Asianet News TeluguAsianet News Telugu

కోర్టు కేసులు: ఎదురుదాడిలో కేసీఆర్ సక్సెస్, ఆత్మరక్షణలో జగన్

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల విషయంలో, సుధాకర్ డాక్టర్ విషయంతో పాటుగా అనేక విషయాల్లో వరుసగా కోర్టు తీర్పులు అనుకూలంగా రాలేదనగానే వైసీపీ నేతలు, క్యాడర్ కూడా కోర్టులను తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.  

Handling Court Verdicts: AP CM YS Jagan Has A Lot To Learn From Telangana CM KCR
Author
Hyderabad, First Published Jun 2, 2020, 9:10 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రమేష్ కుమార్ వ్యవహారం హాట్ టాపిక్. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిష్పక్షపాతమైన అధికారి అయినప్పటికీ... ఆయనను అధికార వైసీపీ క్యాడర్, నాయకులు దూషించిన విధానం కానీ, ఆయన లేఖపై చేసిన అభియోగాలు కానీ, ఆ తరువాత విపక్షాల ఎంట్రీ, అన్ని వెరసి ఈ అంశానికి రాజకీయ రంగును పులిమాయి. 

ఇక ఆయన పదవి కాలం పూర్తయిందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్దినెన్సు రద్దు అవడంతో, ఆయన తొలగింపు చెల్లకపోగా, జస్టిస్ కనగరాజ్ నియామకం కూడా చెల్లకుండా పోయింది. హై కోర్టు ఆయనను పునర్నియమించమని రాష్ట్ర ప్రభుత్వాన్నీ ఆదేశించింది. 

తన హక్కుల ప్రకారం తాను నియమితుడను అవుతున్నట్టు రమేష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేయడం, రెండు నెలల సమయం ఉందంటూ ఏజీ ప్రెస్ మీట్ పెట్టిమరీ చెప్పడం అన్నీ వెరసి ఒక గందరగోళ పరిస్థితులనయితే సృష్టించాయి. 

న్యాయస్థానాలు ఇచ్చినతీర్పులు సత్వరమే అమలవుతాయి. వాటికి కాలపరిమితులవంటివి ఉండవు. అయినప్పటికీ హై కోర్టుతీర్పు విషయంలో ప్రభుత్వం పెట్టాల్సినంత పేచీ పెట్టింది. 

ఇక దీనికి ముందు కూడా ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల విషయంలో, సుధాకర్ డాక్టర్ విషయంతో పాటుగా అనేక విషయాల్లో వరుసగా కోర్టు తీర్పులు అనుకూలంగా రాలేదనగానే వైసీపీ నేతలు, క్యాడర్ కూడా కోర్టులను తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.  

ఇంకొన్ని సోషల్ మీడియా పోస్టుల్లోనయితే... చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేసిన విధంగా జగన్ చేయలేకపోతున్నాడని, చంద్రబాబు వద్ద నేర్చుకోవాలని పెట్టారు. ఇలా ఒకరకంగా కోర్టులకు రాజకీయ రంగును పులమడంతో కోర్టులు సీరియస్ అయ్యాయి. 

కోర్టు తీర్పును తప్పుబట్టడంలో తప్పులేదు, కానీ సర్వస్వతంత్రంగా వ్యవహరించే, భారత న్యాయవస్థపైన్నే నిందలు వేయడంతో కోర్టు కూడా సీరియస్ అయ్యింది. కోర్టుకి రాజకీయ రంగును పులమడానికి, కోర్టును అపహాస్యం చేసేలా మాట్లాడినవారందరికి కోర్టు ధిక్కరణ నోటీసులను పంపింది హైకోర్టు. 

కోర్టు తీర్పు ఖచ్చితంగా ఒకరికి అనుకూలంగా ఉంటే, అది ఇంకొకరికి వ్యతిరేకంగానే ఉంటుంది. అది సహజం. కోర్టు తీర్పులు కేంద్ర ప్రభుత్వానికి కూడా అనేకసార్లు వ్యతిరేకంగా వచ్చాయి. అన్ని రాష్ట్రాల్లోనూ వచ్చాయి. 

తెలంగాణాలో గనుక చూసుకుంటే తాజాగా కరోనా వైరస్ పరీక్షల విషయంలో హై కోర్టు ప్రభుత్వానికి తల అంటింది. ఇది చాలా పెద్ద వ్యవహారం. కరోనా వైరస్ పై పోరులో అద్భుతాలు సృష్టిస్తున్నాము అని చెప్పుకుంటున్న సర్కార్ కి ఇది ఒకరకంగా పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. దీనిపై కేసీఆర్ చాలా తెలివిగా వ్యవహరించారు. 

ఆయన ప్రెస్ మీట్ లను గనుక పరిశీలిస్తే ప్రతిపక్షంపై తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. కోర్ట్ తలంటితే ప్రాతిపక్షం మీద విరుచుకుపడడం ఏమిటి అని అనిపించొచ్చు. ఇక్కడే కేసీఆర్ రాజకీయ చతురాత దాగి ఉంది. 

కోర్టులో కేసులు దాఖలు చేసారు అని తెలియగానే మరణాల రేట్లు కావాలంట, మరణాలు ఎక్కువ నమోదవ్వాలని కోరుకుంటున్నారా ప్రతిపక్షాలు అని, తక్కువ టెస్టింగులు చేస్తున్నారంటే.... కేసులు ఉంటె కదా అని ఇలా చాలా తెలివిగా రాజకీయ పార్టీల వైపుగా ఆ చర్చను మళ్లించారు. 

గత సెప్టెంబర్ లో ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా హై కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అధికారులను కోర్టుకు కూడా హాజరుకమ్మని ఆదేశించింది. కేసీఆర్ ఒక్కసారి కోర్టు కొడతదా అని నోరు జారారు తప్ప, వేరే ఏ సందర్భంలోను ఆయన బయటపడలేదు. 

ఆ తరువాత కూడా దానికి ముగింపును చాలా ఘనంగా ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు అడిగినదానికన్నా ఎక్కువగా ఇచ్చి వారిపై వరాలజల్లును కురిపించారు కేసీఆర్. ఆ సందర్భంలో కూడా ఆయన ప్రతిపక్షాల నీతిమాలిన రాజకీయాల వల్లనే ఇలా ఆర్టీసీ కార్మికులు కోర్టుకెక్కుతున్నారని తెలివిగా తనదైన స్టైల్ లో చర్చను రాజకీయం చేసారు. ఆయన వరాల జల్లు దెబ్బకు ఆ కోర్టు వ్యవహారాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజలు దాదాపుగా మరిచిపోయారు. 

ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కడుతున్న ప్రాజెక్టుల విషయంలో కోర్టు అనేకసార్లు ప్రభుత్వ జీవోలను కొట్టివేసింది. మల్లన్నసాగర్ విషయంలో జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. 

కోర్టు ఆ విషయంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టినప్పటికీ... తిన్నది అరగక, తెలంగాణ సుభిక్షంగా ఉండడం చూసి ఓర్వలేక కాంగ్రెస్ వారు ఇలా రైతులతో కేసులు ఎపిస్తూ, తెలంగాణకు నీళ్లు రాకుండా అడ్డుపడుతున్నారు అని అన్నారు తప్ప, ఎక్కడా కూడా హై కోర్టు ని తప్పుబట్టలేదు కేసీఆర్. 

ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలివిగా కోర్టు తీర్పుల విషయంలో నైపుణ్యం ప్రదర్శిస్తుంటే... అదే కోర్టు వ్యవహారాల్లో ఏపీసీఎం జగన్ మాత్రం తడబడుతున్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ ను చూసి నేర్చుకోవడం మొదలుపెట్టాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios