తెలంగాణ కోటాలో పద్మ అవార్డులకు ఎంపికైన ఐదుగురిలో ఒక్కరైనా ఇక్కడి వాళ్ళు ఉన్నారా?
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది తెలంగాణ నుంచి ఐదుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. అయితే తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైనవారి మూలాల విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతుంది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది 109 మందిని 106 పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఆరుగురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ (మూడు కేటగిరీల్లో ఇద్దరేసి ఎంపికయ్యారు) అవార్డులను ప్రకటించింది. పద్మ అవార్డులు కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవలతో కూడిన వివిధ విభాగాలు లేదా కార్యకలాపాల రంగాలలో ఇవ్వబడతాయనే సంగతి తెలిసిందే.
ఈ ఏడాది తెలంగాణ నుంచి ఐదుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు చినజీయర్ స్వామి, కమలేష్ డి పటేల్‌లకు పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. ప్రముఖ శాస్త్రవేత్త మోదడుగు విజయ్ గుప్తా, ప్రముఖ వైద్యుడు పసుపులేటి హనుమంతరావు, ప్రముఖ భాషావేత్త బి రామకృష్ణా రెడ్డిలు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. అయితే తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైనవారి మూలాల విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతుంది. తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన ఐదుగురిలో ఒక్కరైనా తెలంగాణ వాళ్ళు ఉన్నారా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
చిన జీయర్ స్వామి మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని.. ఆయన అక్కడే జన్మించారని అంటున్నారు. కమలేష్ డీ పటేల్ ఉత్తరభారత్ (గుజరాత్)కు చెందిన వారని, రామకృష్ణా రెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందినవారని, మోదడుగు విజయ్ గుప్తా ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందినవారని పోస్టులు చేస్తున్నారు. ఇక, పసుపులేటి హనుమంతరావు మూలాలు మాత్రం తెలంగాణలోని ఉన్నాయని అంటున్నారు. ఆయన హైదరాబాద్‌లోనే జన్మించారని.. ఆయన విద్యాభాసం కూడా తెలంగాణలోనే సాగిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపిక చేసినవారిలో ఇతర ప్రాంతాలకు చెందినవారు ఉండటంపై పలువురు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు ఆయన ఇక్కడే వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైనవారి నేపథ్యం గురించి ఒకసారి పరిశీలిస్తే..
చినజీయర్ స్వామి ఆధ్యాత్మిక వేత్తగా గుర్తింపు పొందారు. ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. 1980 ప్రాంతంలో త్రిదండి సన్యాసిగా దీక్షను స్వీకరించారు. వైష్ణవంపై ఆధ్యాత్మిక ప్రసంగాలకు ప్రసిద్ధి చెందారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు.. జీయర్ ఎడ్యూకేషనల్ ట్రస్టు ద్వారా పలువురికి విద్యను అందిస్తున్నారు. హిందూ తత్వవేత్త, సంఘ సంస్కర్త రామానుజాచార్యకు అంకితం చేస్తూ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. గతేడాది ఫిబ్రవరిలో సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
కమలేష్ డీ పటేల్.. దాజీగా ప్రసిద్ధి చెందారు. ఆయన గుజరాత్‌లో జన్మించారు. ఆధ్యాత్మిక వేత్త, రాజయోగా మాస్టర్‌గా మంచి గుర్తింపు సాధించారు. మేడిటేషన్‌పై ప్రసంగాలకు ఆయన బాగా ప్రసిద్ధి చెందారు. 2014 నుంచి శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.
మోదడుగు విజయ్ గుప్తా ఒక జీవశాస్త్రవేత్త, మత్స్య శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. విజయ్ గుప్తా ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో జన్మించారు. ఆయన ఆక్వాకల్చర్ రంగంలో ప్రధానంగా పనిచేశారు. ఆగ్నేయాసియాలో నీలి విప్లవానికి మార్గదర్శకునిగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మత్స్యశాఖల సాంకేతిక సలహాదారునిగా పనిచేశారు.
డాక్టర్ పసుపులేటి హనుమంతరావు.. పిల్లల వైద్య నిపుణులు. హైదరాబాద్‌లో జన్మించిన హనుమంతరావు.. డెవలప్‌మెంటల్ పీడియాట్రిక్స్, రిహాబిలిటేషన్ మెడిసిన్, సైకాలజీలో తన స్పెషలైజేషన్‌కు అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందారు. మానసిక వికలాంగులకు, వికలాంగులకు పునరావాసం కల్పించేందుకు ఆయన కృషి చేశారు.
బి రామకృష్ణా రెడ్డి ప్రముఖ భాషావేత్తగా గుర్తింపు పొందారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో జన్మించారు. ఆయన కివి, మందా, కుయ్ వంటి గిరిజన, దక్షిణాది భాషల పరిరక్షణకు అపారమైన కృషి చేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా వ్యవహరించారు. మాండా-ఇంగ్లీష్ నిఘంటువును కూడా రూపొందించారు.