Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు: హైకోర్టు తీర్పు వెనక కారణాలు ఇవే...

హైకోర్టు ఇలా రమేష్ కుమార్ ని తిరిగి నియమించాలని ఎందుకు చెప్పింది. అప్పుడు వైసీపీ ఏమో తీసుకొచ్చిన ఆర్డినెన్సు రమేష్ కుమార్ ను ఉద్దేశించి జారీ చేసింది కాదని, ఇది పంచాయతీ రాజ్ చట్టంలో సంస్కరణల కోసం తీసుకొచ్చిందని చెప్పుకొచ్చింది. 

High Court Shocks AP Government in Nimmagadda Ramesh Kumar Issue, The reason Behind
Author
Amaravathi, First Published May 30, 2020, 8:16 AM IST

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు తాజాగా హై కోర్టు  షాకిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సును కొట్టేయడం ద్వారా కనగరాజ్ తొలిగింపు, రమేష్ కుమార్ చేరికకు ఏకకాలంలో లైన్ క్లియర్ అయింది. వెంటనే బాధ్యతలను స్వీకరిస్తున్నట్టు కూడా రమేష్ కుమార్ తెలిపారు. 

హైకోర్టు ఇలా రమేష్ కుమార్ ని తిరిగి నియమించాలని ఎందుకు చెప్పింది. అప్పుడు వైసీపీ ఏమో తీసుకొచ్చిన ఆర్డినెన్సు రమేష్ కుమార్ ను ఉద్దేశించి జారీ చేసింది కాదని, ఇది పంచాయతీ రాజ్ చట్టంలో సంస్కరణల కోసం తీసుకొచ్చిందని చెప్పుకొచ్చింది. 

ఇప్పుడు హై కోర్టు కూడా ఈ ఆర్డినెన్సును రద్దు చేయడం, రమేష్ కుమార్ తిరిగి విధుల్లో చేరుతుండడంతో అసలు కోర్టు ఈ తీర్పును ఎందుకు ఇచ్చింది అనేది ఇక్కడ అందరి మనసుల్లోనూ మెదులుతున్న ప్రశ్న. 

అసలు జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ కి మధ్య విబేధాలు పొడచూపడానికి కారణం స్థానిక సంస్థల వాయిదా. కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేశారు రమేష్ కుమార్. ఇలా ఎన్నికలను వాయిదా వేయడంతో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీవ్రంగా ఆగ్రహం చెందింది. 

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ ని కలిసి, ప్రెస్ మీట్లు పెట్టి బాహాటంగానే ఆయనను విమర్శించారు. ఆ తరువాత వైసీపీ శ్రేణులన్నీ కూడా ఆయనను టార్గెట్ చేసుకొని విమర్శలు చేసారు. 

ఆ తరువాత కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజులపాటు ఆ విషయం మరుగున పడ్డట్టు అనిపించినప్పటికీ... అనూహ్యంగా ప్రభుత్వం ఆర్డినెన్సును తీసుకొచ్చి రమేష్ కుమార్ ని తొలగించింది. 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(k) ప్రకారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పదవి కాలం, ఆయన విధి విధానాలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారంగానే ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పదవి కాలాన్ని నిర్ణయించడంలో రాష్ట్రప్రభుత్వానిదే పూర్తి నిర్ణయాధికారం. 

కానీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల ప్రధానాధికారిని తొలిగించే అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఆయనను హై కోర్ట్ జడ్జిని తొలిగించినట్టు తొలగించాల్సి ఉంటుంది. అంటే.... ఆయనను తొలగించే అధికారం పార్లమెంటుది. పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీతో తొలగించాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని తొలిగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రధానాధికారి పదవి కాలాన్ని కుదించడం ద్వారా, రమేష్ కుమార్ పదవి కాలం పూర్తయినట్టుగా చూపెడుతూ ఆయనను తొలిగించారు. ఎన్నికల కమిషన్(రాష్ట్రం, కేంద్రం) కి రాజ్యాంగం ఇచ్చిన రక్షణల ప్రకారం ఇలాంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండేవారి హక్కులను కాలరాసేలా, వారి ప్రయోజనాలకు విరుద్ధంగా వారి సర్వీస్ కండిషన్స్ ని మార్చరాదు. సుప్రీమ్ కోర్టు కూడా తన గత తీర్పుల్లో అనేకసార్లు ఇదే విషయాన్నీ స్పష్టం చేసింది.  

ఇప్పుడు రమేష్ కుమార్ విషయంలో కూడా అదే వాణిని వినిపించింది హై కోర్ట్. ఎలక్టోరల్ రిఫార్మ్స్ లో భాగంగా ఎన్నికల ప్రధానాధికారి పదవి కాలాన్ని తొలిగించినప్పటికీ... అది ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారి హక్కులకు భంగం వాటిల్లేలా ఉన్నందున దాన్ని కోర్టు కొట్టివేసింది. 

రాజ్యాంగంలోని అనేక పదవులు నిష్పక్షపాతంగా పనిచేసేందుకు, వాటిపై ప్రభుత్వ ఒత్తిడిని అతితక్కువగా ఉంచేందుకు రాజ్యాంగ నిర్మాతలు ఇలాంటి నిబంధనలను పెట్టారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అయినా, కేంద్ర ఎన్నికల కమీషనర్ అయినా వారి నిష్పక్షపాత వైఖరి భారత ప్రజాస్వామ్యానికి అత్యవసరం. టిఎన్ శేషన్ గురించి మనం ఇంకా కూడా మాట్లాడుకుంటున్నాము అంటే ఆయన నిష్పక్షపాత వైఖరే కారణం. 

రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్ని అయినా కోర్టు కొట్టివేస్తుంది. రాజ్యాంగబద్ధమైన సంస్థల హక్కులను పరిరక్షించడంలో కోర్టు ఎప్పుడు కూడా ముందుంటుంది. అదే ఇప్పుడు కూడా జరిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios