెకు ఎన్నడూ తగిన గుర్తింపు లభించలేదు. కరణం మల్లీశ్వరి అంటే ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్స్ విజయాలే కాదు.. అందుకోసం పడిన శ్రమ, కష్టం, ఎదుర్కొన్న అడ్డంకులు ముందుగా వస్తాయని ఆమె అంటోంది.
తన బయోపిక్ అంటే ఆ విషయాలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని మల్లీశ్వరి తెలిపింది. '1987లో వెయిట్ లిఫ్టింగ్ మొదలు పెట్టాను. అమ్మాయిలు క్రీడలు ఆడకూడదనే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది. ఈ రోజుల్లో అమ్మాయిలు జిమ్‌కు వెళ్తున్నారు. కండలు చూపిస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. మా కాలంలో కండలు (మజిల్స్) కనిపించకుండా ఉండేందుకు వదులుగా ఏండే టీ షర్ట్‌లు ధరించాను. కండలు తిరిగిన దేహం మహిళలకు సరిపడదని అనేవారు.'
'అప్పట్లో నేను డబ్బు గురించి అసలు ఆలోచించలేదు. మా ఆలోచన విధానం ఆ విధంగా ఉండేది కాదు. ఈ తరం అథ్లెట్లు డబ్బు సంపాదన, పాపులారిటీ కావాలనే అవగాహనతో ఉన్నారు. ప్రతి మూడు నెలలకు అంతర్జాతీయ టోర్నీలు ఉండేవి, వాటిలో విజయం సాధించకపోతే అవమానక రంగా భావించేవాళ్లం. కానీ కెరీర్‌లో డబ్బు సంపాదన ముఖ్యమనే విషయం గ్రహించలేదు. ఈ విషయం ఇప్పుడు అర్థమవుతోంది' అని కరణం మల్లీశ్వరి పేర్కొంది.
2016లో దర్శకురాలు సంజన రెడ్డి బయోపిక్ విషయమై మల్లీశ్వరిని సంప్రదించింది. ఏదో సినిమా తీసేశామన్నట్టు కాకుండా, స్ఫూర్తిదాయకంగా తీయాలని తన అభిప్రాయం కుండబద్దలు కొట్టింది. అదే సమయంలో దంగల్ సినిమా విడుదల అయ్యింది. దీంతో దంగల్ స్థాయి గుర్తింపు రావాలనే ఆలోచన సైతం వచ్చిందని తెలిపింది.
' చిత్ర బృందానికి నాది ఒకటే వినతి. కరణం మల్లీశ్వరి తెరపై కనిపించాలి. ఆమె పడిన కష్టం తెలియాలి. నా కష్టం, ఇబ్బందులు, సాధన, శిక్షణ తీరు తెన్నులు.. ఇవన్నీ కచ్చితంగా సినిమాలో ఉండాలి' అని కరణం మల్లీశ్వరి తెలిపింది.
కరణం మల్లీశ్వరి చిత్రాన్ని రూ. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నారు. చిత్ర దర్శకురాలు సంజన రెడ్డి చిన్నతనంలోనే మల్లీశ్వరినే రోల్ మోడల్. ఇప్పుడు ఆమె బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంజన రెడ్డి సిక్కోలు టూ సిడ్నీ ప్రస్థానాన్ని కండ్లకు కట్టే ప్రయత్నానికి త్వరలోనే శ్రీకారం చుట్టనుంది.