Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ ఉద్యమ అణచివేత : నవ నాయకత్వానికి నాంది పలకనుందా?

ప్రస్తుతం ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిలో అత్యధికులు ఉద్యమంలో పాల్గొన్న అనుభవం ఉన్నవారుకాదు. వారికి ఉద్యమం ఎలా పుడుతుంది, ఎలా రూపాంతరం చెందుతుంది వంటి అంశాలపైన అవగాహనా లేదు. ప్రస్తుత రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఇదే కోవకు చెందినవారే. గులాబీ పార్టీకి ఇలాంటి ఉద్యమాలు కొత్త కాదు. కానీ ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ కు మాత్రం కొత్త. 

is new leadership going to emerge out of this rtc strike?
Author
Hyderabad, First Published Oct 8, 2019, 11:58 AM IST

ఇప్పటికే తెరాస నాయకుల్లో  బంగారు తెలంగాణ బ్యాచ్(బిటి)గా, ఉద్యమ తెలంగాణ బ్యాచ్(యూటీ)గా మనకు కనపడతారు. ఉద్యమ సమయంలో తెరాస కోసం పనిచేసినవాళ్లు ఉద్యమ తెలంగాణ బ్యాచ్ గా, తెలంగాణ ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ పునర్నిర్మాణానికి పాటుపడుతున్నవారంతా బంగారు తెలంగాణ బ్యాచ్ గా మనకు కనపడతారు. 

మరి ఈ రెండింటిలో తేడా ఏంటి అనే అనుమానం కలుగక మానదు. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యమ నాయకుల కన్నా ఇతర పార్టీల నుంచి వచ్చి తెరాస లో చేరిన వారికి ఎక్కువ పదవులు కట్టబెట్టడం వల్ల ఇలా ఈ రెండు గ్రూపుల మధ్య దూరం పెరిగింది. 

ఇలా అధికార తెరాసను యూటీ బ్యాచ్, బిటి బ్యాచ్ గా వ్యవహారంచబట్టి చాలా కాలమే అయినా ఇప్పుడెందుకు వీటిని మరల తెర మీదకు తీసుకురావాల్సి వచ్చిందనే ప్రశ్నకు సమాధానం కావాలంటే, కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, దానిపైన ప్రభుత్వం మోపుతున్న ఉక్కుపాదాన్ని ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. 

ఇందాక చెప్పుకున్నట్టు ప్రస్తుతం ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిలో అత్యధికులు ఉద్యమంలో పాల్గొన్న అనుభవం ఉన్నవారుకాదు. వారికి ఉద్యమం ఎలా పుడుతుంది, ఎలా రూపాంతరం చెందుతుంది వంటి అంశాలపైన అవగాహనా లేదు. ప్రస్తుత రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఇదే కోవకు చెందినవారే. గులాబీ పార్టీకి ఇలాంటి ఉద్యమాలు కొత్త కాదు. కానీ ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ కు మాత్రం కొత్త. 

ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఇందాక చెప్పుకున్నట్టు ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ కు చెందిన వారే ఎక్కువమంది ఉండటంతో వారు ఈ ఆర్టీసీ కార్మికుల ఉద్యమ తీవ్రతను అంచనా వేయలేకపోతున్నారని ఉద్యమ నేతల బ్యాచ్ భావిస్తోంది. ఉద్యమాలు ఒక సారి ప్రారంభమయ్యాక అవి ఏ రూపును సంతరించుకుంటాయో, ప్రజల మైండ్ సెట్ ఎలా మారుతుంటుందో ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ గేజ్ చేయలేకపోతున్నారని ఉద్యమ నాయకులు ఫీల్ అవుతున్నారు. 

కెసిఆర్ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నట్టు ప్రకటించడంతో వారు ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నారన్న విషయం అర్థమవుతోంది.  ఈ ఆర్టీసీ కార్మికులకు ఉద్యమాలు కొత్త కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన సకలజనుల సమ్మెలో వీరిపాత్ర అత్యంత ముఖ్యమైనది. 

ఇప్పుడిలా ఒకేసారి దాదాపు 50వేల మందిని తొలగించడమంటే, కొరివితో తల గోక్కున్నట్టే అని ఉద్యమ నాయకులు భావిస్తున్నారు. ఇలా ఒకేమారు తొలగించడం వల్ల ఈ ఉద్యమాన్ని మరింత పెద్దదిగా ఎదిగే ఆస్కారం కెసిఆర్ స్వయంగా ఇచ్చినట్టయ్యిందని ఉద్యమ తెలంగాణ బ్యాచ్ భావిస్తోందట. 

ఉద్యమం ఎక్కువవ్వడమొక్కటే కాదు, అసలు సమస్య ఇంకోటి ఉంది. ఉద్యమం సందర్బంగా కొత్త నాయకత్వం పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారట. ఇలా వారు భయపడడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుత ఉద్యమ తెలంగాణ బ్యాచ్ కు చెందిన నాయకులంతా ఇలా ఉద్యమం సందర్బంగా ఉద్భవించిన నాయకులే.

ఉద్యమం సందర్బంగా వచ్చే మార్పులను గమనించడం అంత తేలికైనపనికాదు. ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎదిగే నాయకులు పైకి తొలుత కనపడరు. కానీ ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసి అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతారు. ఉద్యమ స్వభావమే అంత. ఇలా ఉద్యమ స్వభావాన్ని అర్థం చేసుకోలేకపోయిన ఎందరో హేమాహేమీలు తెలంగాణ ఉద్యమ సందర్బంగా వారి రాజకీయ జీవితానికి మరణ శాసనాలు రాసుకున్నారు. 

ఇప్పుడు ఆర్టీసీ సమ్మె కూడా అదే దారిలో పయనిస్తోందని ఉద్యమ తెలంగాణ బ్యాచ్ భయపడుతున్నారు. అప్పటి తెలంగాణ ఉద్యమాన్ని ఇప్పటి ఆర్టీసీ ఉద్యమాన్ని వారు పోల్చి చూసుకొని మరింత కలవరపడుతున్నారు. కెసిఆర్ ఈ ఉద్యమాన్ని మరీ పర్సనల్ గా తీసుకోవడంవల్ల ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు. 

తాము కూడా ఇలాంటి ఉద్యమాల నుండి పుట్టిన నాయకులమే కాబట్టి ఇలాంటి ఉద్యమ స్వభావాలను తాము అర్థం చేసుకున్నంత తొందరగా బంగారు తెలంగాణ బ్యాచ్ అర్థం చేసుకోలేదని వాళ్లలో వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారట. 

Follow Us:
Download App:
  • android
  • ios