జెయింట్ కిల్లర్: అసెంబ్లీలో అడుగు పెట్టిన క్రాంతి
ఆందోల్ అభ్యర్థిగా జర్నలిస్టు క్రాంతి కిరణ్ పేరును టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. కాకలు తీరిన కాంగ్రెసు నేత దామోదర రాజనర్సింహను, సినీ గ్లామర్ తో పాటు ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న బాబూమోహన్ ను ఎదుర్కుంటారా అని ఆశ్చర్యపడ్డారు. కానీ క్రాంతి పార్లమెంటరీ రాజకీయాల్లో తన సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు
2011లో అనుకుంటాను, ‘ఆత్మగౌరవం- స్వపరిపాలన -స్వరాజ్యం మన ధ్యేయం’ అంటూ తెలంగాణా జర్నలిస్టు ఫోరం అద్య్వర్యంలో ‘మాక్ అసెంబ్లీ జరిగింది. అందులో వివిధ పక్ష రాజకీయనేతలకు తెలంగాణా ప్రజాప్రతినిధులుగా పనిచేయవలసిన ఆవశ్యకతను బోధించడం ప్రదానంగా జరిగింది. అది నిర్వహించడంలో కీలకంగా ఉన్న క్రాంతి నేడు స్వయంగా ప్రజా ప్రతినిధిగా మారడం ఒక పెద్ద ముందడుగు.
మిత్రుడు క్రాంతి నేడు శాసనసభ్యుడిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. ప్రజా ప్రతినిధిగా ప్రమాణం స్వీకారం చేసి సరికొత్త బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలతో, గొప్ప ప్రేమాభిమానాలతో నాలుగు మాటలు పంచుకోవడం అత్మీయుడిగా నా బాధ్యత. అది ఎంతో ఆనందం.
క్రాంతి కేవలం పాత్రికేయుడు, పాత్రికేయ నాయకుడే కాదు. ప్రజా స్వామిక ఉద్యమాల్లో ఎదిగిన కార్యకర్త, నేడు స్వరాష్ట్రంలో ప్రజా ప్రతినిధి. ఇదంతా ఒక బాధ్యతతో...మారుతున్న తెలంగాణ సామాజిక ముఖచిత్రంలో తన పాత్రను తాను నిర్వచించుకున్న ఫలితం.
క్రాంతి సన్నిహిత మిత్రుడే కాదు, ఉద్యమ సహచరుడు. పోరాట వారసత్వం నుంచి వచ్చిన మనిషి. మాది రెండున్నర దశాభ్దాల సాన్నిహిత్యం. పౌరహక్కుల ఉద్యమలో ప్రాణాలకు ఎదురీది బతికిన తరం.
అంతేకాదు, అంటరానితనం, అసమానతలు, వివక్ష, ఆధిపత్యం- వీటి పట్ల మడిమ తిప్పని పోరాట యోధుడు తన తండ్రి. అతడి లక్షణాలు పుణికి పుచ్చుకుని రూపు దాల్చిన వ్యక్తిత్వం తనది.
దాదాపు మూడు దశాభ్దాల పాత్రికీయ జీవితంలో ఈనాడులో స్త్రింగర్ నుంచి- టీవీ 9 వారి ‘జై తెలంగాణ (టీవీ 1)’ చానల్ సిఈఓ దాకా ఎదిగిన క్రాంతి అటు ప్రింటు, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాల్లో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ ప్రథాన స్రవంతి రాజకీయాల నుంచి, ప్రత్యమ్నాయ రాజకీయాల దాకా, సోషల్ ప్రాబ్లెంల నుంచి క్రైం బీట్ దాకా – కత్తి మీద సాము వంటి గురుతర బాధ్యతను అత్యంత సహోసోపెతంగా పని చేసి నిరూపించుకున్న అతి కొద్ది మంది రిపోర్టర్లలో ఒకరు.
నాయకుడిగానూ తనది ఎన్నదగిన కృషి. మలి తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి ముందున్న సంస్థ, మిగతా సంస్థలకు సయోధ్యగా, స్ఫూర్తిగా నిలిచిన సంస్తా -తెలంగాణ జర్నలిస్టు ఫోరం. దీని ఫౌండర్ క్రాంతి.
2001లో ఈ సంస్థ అవశ్యకతను గుర్తించి, పిడికెడు మందితో మొదలు పెట్టి, ముందుండి దానికి రూపం తెచ్చి, ఎవరు యాక్టివ్ గా ఉన్న లేకపోయినా నడిపించిన దీర్గదర్శి. తర్వాత అది జర్నలిస్టు యూనియన్ గా మారడం, అది తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ఉన్నంతలో చురుకుగా పని చేయడంలో కార్యదర్శిగా ఆయనే కీలకం.
ముందు ఫోరం, అటు తర్వాత యూనియన్ కార్యకలాపాలు చూస్తూనే యధావిధిగా పాత్రికేయ వృత్తిని నిర్వహిస్తూ, ఎల్ ఎల్ బీ కూడా పూర్తి చేసి, దాదాపు 2010 నుంచి ఆందోల్ నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటూ రాజకీయ భవిష్యత్తుకు బీజాలు వేసుకున్నాడు క్రాంతి. ఇందుకు ఉద్యమ శీలత ఎరిగిన కేసీఆర్ గారు క్రాంతిని నిండు మనసుతో ఆశీర్వదించడం, దాంతో అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి వీలైనది. ఇది తన జీవితంలో గొప్ప మలుపు.
నిజానికి నూతన ప్రజాస్వామిక దృక్పథానికి కట్టుబడి ఉన్న వారెవరూ ప్రజాస్వామిక రాజకీయాల్లో ఒక ప్రయోగం చేయడానికి భయపడుతారు. వారి వ్యక్తిత్వాలు అంగీకరించవు. కానీ, మారుతున్న సామాజిక ముఖచిత్రం అనేక కీలక పరిణామాలకి దారి తీసింది. విప్లవ పార్టీల్లో కులం ఉపరితలం మాత్రమే అన్న స్థితి నుంచి అది పునాదిలో మార్పు తేవడానికి ఎట్లా వీలు కలిగించిందో. అటు తర్వాత తెలంగాణ సోయి మొత్తం జీవన విధ్వంసానికి ఆంధ్రప్రదేశ్ ఎట్లా కారణమైందో, అది తెలంగాణా స్వరాష్ట్రానికి మరెలా మార్గం చూపిందో అందరం చూశాం. ఇతెం, ఈ ప్రస్థానంలో క్రాంతి తనను తాను ఒక స్థానికుడిగా మార్చుకోవడం అభినందనీయం. అంతేకాదు, ఒక దళిత మేధావిగా, తెలంగాణా భూమి పుత్రుడిగా క్రాంతి తన భావిశ్యత్తు మార్గాన్ని తీర్చుదిద్దుకోవడం మరీ మరీ అభినందనీయం. అందువల్లే నేడు అయన అసెంబ్లీ సాక్షిగా ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసే స్థాయికి వచ్చాడు. ఇది నిస్సందేహంగా తెలంగాణాలో నూతన మార్పు స్థిరపడుతున్నది అనడానికి సంకేతం. ప్రజా రాజకీయాల్లో నవ్య రీతికి సోఫానాలు పడుతున్నాయనడానికి ఉదాహరణ.
2011లో అనుకుంటాను, ‘ఆత్మగౌరవం- స్వపరిపాలన -స్వరాజ్యం మన ధ్యేయం’ అంటూ తెలంగాణా జర్నలిస్టు ఫోరం అద్య్వర్యంలో ‘మాక్ అసెంబ్లీ జరిగింది. అందులో వివిధ పక్ష రాజకీయ నేతలకు తెలంగాణా ప్రజాప్రతినిధులుగా పనిచేయవలసిన ఆవశ్యకతను బోధించడం ప్రధానంగా జరిగింది. అది నిర్వహించడంలో కీలకంగా ఉన్న క్రాంతి నేడు స్వయంగా ప్రజా ప్రతినిధిగా మారడం ఒక పెద్ద ముందడుగు. దీనర్థం ఒకరికి బోధించడమే మాత్రమే కాదు, ఆ బోధనల సారంతో మనమూ రాజాకీయాల్లో కూడా స్వయంగా ఎదగడం అవసరం అని, అది నేటి తెలంగాణ ఆవశ్యకత అని కూడా భావించాలి. ఆ కర్తవ్య నిర్వహణలో క్రాంతి ఎదిగివచ్చాడు. ఇక తాను ఎప్పటిలా చురుగ్గా, మరింత హుందాగా ప్రజాల్లో తన పని విధానాలతో దూసుకుపోతదని ఆశిస్తున్నాను.
చివరగా కాదు, ఇక్కడే క్రాంతి తండ్రి భూమయ్య గారి గురించి చెప్పాలి.
అయన ఉపాధ్యాయుడు. బహుముఖ కార్యశీలి.
మనకు బాలగోపాల్ గారి గురించి తెలుసు. ప్రతి శనివారం అయన ఎదో మారుమూల గ్రామానికి వెలుతారని. మళ్ళీ సోమవారం హైదరాబాద్ వస్తారని. అలాగే భూమయ్య గారు. అయన నోటమాట ద్వారా గానీ లేదా వార్తా పత్రికల్లో చదవడం వల్ల గానీ ఎక్కడైనా దళితుడికి అన్యాయం జరిగినట్లు తెలిసినా, దళితుల మధ్య అనైఖ్యత పొడ సూపినట్లు విన్నా దూరం గురించి ఆలోచించకుండా వందలాది కిలోమీటర్లు వెళ్ళేవాడు. ఆ సమస్య పరిష్కరించి వచ్చేవాడు. తనకు పార్టీ ...సంఘం..అని లేదు. ఒక చైతన్యవంతమైన పౌరుడిగా వెళ్లి గ్రామీణులను సమావేశ పరిచి, సమస్యను కూలంకషంగా చర్చించి వారితోనే పరిష్కారానికి మార్గం చూపేవారు. అయన కృషి చాలా రంగాల్లో నిశబ్దంగా ఉన్నది. భూమయ్య గారి వల్లే అప్పటి ఐఎఎస్ అధికారి శంకరన్ గారు బాలికలకోసం ప్రత్యేక కాలేజీలు ఏర్పాటు చేసారని కూడా చాలా మందికి తెలియదు.
ఒక్క దళితులు, మహిళలు అనే కాదు, భూమయ్య గారు స్వచ్చందంగా , నిర్భయంగా చేసిన కృషి వల్ల సమాజం ఎంత మారిందో స్థానికంగా మాత్రమే తెలుసు. అయన స్ఫూర్తితో ఎదిగిన క్రాంతి గురించి చెప్పనక్కర్లేదు. తనకు బంగారు అవకాశం వచ్చింది. తెలంగాణా రాష్ట్రంలో సూదూరం ప్రజాప్రతినిధిగా నడిచే తొలి అవకాశం వరించింది. ఇప్పుడు క్రాంతి ముందు అయన తండ్రి నడిచిన దారి ఉన్నది. అమరుల స్ఫూర్తి ఉన్నది. తెలంగాణా ఉద్యమ ఆకాంక్షల ఎరుకా ఉన్నది. ఎరుపు నీలం మధ్యన ఒక గ్రే ఏరియా కూడా ఉన్నది. తన గురించి చాలా నమ్మకంగానూ ఉన్నది. స్థైర్యంతో ముందుకు నడుస్తాడన్న విశ్వాసమూ ఉంది. నీ వెంట పాత్రికేయ సమాజం వెన్నంటి ఉన్నదన్న నమ్మకమూ ఉన్నది.
మరి, ఆలింగానాలతో...
ఆల్ ది బెస్ట్ క్రాంతి...
మిత్రుడు
కందుకూరి రమేష్ బాబు
ps: క్రాంతిది దుందుడుకు స్వభావం అని పేరు. కానీ అది ముక్కు సూటి తనం. నిక్కచ్చితనం, రాజీ పడనీ తత్వం వల్ల వచ్చిందని దగ్గరివారికే తెలుసు నిజానికి ఆ స్వభావమే నేడు ఆందోల్ ప్రజలకుకలిసి వచ్చింది. ఆ నియోజక వర్గ ప్రజల సమస్యలను పట్టుదలతో పరిష్కరించి తానేమిటో నిరూపించే అవకాశం వచ్చింది. క్రాంతిని గెలిపించిన అక్కడి ప్రజలకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అభినందనలు.