మరోసారి పవన్ కల్యాణ్ సంకేతాలు: చంద్రబాబుతో పొత్తుకు రెడీ?
చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టిడీపితో పొత్తుకు తాసు సిద్ధంగా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంకేతాలు ఇచ్చారు. వైసిపిని ఓడించే బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన చెప్పారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి చర్చకు తెర లేపారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వనని, వైసిపిని గెలవనివ్వనని, అందర్నీ ఏకం చేస్తానని, రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలవకుండా చూసే బాధ్యత తనదేనని ఆయన అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలోజరిగిన కౌలు రైతుల భరోసా యాత్రలో ఆయన ఆదివారంనాడు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి తాను సిద్ధపడుతున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. అదే సమయంలో బిజెపితో పాటు టీడిపిని తీసుకుని వెళ్లే బాధ్యత కూడా తాను తీసుకుంటానని ఆయన చెప్పినట్లయింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసిపి) అధినేత వైఎస్ జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలనే పట్టుదలతో ఉన్న పవన్ కల్యాణ్ ప్రతిపక్షాలను ఏకం చేయడానికి పూనుకోనున్నట్లు చెబుతున్నారు. జనసేనకు, బిజెపికి మధ్య రాష్ట్రంలో పొత్తు కొనసాగుతోంది. టిడిపిని కూడా కలుపుకుని వచ్చే ఎన్నికల్లో పొటీ చేస్తే వైసిపి ఓడిపోవడం ఖాయమని కూడా పవన్ కల్యాణ్ నమ్ముతున్నట్లు అనుకోవచ్చు. అయితే బిజెపి మాత్రం తాము టిడిపితో పొత్తు పెట్టుకునేది లేదని చెబుతూ వస్తోంది. అయినప్పటికీ పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ టిడిపితో నెయ్యానికి పాదులు వేస్తున్నట్లు అర్థమవుతోంది.
గతంతో కూడా పవన్ కల్యాణ్ ధూళిపాళ్లలో చేసిన ప్రకటన వంటిదే చేశారు. అప్పటి నుంచే పవన్ కల్యాణ్ చంద్రబాబుతో స్నేహం చేస్తున్నారనే ప్రచారం ప్రారంభమైంది. చంద్రబాబును గెలిపించడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని రాజకీయాలు చేస్తున్నారని వైసిపి నాయకులు చాలా కాలంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. బిజెపి ప్రస్తుతం టిడిపికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎన్నికల నాటికి మనసు మార్చుకుంటుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు అనుకోవచ్చు.
ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బిజెపి జాతీయ నాయకులతో పవన్ కల్యాణ్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. దాంతో చంద్రబాబుతో పొత్తకు బిజెపి జాతీయ నాయకులను ఒప్పించాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు భావించవచ్చు. నరేంద్ర మోడీని నేరుగా కలుసుకునే అవకాశం చంద్రబాబుకు ఒకటి రెండు సార్లు వచ్చింది. దాంతో పవన్ కల్యాణ్ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా లేకపోలేదని మాట వినిపిస్తోంది.
చంద్రబాబు బిజెపితో స్నేహానికి సుముఖంగానే ఉన్నారు. పవన్ కల్యాణ్ తో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనేది ఆయన ప్రధానమైన అభిమతంగా చెప్పవచ్చు. గతంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలుసుకున్నారు కూడా. అయితే, అది పొత్తులపై చర్చలకో, రాజకీయాలపై చర్చకో జరగలేదు. వైసిపి ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన పోరుకు చంద్రబాబు మద్దతు తెలిపారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు మధ్య సామీప్యం పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి బిజెపి, జనసేన, టిడిపి ఏకమై వైఎస్ జగన్ ను ఎదుర్కునే పరిస్థితులు వస్తాయని భావిస్తున్నారు.