Asianet News TeluguAsianet News Telugu

అధికార వైసీపీకి ఊహించని షాకిచ్చిన పట్టభద్రులు.. ‘‘మూడ్’’మారిందా?.. పవన్‌కు కూడా ఇబ్బందేనా..!!

ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు కారణం.. పట్టభద్రుల కోటాలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలను ప్రతిపక్ష టీడీపీ కైవసం చేసుకోవడమే. 

graduate MLC Elections Shock to ruling YSRCP and Relief to TDP in andhra
Author
First Published Mar 18, 2023, 9:12 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు కారణం.. పట్టభద్రుల కోటాలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలను ప్రతిపక్ష టీడీపీ కైవసం చేసుకోవడమే. 2019లో భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. ప్రతిపక్ష టీడీపీకి పలు సందర్భాల్లో చేదు అనుభవమే ఎదురైంది. అయితే వైసీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ.. స్థానిక సంస్థలకు సంబంధించిన కొన్ని ఎన్నికలకు కూడా టీడీపీ దూరంగా ఉంది. 

అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉన్న సమయంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరికి ఆసక్తి నెలకొంది. మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు(9 స్థానిక సంస్థలు, రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల) ఎన్నికలు జరగగా.. 5 స్థానిక సంస్థల  స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. మిగిలిన 4 స్థానిక సంస్థలు, రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ నిర్వహించగా.. మూడు పట్టభద్రలు మినహా మిగిలిన స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి గట్టి షాక్ ‌తగలిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది.

స్థానిక సంస్థల్లో వైసీపీ హవా ఊహించినదే..
స్థానిక సంస్థలకు సంబంధించి వైసీపీకి పూర్తి మెజారిటీ ఉంది. దీంతో ఆ స్థానాలను వైసీపీ చాలా సులువుగా కైవసం చేసుకుంది. ఐదు స్థానాలను పోటీ లేకుండా ఏకగ్రీవంగా సొంతం చేసుకున్న.. మిగిలిన నాలుగు స్థానాల్లో పోటీని ఎదుర్కొనప్పటికీ భారీ విజయం సొంతం చేసుకుంది. అయితే గతంలో స్థానిక సంస్థలకు నిర్వహించిన ఎన్నికల్లో వైసీపీ సంపూర్ణ మెజారిటీ రావడంతో.. స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని అంతా భావించారు. 

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ తక్కువే..
ఉపాధ్యాయ స్థానాల విషయానికి వస్తే.. అందులో పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ స్థానాలు ఉన్నాయి. ఇందులో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. కానీ ఈ రెండు స్థానాల్లో హోరా హోరీ పోరు జరిగింది. దీంతో వైసీపీ అభ్యర్థులకు చాలా తక్కువ మెజారిటీ దక్కింది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గంలో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డికి 169 ఓట్ల మెజారిటీ ఓట్లు రాగా, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం గెలిచిన వైసీపీ అభ్యర్థి పర్వతరెడ్డి  చంద్రశేఖర్ రెడ్డికి 1,043 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. 

అయితే పలు ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరుగా పోటీచేయడం అధికార వైసీపీకి బాగా కలిసి వచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో.. వైసీపీ సర్కార్‌పై వ్యతిరేకత ఉందని.. అధికార పార్టీ అభ్యర్థులకు పోలైన ఓట్లలో ప్రైవేట్ టీచర్లవే ఎక్కువ అని ఉపాధ్యాయ సంఘాల నుంచి వినిపిస్తున్న మాట. 

ఊహించని షాకిచ్చిన పట్టభద్రులు..
అయితే మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల విషయానికి వస్తే.. అందులో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ స్థానాలు ఉన్నాయి. అయితే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలో టీడీపీ అభ్యర్థులు మంచి మెజారిటీ సాధించినప్పటికీ.. పశ్చిమ రాయలసీమలో మాత్రం టీడీపీ, వైసీపీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆధిక్యం సాధించి విజయం సాధించారు. దీంతో వైసీపీకి ఊహించని విధంగా షాక్ తగిలింది. 

ఎందుకంటే ఈ మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల ప్రాంతాలు.. మొత్తంగా 108 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఉండం కూడా ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందనే విశ్లేషణలు  కూడా ఉన్నాయి.

మూడు రాధానులపై ఎదురుదెబ్బేనా..?
ఎమ్మెల్సీ ఎన్నికలకు.. పలువురు మూడు రాజధానులతో లింక్ పెడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకు మూడు రాజధానుల వైఖరిని తెరపైకి తీసుకొచ్చింది. విశాఖకు పరిపాలన రాజధాని తీసుకోస్తామని.. కర్నూలుకు న్యాయ రాజధానిగా చేస్తామని.. అమరావతి శాసన రాజధానిగా ఉండనుందనిి చెబుతోంది. అయితే ఆ ప్రాంతాల్లోని పట్టభద్రులు మాత్రం ఈ విషయాలను పరిగణలోకి తీసుకోలేదని తాజా ఫలితాలతో స్పష్టం అవుతంది. విశాఖ నుంచి త్వరలోనే పరిపాలన ప్రారంభం కానుందని, కర్నూలు  న్యాయ రాజధానిగా అవుతుందని వైసీపీ నేతలు చెబుతుంటే.. ఆ పార్టీకి రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతం తమ కంచుకోటగా ఉందని వైసీపీ నేతలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం.. ఆ ప్రాంతాల పరిధిలో విస్తరించి ఉన్న ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఖాయమనే అంతా భావించారు. 

వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అంటున్న జగన్ కూడా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని భావించారు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు.. వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. మరోవైపు అధికార పార్టీ ప్రలోభాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. మంత్రి ఉషా శ్రీ చరణ్ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయాలని చెబుతూ ఉన్న  వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం కలకలం రేపింది. 

అయితే ఎవరి ఆరోపణలు  ఎలా ఉన్నా కానీ.. పట్టభద్రులు మాత్రం టీడీపీకే పట్టం కట్టారు. విశాఖ రాజధానిని ఉత్తరాంధ్ర ఎంతగా స్వాగతిస్తున్నామనే దానికి వైసీపీ అభ్యర్థిని అంత భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ నేతలు చెప్పిన మాటలను కూడా పట్టభద్రులు పెద్దగా లెక్కచేయలేదు.దీంతో వారు వైసీపీ చెబుతున్న మూడు రాజధానుల సెంటిమెంట్‌‌ను విశ్వసించడం లేదని (లేదా) వారికి ఆ విషయంలో పెద్దగా పట్టింపు లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

ప్రభుత్వం వ్యతిరేకత స్పష్టమైందా..?
అటు ఉపాధ్యాయులతో పాటు.. ఇటు పట్టభద్రుల్లో కూడా వైసీపీ ప్రభుత్వంపై స్పష్టంగా వ్యతిరేకత కనిపిస్తుందని ఎమ్మెల్సీ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. పట్టభద్రుల్లో చాలా వరకు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్‌ క్లాస్ ఓటర్లే కావడంతో.. ఆయా వర్గాల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఈ ఎన్నికలకు వైసీపీ నేతలే.. అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైన‌ల్‌గా చెప్పారు. వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికలకు సెమీ ఫైన‌ల్ అని చెప్పడం చూస్తే వైసీపీ ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్నికల్లో గెలుపుపై ఆ పార్టీ నాయకులు పూర్తి ధీమా వ్యక్తం చేశారు. కానీ పట్టభద్రులు మాత్రం అందుకు భిన్నంగా తీర్పునిచ్చారు.

ఈ క్రమంలోనే అధికారం చేపట్టినప్పటీ నుంచి విజయాలు సొంతం చేసుకుంటూ వస్తున్న వైసీపీకి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో మాత్రం గట్టి షాక్‌ ఇచ్చాయనే చెప్పాలి. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొంతవరకు బలం చేకూరుస్తున్నాయి. మరి దీనిని వైసీపీ ఎలా స్వీకరిస్తుంది.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగా సిద్దం అవుతుందనేది వేచిచూడాల్సి ఉంది. 

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పవన్‌కు కూడా ఇబ్బందేనా..?
తెలుగుదేశం పార్టీ మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడం జనసేన పవన్ కల్యాణ్‌కు కూడా ఇబ్బందికర పరిస్థితేనని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుగా ముందుకు సాగుతాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే జనసేన కార్యకర్తలు పవన్ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు పవన్ కూడా టీడీపీతో కలిసి వెళ్లేందుకు తమకు ఎక్కువ స్థానాలు  కేటాయించాలనే డిమాండ్ చేస్తున్నట్టుగా తెలస్తోంది. తమకు సముచిత గౌరవం ఇస్తేనే పొత్తుల గురించి ఆలోచిస్తామని పవన్ చెబుతూ వస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జోష్‌లో ఉన్న టీడీపీని.. పవన్ తాను కోరినని స్థానాలు ఇవ్వాలని పట్టుపట్టగలడా? చంద్రబాబు అందుకు అంగీకరిస్తాడా? అంటే కష్టమేనని సమాధానం వినిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios