పొంగులేటి వర్గాన్ని ఢీ కొనేందుకు కేసీఆర్ స్కెచ్.. తుమ్మలకు కీలక బాధ్యతలు..?
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్ గూటికి చేరడం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్ గూటికి చేరడం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే పొంగులేటి కాంగ్రెస్ చేరడం బీఆర్ఎస్‌కు నష్టం చేకూరుస్తుందా? లేదా? అనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు చేదు ఫలితాలే ఎదురయ్యాయి. అయితే ఈ సారి ఎలాగైనా ఖమ్మంలో కూడా సత్తా చాటాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.
అయితే ఖమ్మంలో మారిన తాజా రాజకీయ పరిణామాలతో.. కేసీఆర్ కూడా తన వ్యూహాన్ని మార్చుకోవాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఏ ఒక్క నియోజకవర్గం నుంచి కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలవకుండా చూస్తానని పొంగులేటి కాంగ్రెస్‌లో చేరే ముందు ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మంలో మెజారిటీ స్థానాల్లో గెలుపొందడం ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్.. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో చేరి పార్టీ ప్రచార కమిటీ కో-ఛైర్మన్ బాధ్యతలు దక్కించుకున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు వ్యుహాలను కూడా కేసీఆర్ సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పొంగులేటిని ఎదుర్కోవడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన పాత్ర ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవిని అప్పగించడంతో పాటు, జిల్లాలో పార్టీ సమన్వయ బాధ్యతలను ఆయన భుజాలపై మోపితే ఎలా ఉంటుందని కేసీఆర్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందరికీ సుపరిచితుడైన తుమ్మలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. మరోవైపు ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో వామపక్షాల ప్రభావం కూడా ఎక్కువేనన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ వామపక్షాలను కూడా కలుపుకుని పోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక, తుమ్మలకు కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ భావిస్తుండటం వెనక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. తుమ్మల నాగేశ్వరరావుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గంలో ఆయనకు మంచి పేరు ఉంది. ఈ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని.. పార్టీలో సముచితమైన పదవిని ఇవ్వడం ద్వారా తుమ్మల అనుభవాన్ని, సేవలను ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తూ ఉండొచ్చు.
అయితే తుమ్మల గత కొంతకాలంగా పాలేరు నుంచి తాను పోటీ చేస్తానని చెప్పుకొస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో పాలేరు నుంచి విజయం సాధించిన కందాల ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత గులాబీ గూటికి చేరారు. దీంతో అప్పటినుంచి పాలేరు బీఆర్ఎస్‌లో తుమ్మల వర్సెస్ కందాలగా రాజకీయం కొనసాగుతుంది. మరి ఒకవేళ పార్టీలో తుమ్మలకు కీలక బాధ్యతలు అప్పగిస్తే.. పాలేరు సీటు విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఏ వైఖరి తీసుకుంటుందనేది కూడా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.