Huzurabad bypoll result 2021: కేసీఆర్ అహంకారం, ఈటల ఆత్మగౌరవం
ఈటల రాజేందర్ విజయం వెనక ఆత్మగౌరవం, సానుభూతి పనిచేసిందని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ అహంకారానికి, ఈటల రాజేందర్ ఆత్మగౌరవానికి మధ్య జరిగిన పోటీగానే హుజూరాబాద్ ఉప ఎన్నికను చూస్తున్నారు.
హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు కనిపిస్తున్నారు. తన ప్రచారంలో ఈటల రాజేందర్ పెద్ద పెద్ద మాటలేవీ మాట్లాడలేదు. మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర మంత్రులు, TRS నేతలు చేసిన విమర్శలను తిప్పికొడుతూ ప్రజలకు చేరువగా వెళ్లే ప్రయత్నమే చేశారు. టీఆర్ఎస్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం గురించి మాట్లాడుతూ వచ్చారు. ఆ రకంగా ఈటల రాజేందర్ ను ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. దానికితోడు, ఈటల రాజేందర్ గెలిస్తే బిజెపికి ఒక ఎమ్మెల్యే పెరుగతారే తప్ప చేసేదేమీ ఉండదని కూడా చెబుతూ వచ్చారు.
అయితే, ఈటల రాజేందర్ ఎన్నికను పూర్తిగా స్థానికాంశాలకే పరిమితం చేశారు ముఖ్యంగా ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య పోటీగా ఎన్నికను ఆయన చిత్రించారు. దానికితోడు సానుభూతి కూడా కలిసి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల రాజేందర్ మీద అవినీతి ఆరోపణలు చేసి, మంత్రివర్గం నుంచి తప్పించడం Eatela rajenfer కు కలిసి వచ్చింది. తెలంగాణ కోసం నిరంతరం పోరాడిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈటల రాజేందర్ ను కావాలనే KCR టార్గెట్ చేశారనే అభిప్రాయం హుజూరాబాద్ ప్రజల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఏర్పడింది. అంతకన్నా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కున్న నేతలు ఇంకా మంత్రివర్గంలో ఉండడాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.
ఈటల రాజేందర్ ను ఓడించడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నాలేవీ లేవు. Dalitha Bandhu పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లిలో ప్రారంభించారు. అక్కడ కూడా టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బే తగిలింది. నియోజకవర్గంలోని దాదాపు 45 వేల మంది దళితుల ఓట్లను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ దళితబంధును ప్రవేశపెట్టారు. కానీ దళితులు టీఆర్ఎస్ కు మూకుమ్మడిగా మద్దతు ఇవ్వకపోగా, ఈటల రాజేందర్ కు మద్దతు ఇచ్చారు.
నియోజకవర్గానికి చెందిన వకుళాభరణంకు బీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి 61 వేలకు పైగా ఓట్లు సాధించిన కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి ఆయన పేరును సిఫార్సు చేశారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మరు నిమిషం నుంచి హుజూరాబాద్ ఉప ఎన్నిక కేంద్రంగానే కేసీఆర్ ఆలోచనలూ చర్యలూ సాగుతూ వచ్చాయి.జమ్మికుంట మండలంలో వైద్య కళాశాలను, జమ్మికుంట-హుజూరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు కూడా గాలిలో కలిశాయి.
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంత్ రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్వగ్రామం సింగాపూర్ లో కూడా ఈటల రాజేందర్ కు మెజారిటీ వచ్చింది. పైగా,, మంత్రి Harish Rao తన ప్రచారాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి సొంత ప్రాంతం వీణవంక మండలంలో టీఆర్ఎస్ 2,505 ఓట్లను కోల్పోయింది.
ఇల్లందుకుంట మండలంలో తమకు మెజారిటీ వస్తుందని టీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. ఈ మండలంలో రాత్రి 9గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ మండలంలో అత్యధికంగా 90.73 శాతం ఓటింగ్ జరిగింది. అయితే టీఆర్ఎస్ అశలను గల్లంతు చేస్తూ ఈటల రాజేందర్ కు 3,135 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈటల రాజేందర్ సొంత ప్రాంతం కమలాపూర్ ఆయనకే జైకోట్టింది.