తిరుపతి: తిరుపతి లోకసభ సీటు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్టు వీడడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. తిరుపతి సీటును తమకు కేటాయించాలని చాలా కాలంగా పవన్ కల్యాణ్ బిజెపిపై ఒత్తిడి పెడుతూ వస్తున్నారు. ఆ స్థితిలోనే బిజెపి విశాఖపట్నంలో సమావేశమై తిరుపతిలో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంది.

బిజెపి సమావేశంతో తిరుపతి సీటును జనసేనకు కేటాయించడానికి బిజెపి సిద్ధంగా లేదనే అభిప్రాయం స్థిరపడింది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తిరుపతిలోనే పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తిరుపతి లోకసభ ఉప ఎననిక అభ్యర్థిపై వారంలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. బిజెపి బరిలో నిలిస్తే జిహెచ్ఎంసీ స్తాయిలో బలంగా పోటీ చేయాలని అన్నారు. జనసేన పోటీలో నిలిస్తే ఏడు శాసనసభా నియోజకవర్గాల్లో తానే ప్రచారం చేస్తానని చెప్పారు. 

దీన్నిబట్టి తిరుపతి సీటు నుంచి తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు అర్థమవుతోంది.  మరోమారు సమావేశం తర్వాత తిరుపతి అభ్యర్థిని ప్రకటిస్తామని కూడా పవన్ కల్యాణ్ చెప్పారు.  బిజెపి రాష్ట్ర నాయకత్వంతో క్షేత్ర స్థాయి సమస్యలు ఉన్నట్లు తాను పీఎసీలో చెప్పినట్లు తెలిపారు. గతంలో ఇబ్బందులు ఉంటే తాను బిజెపి అగ్ర నాయకత్వంతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రధాని మోడీతో సమస్యలేమీ లేవని చెప్పారు. దీన్ని బట్టి తిరుపతి సీటు విషయంలో పవన్ కల్యాణ్ బిజెపి జాతీయ నాయకత్వంతో తేల్చుకోవాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. 

మరోవైపు, తిరుపతిలో తమ అభ్యర్థిని పోటీకి దించాలని బిజెపి రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలు తిరుపతికి తమ అభ్యర్థులను ప్రకటించాయి. బిజెపి-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి తేలాల్సి ఉంది. జనసేన, బిజెపి మధ్య తిరుపతి సీటు విషయంలో అవగాహన రావాల్సి ఉంది. తిరుపతి సమావేశం ద్వారా తిరుపతి సీటును తాము వదులుకోబోమని పవన్ కల్యాణ్ సంకేతాలు పంపినట్లయింది.  

అంతేకాకుండా మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా పవన్ కల్యాణ్ చేశారు. తిరుపతిలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన చెప్పారు. మరో రెండు మూడు సమావేశాల తర్వాత స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. తిరుపతిలో తమ పార్టీయే పోటీ చేయాలని జనసేన భావిస్తోందని అన్నారు. ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగిన తర్వాతనే తిరుపతిలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై స్పష్టత వస్తుందని అన్నారు. దీన్నిబట్టి రాష్ట్ర నాయకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా ఆయన తేల్చి చెప్పినట్లయింది. తిరుపతిలో తామే పోటీ చేస్తామని గురువారం జరిగిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది.