Asianet News TeluguAsianet News Telugu

సంపూర్ణ క్రాంతి: కేంద్రంలోని బీజేపీని గద్దె దింపడానికి కేసీఆర్ వ్యుహాం అదేనా..?

కేంద్రంలోని మోదీ సర్కార్‌పై తమ పోరాటం ధాన్యం కొనుగోళ్ల వద్దే ఆగిపోదని.. ఇతర అంశాలపై కూడా పోరు కొనసాగిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అదే సమయంలో బీజేపీని ఎదుర్కొవడానికి తమకు ఓ విజన్ ఉందనే విషయాన్ని కేసీఆర్ నిన్నటి ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. 


 

IS KCR Follow Two angles strategy in Anti-BJP Fight
Author
Hyderabad, First Published Mar 22, 2022, 1:29 PM IST

కేంద్ర ప్రభుత్వం యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో కేంద్ర ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం హెచ్చరించారు. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టే.. తెలంగాణ కూడా కొనుగోళ్లు చేపట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో కేంద్రం తీరుపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పాలనలో కేంద్ర ప్రభుత్వ అసమర్థత అనేకసార్లు బయటపడిందని విమర్శించారు. కరోనా వైరస్ నియంత్రణ మోదీ సర్కార్ విఫలమైందని విమర్శించారు. బీజేపీ పాలనలో దేశ పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ గెలిచామని సంబరపడిన.. యూపీ, ఉత్తరాఖండ్‌లలో ఆ పార్టీ బలం తగ్గిందని.. ఇది దేనికి సంకేతమో బీజేపీ ఆలోచించుకోవాలన్నారు. పంజాబ్‌లో బీజేపీని రైతులు తరిమికొట్టారని అన్నారు. మోదీ ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ దాడులు చేసినా భయపడేది లేనది స్పష్టం చేశారు. తమ పోరాటం ధాన్యం కొనుగోళ్ల వద్దే ఆగిపోదని.. ఇతర అంశాలపై కూడా పోరు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

ఈ క్రమంలోనే కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరులో వెనక్కి తగ్గేది లేదని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కొంతకాలంగా జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్.. పలు రాష్ట్రాల్లోని కీలక నేతలతో సమావేశమవుతున్నారు. అయితే తాజాగా బీజేపీపై వ్యతిరేక పోరుకు సంబంధించి కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలకు ఉపయోగపడే రాజకీయ ఫ్రంటు వస్తుందని చెప్పారు. ఈ విషయం తన రాజకీయ అనుభవంతో చెబుతున్నానని.. ఫ్రంటు ఏర్పాటు ప్రక్రియ ఇదివరకే మొదలైందని వెల్లడించారు. ఈ ప్రక్రియలో తాను కీలక భూమిక పోషిస్తానని కూడా కేసీఆర్ ప్రకటించారు. పరిస్థితులను బట్టి అడుగులు వేయనున్నట్టుగా చెప్పారు. 

మరోవైపు పలు రాష్ట్రాల కీలక నేతలతో సత్సబంధాలు కలిగి ఉన్న రాజకీయ వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ గురించి కూడా కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ రాజకీయాల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ తనతో కలిసి పని చేస్తున్నారని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ పైసలు తీసుకుని పని చేయడని తెలిపారు. దేశం కోసం ఆయన కమిట్‌మెంట్‌ ఏంటో చాలామందికి తెలియదన్నారు. మోదీ, జగన్‌, మమతా బెనర్జీ, స్టాలిన్‌ కోసం పీకే పని చేశారని కేసీఆర్ గుర్తు చేశారు.

స్పష్టమైన వైఖరితో ముందుకు..
అయితే ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే.. బీజేపీని ఎదుర్కొవడానికి తమకు ఓ విజన్ ఉందనే విషయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి తమకున్న విధానాన్ని ఆయన స్పష్టం చేశారనే చెప్పాలి. 2024 నుంచి దేశ రాజకీయాలు సంపూర్ణ క్రాంతి బాటలో పయనిస్తాయని కేసీఆర్ చెప్పడం ద్వారా.. దాదాపు 50 ఏళ్ల కిందట భారతదేశ రాజకీయ చరిత్రలో చోటుచేసుకున్న ప్రధాన ఘట్టాన్ని గుర్తుచేశారు. 1973-75 మధ్యకాలంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయ ఆందోళనలు చెలరేగాయి. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాకు వ్యతిరేకతంగా సాగిన ఆందోళనలు.. భారత ప్రజాస్వామ్యానికి ప్రాణం పోశాయనే చెప్పాలి. 

ఆ సమయంలో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌.. సంపూర్ణ క్రాంతి పిలుపునకు విశేషమైన స్పందన వచ్చింది. బిహార్‌లో అధిక ధరలు, అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి జయప్రకాశ్ నారాయణ్.. ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. అన్ని కాలేజీలు, యూనివర్సిటీలను ఏడాదిపాటు మూసివేయాలని జయప్రకాశ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు పన్ను చెల్లించవద్దని గురించి కూడా మాట్లాడారు. పోలీసులు కూడా తమ విచక్షణను పాటించాలని జెపి కోరారు. జేపీ మాటలు ప్రజలపై మంత్రంగా పనిచేశాయి. అప్పటికే ప్రభుత్వంపై కోపంతో నిండిపోయిన ప్రజలు.. జేపీ ఇచ్చిన సంపూర్ణ క్రాంతి పిలుపునకు స్పందిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు శాంతియుత నిరసనలు కొనసాగించారు. 

సంపూర్ణ క్రాంతి దిశలో.. 
ఉద్యమ స్పూర్తిని బలంగా నమ్మే కేసీఆర్.. సంపూర్ణ క్రాంతి అనే పదాన్ని చెప్పటం ద్వారా.. దేశంలో ప్రతి వర్గాన్ని కదిలించనున్నామనే విషయాన్ని చెప్పారు. నలుగురు నాయకులనో, ముగ్గురు సీఎంలను కదిలిస్తే సరిపోదని.. కదిలించాల్సింది భారత ప్రజానీకాన్ని అని కేసీఆర్ స్పష్టంచేశారు. అదేవిధంగా అప్పుడు ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడు విపక్షాలు అన్ని ఏకతాటిపైకి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తుచేసినట్టయింది. ఈ విధంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపై తీసుకురావాల్సిన అవసరాన్ని చాటిచెప్పారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని.. ఇందిరా గాంధీని గద్దె దించినప్పుడు ఎలాంటి విపక్ష ఏకీకరణ జరిగిందో.. మరోసారి అలాంటి పరిస్థితులనే రీపిట్ చేయాలనేది కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్.. తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర ఉద్దవ్ ఠాక్రే, మాజీ ప్రధాని దేవేగౌడ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ లాంటి వారితో సంప్రదింపులు జరపడాన్ని చూడాలి. 

అయితే బీజేపీయేతర సీఎంల సమావేశానికి కొంత సమయం పడుతుందని కేసీఆర్ చెప్పారు. కలిసొచ్చే నేతలతో చర్చలు జరుపుతామని, ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉన్నదని, అందులో ఉత్తమమైనదాన్ని ఎంచుకొంటామని వెల్లడించడం ద్వారా సమిష్టిగా ముందుకు సాగనున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. తమది బీజేపీకో, కాంగ్రెస్‌కో వ్యతిరేక ఫ్రంట్‌ కాదని, భారత ప్రజల అనుకూల ఫ్రంట్‌ అని, ప్రజల మేలు కోరే రాజకీయ ఫ్రంట్‌ అని చెప్పారు.

అన్ని వర్గాలను కలుపుకుని పోరాడుతాం.. 
ఇక్కడే కేసీఆర్ రెండంచెల వ్యుహాన్ని అనుసరిస్తారనేది స్పష్టం అవుతుంది. ఓవైపు విపక్షాలను ఏకతాటిపైకి తేవడంతో పాటు.. మరోవైపు సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుని పోవడం. రెండో వ్యుహాం విషయానికి వస్తే.. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయిని కేసీఆర్ చెప్పారు. వీటిని పరిష్కరించుకోవడానికి రాజకీయ నేతలు పోరాడితే సరిపోదని.. అన్ని వర్గాల నుంచి పోరు సాగాలని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. ఇందులో భాగంగా నిన్నటి ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో వివిధ వర్గాలను, విద్యార్థులను కదిలిస్తామని వెల్లడించారు. దేశంలో 20 లక్షల మంది లాయర్లు ఉన్నార.. దేశంలో 1,018 యూనివర్సిటీలు, 45 వేల నుంచి 65 వేల వరకు డిగ్రీ కాలేజీలున్నాయని.. వీరందర్నీ కదిలిస్తామని కేసీఆర్ వెల్లడించారు. దీనిపై పీకే తనతో కలిసి పని చేస్తున్నారని చెప్పారు. 

పదే పదే సామాజిక మార్పు తీసుకోస్తామని చెప్తున్న కేసీఆర్.. ఆ దిశలోనే అన్ని వర్గాల సమస్యలను ప్రస్తావించడం ద్వారా వారి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో సమావేశమవుతున్నట్టుగా చెప్తున్న కేసీఆర్.. వారందరి మద్దతుతో ముందుకు సాగేలా ఆలోచనలు చేస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios