చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ నిజమేనా: అసలేం జరుగుతోంది?
చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. నిన్న నాదెండ్ల మనోహర్, నేడు సోము వీర్రాజు ప్రకటనలతో చిరంజీవి భవిష్యత్తు కార్యాచరణపై ప్రచారం సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా, జనసేన- బిజెపి కూటమి తీవ్రంగానే ప్రణాళికలు రచిస్తూ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటబోతుందా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఇందుకు ప్రధాన కారణం.
జనసేన, బిజెపి కూటమికి మద్దతు ఇస్తానని చిరంజీవి హామీ ఇచ్చినట్లు నిన్న జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించగా, నేడు బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ ప్రకటనలపై చిరంజీవి ప్రతిస్పందించలేదు. ఆయన మనోగతం ఏ విధంగా ఉందని రానురాను బయటపడే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికిప్పుడైతే ఆయన రాజకీయాల పట్ల విముఖంగానే ఉన్నారు.
రాజకీయాల్లోకి రావద్దని ఆయన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, కమలహాసన్ లకు సలహా కూడా ఇచ్చారు. ఆయన రాజకీయాల పట్ల తీవ్రమైన విరక్తితో ఉన్నట్లు ఇప్పటి వరకు కనిపిస్తూ వస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన, ఆ తర్వాత కాంగ్రెసులో ప్రజారాజ్యం విలీనం, రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక వంటి పరిణామాలు ఒక రకంగా చకచకా సాగిపోయాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
ఆ సమయంలో ఆయనపై తీవ్రమైన ఒత్తిడి పడింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, ఆ తర్వాత హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేయాలనే డిమాండుపై సమైక్యాంధ్రవాదులు ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. దాంతో ఆయన తీరిక లేని రాజకీయ జీవితాన్ని గడిపారు. సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.
ఆ తర్వాత ఆయన ఖైదీ నెంబర్ 150తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ప్రజల నుంచి లభించిన ఆదరణకు తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు కూడా. దాంతో ఆయన సినిమాలకే పూర్తిగా తన సమయాన్ని వెచ్చించాలని నిర్ణయించుకుని, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కూడా ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు.
అయితే, బిజెపి రాష్ట్రాధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత చిరంజీవిని సోము వీర్రాజు కలిశారు. అది మర్యాదపూర్వకమైన భేటీ అని మాత్రమే అందరూ అనుకున్నారు. రాజకీయాలకు దూరమైన తర్వాత చిరంజీవి అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. ఇరువురు ముఖ్యమంత్రులను కూడా సినీ సంబంధమైన విషయాలపై ఆయన కలిశారు.
సినీ రంగానికి ఆయన పెద్ద దిక్కుగా మారినట్లు కూడా కనిపిస్తున్నారు. పలు సందర్భాల్లో సినీ రంగానికి సంబంధించిన విషయాలపై ముందుండి సమస్యలను పరిష్కరించేందుకు పూనుకున్నారు. తాజాగా, నాదెండ్ల మనోహర్, సోము వీర్రాజు చేసిన ప్రకటనలతో ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం సాగుతోంది.
వచ్చే ఎన్నికల్లో చిరంజీవి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తారా, జనసేన- బిజెపి కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి వదిలేస్తారా అనేది వేచి చూడాల్సింది. అంతకన్నా మించి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయా కూడా వేచి చూడాల్సిందే. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో చిరంజివీ రాజకీయాల్లోకి వచ్చి బిజెపి, జనసేన కూటమికి నాయకత్వం వహిస్తారా అనేది కూడా చూడాల్సే ఉంది.