కోరాన్ వైరస్ మహమ్మారి  ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. మందు లేదు, వాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో అన్ని దేశాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ఒక్కటే శరణ్యంగా భావించాయి. భావించడమే తడవుగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి కూడా. 

అభివృద్ధి చెందిన దేశాలతోపాటుగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు కూడా ఇదే లాక్ డౌన్  మార్గాన్ని పాటించాయి. లాక్ డౌన్ పాటించినప్పటికీ ఈ మహమ్మారికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుందో అర్థం కాక వైద్యులు, పరిశోధకులు తలలు బాదుకుంటున్నారు. 

ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారికి అంతం ఎప్పుడని కేవలం వైద్యులు, ప్రభుత్వాలు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఈ మహమ్మారికి అంతం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోవాలంటే... గతంలో మహమ్మారుల అంతం ఎలా జరిగింది, ఎవరు మహమ్మారి అంతమైంది అని ప్రకటిస్తారు, ప్రజలు ఎలా ఆ ప్రళయం నుంచి  బయటపడ్డారో తెలుసుకోవాలి. 

ఒక మహమ్మారి అంతం అయింది అని రెండు విధాలుగా చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు. ఒకటి వైద్య పరిభాషలో మరణాల రేటు, కేసులు గణనీయంగా పడిపోయినప్పుడు, రెండవది సామాజికంగా.... ప్రజల్లో ఎప్పుడైతే మహమ్మారిపట్ల నెలకొన్న భయం పూర్తిగా తొలిగిపోయినప్పుడు. ఈ రెండు సందర్భాల్లో మహమ్మారి మనల్ని వీడింది అని మనం చెప్పవచ్చు. 

ఈ రెండిటిలో ఏది ముందుగా జరుగుతుంది, రెండు ఒకటేసారి జరుగుతాయా అనే ప్రశ్నలకు ఇదమిత్థమైన సమాధానం మాత్రం లేదు. ఒకరకంగా చెప్పాలంటే..కోడి ముందా గుడ్డు ముందా అనే పరిస్థితి. 

చరిత్ర ఏమి చెబుతుంది..... 

చరిత్రలో మహమ్మారులు అనేకం వచ్చాయి, వినాశనాన్ని సృష్టించాయి, వెళ్లిపోయాయి. తాజాగా మనకు తెలిసిన కొన్ని మహమ్మారులు ఎలా ఈ ప్రపంచాన్ని వణికించాయో, ఎలా అంతమయ్యాయో ఒకసారి చూద్దాం. 

మధ్యయుగ కాలంలో  మానవాళి మీద దాడి చేసిన బ్యుబోనిక్ ప్లేగ్ అనేకసార్లు 19వ  శతాబ్దం వరకు ప్రపంచాన్ని వణికించింది. ఆతరువాత అది కనుమరుగయింది. దానికి సరైన కారణం ఇప్పటికి తెలియకున్నప్పటికీ... వాతావరణ మార్పుల వల్ల అది తుడుచుపెట్టుకుపోయిందని కొందరంటుంటే, మరికొందరేమో ఆ ప్లేగ్  భాసితేరియాలో వచ్చిన మార్పుల కారణంగా అది మరుగున పడిపోయిందని అంటున్నారు. 

ఇలా ప్రపంచాన్ని వణికించిన మరో మహమ్మారి మశూచి. ఈ మహమ్మారినుండి మానవాళి బయటపడడానికి తొలుత క్వారంటైన్ పద్ధతినే పాటించేవారు. లక్షణాలు అందరికి కనిపించే విధంగా ఉండడంతో వారిని క్వారంటైన్ లోకి తరలించడం అత్యంత తేలికగా మారేది. ఇక దానితోపాటుగా వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన తరువాత ఈ వైరస్ కి వాహకం ఏది లేదు అని తెలియడం, వాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో ఈ మహమ్మారిపై మానవాలి విజయం సాధించగలిగింది. 

ఆ తరువాత 20వ శతాబ్దంలో స్పానిష్ ఫ్లూ. ఆ మహమ్మారి సృష్టించిన విలయతాండవం నుంచి ఎటువంటి మందులేకుండానే మానవాళి బయటపడగలిగింది. ఆ ఫ్లూ ఇంకొక సాధారణ ఫ్లూ గా రూపాంతరం చెందడంతో ఇది అంతరించిపోయినట్టు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. 

ఇక చివరగా ఈ స్థాయిలో ప్రపంచాన్ని వణికించిన మరో మహమ్మారి ఎబోలా. 2014 నుంచి 2016 కాలంలో పశ్చిమ ఆఫ్రికా అంతా కూడా ఈ మహమ్మారి గుప్పిట ఉండిపోయింది. 11వేల పైచిలుకు మంది ఈ   మహమ్మారి బారినపడి ప్రాణాలను వదిలారు. 

ఈ మహమ్మారి 2016 నాటికి  అంతమయిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినా.... రెండు సంవత్సరాలపాటు ఈ మహమ్మారి భయం నుంచి ప్రజలు బయటకు రాలేదు. వైద్యరంగం ప్రకారంగా ఈ మహమ్మారి అంతరించిపోయినప్పటికీ.... సామాజికంగా ప్రజల్లో మాత్రం ఈ వైరస్ పట్ల భయం మాత్రం వెంటనే పోలేదు. 

మరి కరోనా మహమ్మారి పరిస్థితి ఏమిటి....?

కరోనా వైరస్ మహమ్మారి వల్ల లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. కేసుల సంఖ్య అరకోటి పైమాటే. ఈ స్థాయిలో ఈ మహమ్మరి విజృంభిస్తున్నప్పటికీ.... ప్రజల్లో మాత్రం ఈ మహమ్మారిపట్ల భయమే ముందుగా పోయేటట్టు కనబడుతుంది. 

ఈ మహమ్మారి దెబ్బకు అన్ని దేశాలు కూడా లాక్ డౌన్ ను విధించాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అంతా కూడా దాదాపుగా కుదేలయింది. ఒక్క మనదేశమే రోజుకు 35 వేల కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది. అంతర్జాతీయంగా గనుక మాట్లాడుకుంటే... 8.8 ట్రిలియన్ డాలర్లకు పైమాటే!

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. జీవనోపాధిని కోల్పోయారు. ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో వైద్య రంగం దీనికి ఒక మందో వాక్సిన్ నో కనుక్కునేలోపే ప్రజల్లో తమ జీవనోపాధిని కోల్పోతున్నామన్న భయం ఎక్కువవుతుంది. అది ఇప్పటికే మనకు చాలామందిలో కనబడుతుంది. 

మరోపక్క ఈ మహమ్మారికి ఇప్పటికిప్పుడు వాక్సిన్ గానీ మందు కానీ కనుచూపుమేరలో కనబడడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం కనీసం మరో రెండు సంవత్సరాల కాలం అయినా పడుతుంది అని తెలిపింది.  

ఈ పరిస్థితిని చూస్తుంటే.... మనం ఈ కరోనా వైరస్ మహమ్మారితో మిగిలిన వైరస్ ల తో అయితే ఎలా సహజీవనం చేస్తున్నామో, అలానే చేయవలిసి వచ్చేలా కనబడుతుంది.